Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

జగనన్న కాలనిల్‌

twitter-iconwatsapp-iconfb-icon

జగనన్న ఇళ్లపై ఆసక్తి చూపని లబ్ధిదారులు

ముందుకు సాగని  కాలనీలు

మౌలిక వసతులు లేవంటూ అసంతృప్తి

జిల్లాలో పూర్తయిన ఇళ్లు 549  మాత్రమే


తాళాలు చేతిలో పెడతామని...అనేక నిబంధనలు పెట్టారు. నిధులు తగ్గించారు. ఊళ్లకు దూరంగా స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు ఇళ్లు కట్టుకోమని పట్టుబడుతున్నారు. కానీ ఎక్కడా ఇళ్ల నిర్మాణం ముందుకు కదలడం లేదు. ఇదీ జగనన్న కాలనీల పరిస్థితి.   ప్రభుత్వం ఇస్తోంటే ఎందుకు తీసుకోరు? అని అధికారులు దబాయిస్తున్నారు. ఇళ్లు కట్టుకోకపోతే పట్టాలు రద్దు చేస్తామని బెదిరిసున్నారు. అయినా లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. సమస్య మూలాలను వదిలేసి...ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నంలో ఉండడంతో జగనన్న కాలనీలు ఎందుకూ కొరగాకుండాపోయాయి. జిల్లా వ్యాప్తంగా పూర్తయినవి కేవలం 500 ఇళ్లేనంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


నంద్యాల (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పేద, మధ్య తరగతి కుటుంబాల వారే అధికం. వీరిలో చాలా మందికి సొంత ఇళ్లు లేవు. ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇస్తామనగానే వీరంతా సంతోషించారు. సొంత ఇంటి కల సాకారమవబోతోందని భావించారు. పైగా ఇల్లు కట్టుకోడానికి ముందుకు వస్తే తానే నిర్మించి ఇస్తానని ప్రభుత్వం అనడంతో మరింత సంతోషించారు. జగనన్న కాలనీలో గత ఏడాది జూన్‌లో మెగా గ్రౌండింగ్‌ మేళా పూర్తయ్యాక వైసీపీ ప్రభుత్వం మాట మార్చింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తామని... ఇల్లు కట్టుకునే బాధ్యత లబ్ధిదారులదేనని చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా లబ్ధిదారులు నిరాశకు లోనయ్యారు. పెరిగిన ధరల ప్రకారం ప్రభుత్వం ఇచ్చే ఆ కాస్త డబ్బుతో ఇల్లు ఎలా పూర్తవుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నింటికంటే పెద్ద సమస్య చాలా లే అవుట్లు నివాస ప్రాంతాలకు యోగ్యంగా లేని చోట్ల, ఊరికి దూరంగా ఇచ్చారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అప్పటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ దృష్టికి, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు దృష్టికి తీసుకువెళ్లారు. అయినా ఎలాంటి స్పందన లేదు. దీంతో లబ్ధిదారులు ఇళ్లు కట్టలేమని తేల్చేశారు. 


నిర్మాణ భారం..


ఇంటి నిర్మాణాలు ముందుకు సాగకపోవడంతో ప్రతిపక్షాల నుంచి వైసీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.  ఇంటి నిర్మాణాలు జరిగేలా చూడాలని ప్రభుత్వం అధికారుల పైన ఒత్తిడి తీసుకువచ్చింది. పట్టాలు పొందిన వారు వెంటనే ఇంటి నిర్మాణాలు చేపట్టాలని, లేకపోతే పట్టాలను వెనక్కి తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కొందరు ఇంటి పని ప్రారంభించారు. అయితే పెరిగిన స్టీల్‌, సిమెంటు ధరలతో బేస్‌మెంట్‌ నిర్మాణానికే దాదాపు రూ.3 లక్షలు ఖర్చవుతోందని ఆవేదన చెందుతున్నారు. ఇల్లు పూర్తి కావాలంటే ఎంత లేదన్నా రూ.8 లక్షలు అవుతుందని, ఇంత ఖర్చుతో ఇల్లు కట్టుకోలేమని చాలా మంది తేల్చి చెబుతున్నారు. 


మౌలిక వసతులు కరువే..


సంవత్సరం తిరిగేసరికి మొదటి దశ జగనన్న కాలనీలను పూర్తి చేస్తామని గతేడాది మెగా గ్రౌండిగ్‌ మేళాలో ప్రభుత్వం ప్రగల్బాలు పలికింది. అయితే దానికి తగ్గట్లు కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడలేదు. జిల్లా వ్యాప్తంగా ఏ కాలనీల్లో చూసినా రోడ్డు, నీటి వసతి పూర్తిస్థాయిలో కల్పించలేదు. చాలాచోట్ల నిర్మాణదారులు ట్యాంకర్లతో నీరు తెప్పించుకోవాల్సి వస్తోంది. ఇసుక కూడా సరిగా దొరకడం లేదు. దీంతో చాలా నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇసుక కొరత లేకుండా చూస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం అంటోందిగాని ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. 


