జగనన్నా.. ఎవరికి ‘తోడు’?

ABN , First Publish Date - 2022-08-04T07:41:46+05:30 IST

జగనన్నా.. ఎవరికి ‘తోడు’?

జగనన్నా.. ఎవరికి ‘తోడు’?

కేంద్ర పథకం కాపీ

భరించే వడ్డీ 15 కోట్లు

ప్రకటనల ఖర్చు రూ.5 కోట్లకు పైగానే!

చిరు వ్యాపారుల పేరిట బ్యాంకు రుణాలు

అంతా తానే చేస్తున్నట్టు వైసీపీ సర్కారు కలరింగ్‌

అర్హులకేదీ లబ్ధి?.. ఎక్కువగా స్వయం సంఘాలకే

చిరు వ్యాపారులకు ఒరిగేదేమీ లేదని విమర్శలు

లబ్ధిదారులందరికీ పూర్తిగా అందని వడ్డీ 

ఇచ్చేది గోరంత.. ప్రచారం కొండంత


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు కేంద్రం ప్రధానమంత్రి స్వానిధి పేరుతో పథకం అమలు చేస్తోంది. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున బ్యాంకు రుణాలు అందజేయాలన్నది ఈ పథకం లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం దీనిని కాపీ కొట్టి కొత్త పథకం ప్రారంభించింది. దానికి జగనన్న తోడు అనే పేరు పెట్టింది. అయితే కేంద్రం పథకాన్ని కాపీ కొట్టిన వైసీపీ సర్కారు.. అమలు చేయడంలో మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదు. జగనన్న తోడు కింద అసలైన లబ్ధిదారులకు రుణాలు అందడం లేదన్న విమర్శలొస్తున్నాయి. 90 శాతం స్వయం సహాయక సంఘాలకు మాత్రమే రుణాలు అందుతున్నాయి. పేరుకు వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు పథకం తెచ్చామని చెబుతున్నా.. ఎంతోమంది అసలైన అర్హులకు ఆ ఫలాలు దక్కడం లేదు. ప్రభుత్వం మాత్రం ప్రతి ఏటా లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో చెప్పుకొంటూ, కోట్లు కుమ్మరించి మరీ ప్రకటనలు ఇస్తోంది. అది కూడా గోరంత సాయానికి కొండంత ప్రచారం చేసుకుంటోంది. లబ్ధిదారుల రుణాలకు రూ.15 కోట్ల వడ్డీ ఇవ్వడానికి ఏకంగా రూ.5 కోట్లు పెట్టి ప్రకటనలు ఇచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు లబ్ధిదారులందరికీ పూర్తి స్థాయిలో వడ్డీ చెల్లించలేదనే విమర్శలూ ఉన్నాయి. బ్యాంకులు రుణాలు అందజేస్తే, అంతా తానే చేసినట్టుగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. జగనన్న తోడు పథకం ప్రచార ఆర్భాటానికే తప్ప దీనివల్ల చిరు వ్యాపారులకు ఒరిగిందేమీ లేదంటున్నారు. పథకం ఏ స్థాయిలో అమలవుతుందో చూసే దిక్కు కూడా లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రచారం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తున్నారు. 


కేంద్ర ప్రభుత్వ పథకం కాపీ.. 

జగనన్న తోడు పథకం తరహాలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వానిధి పేరుతో పట్టణాల్లో పథకం అమలు చేస్తోంది. చిరు వ్యాపారులకు, రోడ్లపైన బండ్లు పెట్టుకుని కూరగాయలు, పండ్లు అమ్ముకునేవారికి, టీ బంకులు పెట్టుకున్నవారికి, బుట్ట నెత్తిన పెట్టుకుని తిరిగి వ్యాపారం చేసుకునేవారికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం దానిని కాపీ కొట్టి ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడంతో లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వకపోవడం, అర్హత విషయంలో నిబంధనలకు విరుద్ధంగా అధికారులు సిఫార్సులు చేయడంతో మొదట్లో బ్యాంకులు రుణాలిచ్చేందుకు ఆసక్తి చూపలేదు. లక్షల మంది వైసీపీ కార్యకర్తలను బ్యాంకుల ముందు నిలబెట్టి వారందరికీ జగనన్న తోడు రుణాలివ్వాలని ఒత్తిడి తేవడంతో బ్యాంకులు నిరాకరించాయి. నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే రుణాలివ్వగలమని, ఇప్పటికే రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా ఎన్‌పీఎంలుగా ఉన్న వారికి ఇవ్వలేమని బ్యాంకులు తేల్చి చెప్పాయి. ఈ క్రమంలో బ్యాంకర్లకు, ప్రభుత్వ అధికారులకు మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. కొన్నిచోట్ల మున్సిపల్‌ అధికారులు చెత్తను బ్యాంకుల ముందు పోసి నిరసన తెలిపారు. 


