శోభాయమానంగా జగన్నాథుడి రథయాత్ర

ABN , First Publish Date - 2022-07-06T06:06:13+05:30 IST

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించి, పెడదారిపడుతున్న యువతలో భక్తిభావాన్ని నింపే ఉద్దేశ్యంతో చేపట్టిన పూరీ జగన్నాథ రథయాత్ర మంగళవారం సాయంత్రం నల్లగొండ పట్టణంలో శోభాయమానంగా సాగింది.

శోభాయమానంగా జగన్నాథుడి రథయాత్ర
నల్లగొండలో కొనసాగుతున్న రథయాత్ర

ప్రారంభించిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి 

వర్షంలో సైతం విదేశీ భక్తుల నృత్యాలు

ఆకట్టుకున్న మహిళా కోలాట ప్రదర్శనలు 

నల్లగొండ కల్చరల్‌, జూలై 5: భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించి, పెడదారిపడుతున్న యువతలో భక్తిభావాన్ని నింపే ఉద్దేశ్యంతో చేపట్టిన పూరీ జగన్నాథ రథయాత్ర మంగళవారం సాయంత్రం నల్లగొండ పట్టణంలో శోభాయమానంగా సాగింది. హైదరాబాద్‌ రోడ్డులో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదిక వద్ద పూరీ జగన్నాథ్‌ స్వామి ఉత్సవ విగ్రహమూర్తికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సతీమణి రమాదేవి దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం రథంలో స్వామి వారిని ఆశీనులను చేసి భక్తుల హరేరామ.. హరేకృష్ణ నినాదాల మధ్య రథయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మొదలైన రథయాత్ర పంచముఖ హనుమాన్‌ దేవాలయం ఎన్టీఆర్‌ విగ్రహం, క్లాక్‌టవర్‌ సెంటర్‌, బస్టాండ్‌ మీదుగా రామగిరి రామాలయానికి చేరుకుని ఆ యాత్ర అక్కడ ముగిసింది. నల్లగొండ ఎమ్మెల్యే రథయాత్ర వెంట ముందుండి పురవీధుల గుండా నడిచారు. విదేశాలకు చెందిన ప్రతినిధులు, హరేకృష్ణ భక్తులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. పట్టణంలోని పలు దేవాలయాలకు చెందిన భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు, కళాకారులు, మహిళా కోలాట బృందాలు రథయాత్ర ముందు చేసిన ప్రదర్శనలు ఆహ్లాదకరంగా సాగాయి. ఓవైపు వర్షం పడుతున్నా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఆ వర్షంలో సైతం నృత్యాలు చేయడం ఆకర్షణగా నిలిచింది. రథయాత్ర భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మికంగా కొనసాగింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందని ఇస్కాన్‌ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పూరీ జగన్నాథ యాత్రకు నల్లగొండ పట్టణంలోని భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పురవీధులన్నీ భక్తులతో నిండిపోయి హరేరామ..హరేకృష్ణ అనే నినాదాలు మార్మోగాయి. స్వామి వారి ప్రసాదాన్ని ప్రతీ ఒక్కరికి అందజేశారు. భక్తులు అడుగడుగున స్వామి వారికి నీరాజనాలు పలికి మొక్కలు చెల్లించుకున్నారు. పట్టణ పోలీసులు యాత్రకు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ రమేష్‌, ఇస్కాన్‌ సంస్థ ప్రతినిధి మహాశృంగదాసు, ఆనంద్‌ లీలమాత, కౌన్సిలర్లు యామ కవిత దయాకర్‌, రావుల శ్రీనివా్‌సరెడ్డి, జనార్దన్‌, చకిలం వేణుగోపాల్‌రావు, నెహ్రూ, రమేష్‌, సత్తయ్య, నాగేశ్వర్‌రావు, మామిడి పద్మ, రమాదేవి, కవిత, సుజాతా, మాధవి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-06T06:06:13+05:30 IST