 ఇదీ పరిస్థితి..


జిల్లాలోని ఆరు నియోజకవర్గాలతో పాటు పాణ్యం మండలంలో మొత్తం 45,767 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. ఇప్పటి వరకు కేవలం 549 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అంటే 0.01 శాతం మాత్రమే పూర్తయ్యాయి. పునాదుల స్థాయి కంటే దిగువకు పూర్తయినవి 26,466 ఉన్నాయి. అంటే అసలు పునాదుల వరకు కూడా పనులు జరగనివి దాదాపు 19 వేలకు పైగానే ఉన్నాయి. బేస్‌మెంట్‌ లెవెల్‌ వరకు పూర్తయినవి 5,169 ఉండగా, రూఫ్‌ లెవెల్‌ వరకు పూర్తయినవి 1,208 ఉన్నాయి. స్లాబ్‌ వరకు పూర్తయినవి 1,972 మాత్రమే ఉన్నాయి. వీటి నిర్మాణానికి రూ.81.72 కోట్లు మాత్రమే ఖర్చయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పనులు మొదలుపెట్టి సంవత్సరం కావస్తున్నా జగనన్న కాలనీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. 


డోన్‌లో సగం మందే  


డోన్‌, మే 24: డోన్‌ అర్బన్‌లో పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో దొరపల్లి కొండలో 1800 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఇచ్చారు. 1500 మందికి పక్కాగృహాలు మంజూరయ్యాయి. కొండ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోవడానికి పునాదులు తీయడానికే ఖర్చు భారీగా అవుతోందని లబ్ధిదారులు అంటున్నారు.  50 శాతం మంది  ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. అదే విధంగా ఉడుములపాడు జగనన్న కాలనీల్లో దాదాపు 1000 పక్కా గృహాలు మంజూరయ్యాయి. ఇందులో 300 మంది లబ్ధ్దిదారులు మాత్రమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. 


 ఆత్మకూరు కాలనీల్లో నీరేదీ?


ఆత్మకూరు, మే 24: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న కాలనీల్లో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి.  సుమారు 4వేల మంది లబ్ధిదారులకు గతంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వీరిలో చాలా వరకు గృహాలు మంజూరయ్యాయి. ఇందులో భాగంగానే చక్రం హోటల్‌ వెనకభాగంలో 250, దుద్యాల రస్తాలో 310, మైనార్టీ కాలనీలో 350 మంది లబ్ధ్దిదారులు గృహ నిర్మాణాలు మొదలుపెట్టారు. అయితే వీరిని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రూ. 1200 ఖర్చు చేసి వాటర్‌ క్యూరింగ్‌ కోసం ట్యాంకర్ల నీరు కొనాల్సి వస్తోంది. 

 

 నీరు లేక అవస్థలు పడుతున్నాం 

ఆత్మకూరు పట్టణంలోని దుద్యాల రస్తాలో గల  స్థలాల్లో ఇల్లు  నిర్మించుకుంటున్నాం.  కాలనీలో నీటిలభ్యత లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నాం.  వాటర్‌ ట్యాంకర్లను కొని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. లేదా సదూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాలి. అధికారులు ఇళ్ల స్థలాల లేఔట్లలో నీటి సదుపాయం కల్పిస్తే బాగుంటుంది. 