అర్హులకు అందని రుణాలు 

పథకం ప్రారంభించిన తర్వాత అమలు చేయడంలో విఫలమైతే నవ్వులపాలవుతామని భావించిన ప్రభుత్వం బ్యాంకర్లతో ఒక ఒప్పందానికి వచ్చింది. బ్యాంకులు కోరుకున్న విధంగా స్వయం సహాయక బృందాల పూచీకత్తుతోనే రుణాలివ్వాలని కోరింది. దీంతో ఆయా బ్యాంకుల్లో ఉన్న స్వయం సహాయక బృందాల సభ్యులకు, వారు సిఫార్సు చేసిన వారికి మాత్రమే బ్యాంకులు జగనన్న తోడు రుణాలిచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక బృంద సభ్యులే ఈ పథకంలో లబ్ధిదారులయ్యారు. చిరు వ్యాపారులు కాకపోయినా రుణాలు పొందుతున్నారు. లబ్ధిదారులు చెల్లించలేకపోతే తాము చెల్లిస్తామని స్వయం సహాయక బృందాలు తీర్మానం చేస్తేనే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. రుణం తిరిగి చెల్లించని లబ్ధిదారులను ఎన్‌పీఎంలో చేర్చి స్వయం సహాయక బృందాల నుంచి రికవరీ చేసుకుంటున్నాయి. కాగా అసలైన చిరు వ్యాపారులు మాత్రం లబ్ధి పొందలేకపోతున్నారు. వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్‌ సంస్థలు, లోన్‌ యాప్‌ల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా ప్రభుత్వం ఆర్భాటంగా సీఎం బొమ్మలు వేసుకుని ప్రచారం చేసుకోవడం తప్ప ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు ఎలాంటి లబ్ధి పొందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 


అందరికీ అందని వడ్డీ 

జగనన్న తోడు పథకం ద్వారా బ్యాంకులు ఇచ్చిన రుణాలకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తోంది. రుణం తీసుకున్న లబ్ధిదారులు సకాలంలో తిరిగి చెల్లిస్తేనే ప్రభుత్వం వారికి వడ్డీ చెల్లిస్తుంది. ఎక్కువగా స్వయం సహాయక బృంద సభ్యులు లబ్ధి పొందుతున్న ఈ పథకంలో లబ్ధిదారులందరికీ సకాలంలో ప్రభుత్వం వడ్డీ చెల్లించడం లేదనే ఆరోపణలున్నాయి. వడ్డీ అందని లబ్ధిదారులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఫిర్యాదులను  పరిష్కరించే యంత్రాంగం ఏర్పాటు చేయకపోవడంతో దిక్కు, దశ లేని పథకంగా తయారైందని విమర్శిస్తున్నారు. 


శ్రుతిమించిన ప్రచార ఆర్భాటం 

సంక్షేమ కార్యక్రమాల అమలు సందర్భంగా వైసీపీ ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలు శ్రుతిమించిపోతున్నాయి. చారానా కోడికి బారానా మసాలా అన్న సామెత లాగా జగనన్న తోడు పథకం కింద అందించే అరకొర సాయానికి ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. వాస్తవానికి ఈ పథకం కింద బ్యాంకులు ఆర్థిక సాయం చేస్తుండగా... అంతా తానే ఇస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న లబ్ధిదారులు చెల్లించాల్సిన వడ్డీని మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. బుధవారం ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా పెద్ద ఎత్తున ప్రకటనలిచ్చారు. గత ఆర్నెల్లకు సంబంధించి వడ్డీ రూ.15 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 3.95 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున 395 కోట్లు.. ఇప్పటి వరకు మొత్తం 15 లక్షలమందికిపైగా లబ్ధిదారులకు రూ.2011 కోట్లు అందించినట్లు ప్రచారం చేసుకున్నారు. వడ్డీ రూ.15 కోట్లు ఇస్తున్నట్టు ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రకటనలకు ఏకంగా 5 కోట్లు కుమ్మరించిందని విమర్శిస్తున్నారు. వైసీపీ సర్కారు తీరు పట్ల ఇతర రాష్ట్రాల నేతలు, అధికారులు నవ్వుకుంటున్నారు. 

Updated Date - 2022-08-04T07:41:46+05:30 IST