‘స్మార్ట్‌’గా ఢమాల్‌ అతీగతీ లేని జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి్‌పలు

ABN , First Publish Date - 2022-06-25T08:29:33+05:30 IST

‘స్మార్ట్‌’గా ఢమాల్‌ అతీగతీ లేని జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి్‌పలు

‘స్మార్ట్‌’గా ఢమాల్‌ అతీగతీ లేని జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి్‌పలు

నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటని ఆర్భాటం

ఒక్కచోట కూడా అభివృద్ధి చేయని వైనం 

నెల్లూరు, ప్రకాశంలో ప్రకటించినా గాలికి 

అమరావతిలో లే అవుట్‌కూ ఆదరణ కరువు 

భూములు ఇచ్చేందుకు ముందుకురాని రైతులు

ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపని ప్రజలు 

నమ్మకం లేకపోవడమే కారణమని విశ్లేషణ 

ఇప్పుడు ప్రైవేటు భాగస్వామ్యంతో అని సర్కారు ప్రకటన 


‘‘నియోజకవర్గానికో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేస్తాం. మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకే ప్లాట్లు విక్రయిస్తాం’’ అని 2021లో వైసీపీ సర్కారు ఆర్భాటంగా ప్రకటించింది. రెండేళ్లు అవుతున్నా అతీగతీ లేదు. వేసిన లే అవుట్లు ఎక్కడికక్కడే అన్నట్లుగా ఉన్నాయి. కొన్ని చోట్ల గాలికి వదిలేశారు. మరికొన్ని చోట్ల ప్రతిపాదనల దశలోనే ఆగిపోయాయి. ప్రభుత్వంపై రైతులకు, ప్రజలకు నమ్మకం లేకపోవడం కూడా దీనికి కారణమంటున్నారు. 

మధ్యతరగతి ప్రజలకు ప్లాట్ల సంగతేమో కానీ.. ఆదాయం కోసం ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలన్న ఆలోచన ఫలించలేదు. దీంతో తాజాగా శుక్రవారం జరిగిన కేబినెట్‌ భేటీలో ఈ పథకాన్ని ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.  ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు కలిసి చేసే ఈ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఇంకెన్ని చిత్రాలు ఉంటాయో? ఇప్పటి వరకు వేసిన లే అవుట్లు, వేస్తామన్న వాటి పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మధ్యతరగతి ప్రజల కోసం నియోజకవర్గానికి ఒక జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లే అవుట్‌ను అభివృద్ధి చేస్తామని వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఎలాంటి వివాదాలు, ఇబ్బందులు లేని లే అవుట్‌లను అభివృద్ధి చేసి, అందులో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు రిజర్వేషన్‌ కింద కేటాయిస్తామని చెప్పింది. ఈ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. వెల్లువలా వచ్చే దరఖాస్తులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామని మార్గదర్శకాలు జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కింద లే అవుట్‌ను అభివృద్ధి చేయలేదు. ప్రారంభించిన కొన్ని లే అవుట్ల పరిస్థితి కూడా ఎక్కడివక్కడే అన్నట్లుగా మారిపోయింది. రాజధాని అమరావతిలోనూ ఇలాంటి లే అవుట్‌ ఒకటి వేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రారంభిస్తున్నట్టు హడావుడి చేశారు. లే అవుట్ల కోసం స్థలాలు చూస్తామంటూ పలుచోట్ల మున్సిపల్‌ అధికారులు ప్రకటనలు ఇచ్చారు. ప్రభుత్వం కూడా డబ్బు కుమ్మరించి ప్రకటనలు ఇచ్చింది. కానీ ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ పథకం ముందుకెళ్లలేదు. భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రాకపోగా, ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలూ ఆసక్తి చూపడం లేదు. 


గతంలో గంటలోనే బుక్‌ 

గత ప్రభుత్వం అమరావతిలో హ్యాపీనెస్ట్‌ పేరుతో బహుళ అంతస్థుల అపార్ట్‌మెంట్లను నిర్మించాలని తలపెట్టింది. నీరుకొండ గ్రామం సమీపంలో ఇందుకోసం 14.46 ఎకరాలు కేటాయించింది. మొదటి దశలో 1200 ఫ్లాట్లను నిర్మించాలని నిర్ణయించింది. చదరపు అడుగుకు రూ.3,500 చొప్పున ధర నిర్ణయించి, ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి మొదటి ప్రాతిపదికన కేటాయింపులు చేయనున్నట్టు ప్రకటించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ ప్రారంభం కాగానే దరఖాస్తు చేసుకోవడానికి వేలాదిమంది కంప్యూటర్ల ముందు కూర్చుని పోటీ పడ్డారు. ఒక్క గంట వ్యవధిలోనే అన్ని ఫ్లాట్లు బుక్‌ అయిపోయాయి. హైదరాబాద్‌, అమెరికాలో ఉన్నవాళ్లు కూడా ఎగబడి బుక్‌ చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మారాక ఆ ప్రాజెక్టును అటకెక్కించేశారు.


పట్టాలెక్కని టౌన్‌షి్‌పలు 

రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక లే అవుట్‌ అభివృద్ధి చేస్తామని   ఆర్బాటంగా ప్రకటించినా, ఎక్కడా అభివృద్ధి చేయలేదు. వాస్తవానికి ప్రభుత్వం కొంత వ్యాపార దృక్పథంతోనే  ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ భూములుంటే వాటిని లే అవుట్లుగా అభివృద్ధి చేసి, విక్రయించి సొమ్ము చేసుకోవాలన్నది ఒక ఆలోచన. అదేవిధంగా ప్రైవేటు భూములను సేకరించి, వాటిని లే అవుట్‌లు వేసి విక్రయించాలన్నది మరో ఆలోచన. సరసమైన ధరలకు ప్లాట్లు విక్రయిస్తామని ప్రకటించినా, ఉన్న ధర కంటే ఎక్కువ పెట్టినట్టు తెలుస్తోంది. విశ్వసనీయత లేకపోవడం వల్లే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లే అవుట్‌ పథకం ఢమాల్‌ అయిందని విశ్లేషిస్తున్నారు. 


6 నెలల్లో 140 దరఖాస్తులే

అదే అమరావతిలో వైసీపీ ప్రభుత్వం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పేరుతో ఒక లే అవుట్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. నవులూరులో ప్రభుత్వ భూమిలోనే లే అవుట్‌ అభివృద్ధి చేసి స్థలాలను విక్రయిస్తామని చెప్పింది.  మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకే స్థలాలు ఇస్తామని ప్రకటించింది. గజం ధర రూ.17,499గా నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం వరకు రిబేటు ఇస్తామని ప్రకటించింది. ఈ లే అవుట్‌ను ప్రకటించి దాదాపు ఆరు నెలలైంది. ఇందులో సుమారు 528 ప్లాట్లు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. మీడియాలో ప్రకటనలు కూడా ఇచ్చింది. కానీ ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు 140 మాత్రమే. 

Updated Date - 2022-06-25T08:29:33+05:30 IST