- రఫీక్‌ అహ్మద్‌, గృహ నిర్మాణ లబ్ధిదారుడు, ఆత్మకూరు


నాలుగు గ్రామాల్లో జగనన్న కాలనీలు రద్దు


జూపాడుబంగ్లా, మే 24 : జగనన్న ఇళ్లను సొంతంగా నిర్మించుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో లబ్ధిదారులు ముందుకు రావడంలేదు. జగనన్న కాలనీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు నానాతంటాలుపడి స్థలాలు సేకరించారు. స్థలాల్లో ఉపాధి కింద రహదారులు నిర్మించారు. సరిహద్దులు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు విద్యుత్తు, తాగునీటి సమస్య రాకుండా సౌకర్యాల కోసం రూ. కోట్లు ఖర్చు పెట్టారు. చివరకు ప్రభుత్వం లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకోవాలని చెప్పడంతో లబ్ధిదారులు వెనక్కి వెళ్లారు. దీంతో జూపాడుబంగ్లా మండలంలో 11 లేఅవుట్లు ఏర్పాటు చేయగా అందులో పారుమంచాల, పి.లింగాపురం, భాస్కరాపురం, తూడిచర్ల గ్రామ లేఅవుట్లలో ఒక్క లబ్ధిదారుడు కూడా ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో లేఅవుట్లు పూర్తిగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మండలంలో 1265 ఇళ్లు మంజూరుకాగా, అందులో 819 మంది మాత్రమే ఇళ్లు నిర్మాణ పనుల్లో ఉన్నారు. ఇప్పటి వరకు మండలంలో మొత్తం 6 ఇళ్లు పూర్తయ్యాయని, 33 ఇళ్లకు స్లాబ్‌లు వేశారని, 34 స్లాబ్‌లెవెల్‌, 149 బెస్‌మెంట్‌ లెవెల్‌లో ఉన్నాయని హౌసింగ్‌ ఏఈ శ్రీనాథ్‌ తెలిపారు. ఇప్పటి వరకు  ఇళ్లకు రూ. 1.76 కోట్లు ఖర్చుచేశామని ఆయన చెప్పారు.  ఒక్కో లేఅవుట్‌లో దాదాపు రూ. 3 నుంచి 10 లక్షల వరకు ఖర్చయినట్టు అధికారులు చెబుతున్నారు. రద్దయిన లేఅవుట్లలో తాగునీటి కోసం బోరు వేసి, పైపులైను ఏర్పాటు చేసి, మినీట్యాంకు నిర్మించి రూ. 3లక్షలు ఖర్చుచేసినట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మురళీకృష్ణ తెలిపారు. దీంతోపాటు భాస్కరాపురం గ్రామంలోని లేఅవుట్‌లో కూడా తాగునీటి విభాగం కింద రూ.2.50 లక్షలు ఖర్చుచేసినట్లు ఆయన తెలిపారు. తూడిచర్ల గ్రామపంచాయతీ మజరా గ్రామం కనకయ్యకొట్టాల గ్రామంలో లేఅవుట్‌ మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఇల్లు కట్టుకోడానికి ఎవరు ముందుకురావడంలేదని తెలుస్తోంది. ఈ లేఅవుట్‌లో కూడా తాగునీటి కోసం రూ. 2లక్షల వరకు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. పారుమంచాల గ్రామంలో అతిపెద్ద లేఅవుట్‌. అందులో తాగునీటి కోసం రూ. 10లక్షలు ఖర్చుచేశారు. బోర్లు, పైపులైన్లు, తాగునీటి కోసం 6 నీటితొట్లు ఏర్పాటు చేశారు. ఇవేకాక విద్యుత్‌ సౌకర్యం, ఉపాధి నిధుల కింద రహదారుల నిర్మాణానికి రూ. లక్షలు ఖర్చుచేశారు. మండ లంలోని పోతులపాడు, తర్తూరు గ్రామాల్లో ప్రభుత్వ భూమి లేకపోవడంతో జగనన్న కాలనీ ఏర్పాటు కోసం రూ. లక్షలు వెచ్చించి భూమి కొనుగోలు చేశారు. పోతులపాడు గ్రామంలో 69 మందిగాను 2.30 ఎక రాలు కొనుగోలు చేశారు. ఎకరా రూ. 12లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి ఇస్తే 26 మంది లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు. తర్తూరు గ్రామంలో 95మంది లబ్ధిదారుల కోసం 3.13 ఎకరాలు కొనుగోలు చేశారు. ఎకరా రూ. 8లక్షలు చొప్పున కొనుగోలు చేస్తే 11 మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు. 


 ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు


 ఇంటిస్థలం ఇవ్వడమేగాక ఇళ్లు నిర్మించి లబ్దిదారుల చేతులకు తాళాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ మాట ఆచరణలోకి రాలేదు. లబ్ధిదారులకు ఇచ్చిన స్థలాలు గ్రామానికి దూరంగా ఉండటంతో ఎవరూ ఇళ్లు నిర్మించుకోవడం లేదు. ఊర్లో ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు సరిపోవు. అప్పులభారం మీదపడే అవకాశం ఉంది. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తే బాగుంటుంది.


- పుష్పలలిత, హౌసింగ్‌ లబ్ధిదారు, భాస్కరాపురం 

 

 నిధులు  దుర్వినియోగం  


  ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల నిధులు దుర్వినియోగం అయ్యాయి. ముందు ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు తాళాలు ఇస్తామన్న సీఎం మాట తప్పారు. దీంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. లేఅవుట్లలో అభివృద్ధి పనులు చేసి వదిలేశారు. లే అవుట్లు నియోజకవర్గంలో చాలా చోట్ల రద్దయ్యాయి. లబ్ధిదారులు ఇల్లు కట్టుకొని అప్పులపాలు అవుతున్నారు.  


- రమేష్‌బాబు, సీపీఐ తాలుకా కార్యదర్శి  


పునాదుల్లోనే జగనన్న ఇళ్లు 


ఆళ్లగడ్డ, మే 24: రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పునాదులకే పరిమితమయ్యాయి. ఆళ్లగడ్డ మండలంలో ఎస్‌.లింగందిన్నె, పాతకందుకూరు, చింతకొమ్మదిన్నె, గోపాలపురం, జి.జంబులదిన్నె, బత్తలూరు. కోటకందుకూరు, గూబగుండం గ్రామాల్లో జగనన్న కాలనీలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.80 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు పైసా మంజూరు చేయలేదు. దీంతో ఈ గ్రామాల్లోని కాలనీల్లో ముళ్లకంపలు పెరిగాయే తప్ప ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగలేదు.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.