జగనన్నా...ఇదేందన్నా...?

ABN , First Publish Date - 2022-05-04T04:47:57+05:30 IST

మదనపల్లె నియోజకవర్గంలో 18 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే మదనపల్లె పట్టణంలోని లబ్ధిదారులకు 6 వేల ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు.

జగనన్నా...ఇదేందన్నా...?
పోతబోలు లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణం

తడిసి మోపెడవుతున్న ఇంటి నిర్మాణం

నీటికే రూ.2 లక్షల ఖర్చు


ఇంటి నిర్మాణం చేపట్టాలంటే సిమెంటు, ఇసుక, కమ్మి, ఇటుకలు, కూలీల ఖర్చులు లెక్కలు వేస్తుంటాం. కానీ మదనపల్లె మండలంలో నిర్మిస్తున్న జగనన్న ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు నీటికి కూడా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒకటిన్నర సెంటులో ఇంటి నిర్మాణానికి రూ.2 లక్షల వరకు నీటికే ఖర్చు చేయాల్సి వస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జగనన్న లేఅవుట్‌కు మౌలిక వసతులు కల్పించాలని, వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఓవైపు ఆదేశిస్తుంటే కింది స్థాయి అధికారులు మాత్రం అందులో విఫలమవుతున్నారు.


మదనపల్లె టౌన్‌, మే 3: మదనపల్లె నియోజకవర్గంలో 18 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే మదనపల్లె పట్టణంలోని లబ్ధిదారులకు 6 వేల ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. మదనపల్లె మండలంలోని పోతబోలు గ్రామ పంచాయతీలో ఒకేచోట 2400 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయగా, వారిలో 1300 మందికి హౌసింగ్‌ కింద ఇళ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. అధికారుల ఒత్తిడి పెరిగిపోవడంతో లబ్ధిదారులు జగన్‌ లేఅవుట్‌లో పునాదులు తవ్వి, పునాది రాళ్లను సేకరించుకున్నారు. కానీ ఇంటి నిర్మాణానికి ప్రధానంగా కావాల్సిన నీటి వసతి ఈ లేఅవుట్‌లో అధికారులు కల్పించలేదు. విద్యుత్‌ సరఫరా లేదు, నీటి కోసం బోర్లు తవ్వలేదు. దీంతో లబ్ధిదారులు పక్కనే ఉన్న రైతు పొలం నుంచి వాటర్‌ ట్యాంకులతో నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. ఒక్కో ట్యాంకుకు రూ.400 చెల్లిస్తున్నారు. ఒకటిన్నర సెంటు ఇంటి నిర్మాణం పూర్తి కావాలంటే ఎంత లేదన్నా 50 ట్యాంకుల నీటి అవసరం ఉందని మేస్త్రీలు చెబుతున్నారు. ఈ లెక్కన ఒక్కో ఇంటికి నీటి కోసం రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది.


దూరా..భారం..

పట్టణ శివారులోని ఎర్రగన్నమిట్ట వద్ద ఉన్న టిడ్కో ఇళ్ల నుంచి కేవలం ఒక కిలోమీటర్‌ దూరం వెళితే పోతబోలు లేఅవుట్‌ వస్తుంది. కానీ ఈ మార్గంలో దారి లేకపోవడంతో లబ్ధిదారులు ఏడు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లి లేఅవుట్‌కు చేరుకోవాల్సి వస్తోంది. అంతేకాకుండా తురకపల్లె, సిద్దమ్మగారిపల్లె దాటుకుని లేఅవుట్‌కు వెళ్లాలంటే కేవలం ఒక ప్రైవేటు బస్సు మాత్రమే ఉంది. దీంతో లబ్ధిదారులు పట్టణం నుంచి ఆటోల్లోనే నిర్మాణాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ప్రతిరోజూ ఆటోలకు రూ.200 ఖర్చు అదనంగా వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మున్సిపల్‌ అధికారులే ముందుకు రావాల్సి వుంది

పట్టణంలోని లబ్ధిదారులకు రూరల్‌లోని పోతబోలు వద్ద జగన్‌ లేఅవుట్‌ మంజూరు చేశారు. ఇక్కడ మౌలిక వసతులైన బోర్లు, రోడ్లు, విద్యుత్‌ కల్పన మున్సిపాలిటీకి చెందిన పబ్లిక్‌ హెల్త్‌ శాఖ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ లేఅవుట్‌కు విద్యుత్‌ సరఫరా చేయాలంటే టిడ్కో ఇళ్ల నుంచి కిలోమీటర్‌ పొడవునా కొత్తగా విద్యుత్‌లైన్‌ లాగాల్సి ఉంది. మధ్యలో రైతుల వ్యవసాయ భూములు ఉండటంతో భూసేకరణ చేయాల్సి ఉంది. ఇవేమి జరగకనే లబ్ధిదారులను తొందరపెట్టి ఇళ్ల నిర్మాణం చేయాలని హుకుం జారీ చేస్తుండటంతో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.


సిమెంటు తోలేందుకే సగం డబ్బులు అయిపోతున్నాయి

పోతబోలు లేఅవుట్‌లో నా భార్య రెడ్డెమ్మ పేరుతో  ఇళ్లు మంజూరైంది. నీరుగట్టువారిపల్లె నుంచి ఈ లేఅవుట్‌కు సిమెంటు తోలేందుకే సగం డబ్బులు అయిపోతున్నాయి. నీళ్ల ట్యాంకర్‌కు సగం డబ్బులు పెట్టాల్సి వస్తోంది. ఒకటిన్నర సెంటుకు రూ.12 లక్షల ఖర్చు వస్తోంది. అప్పులు చేయక తప్పడం లేదు.

- రమణ, చేనేత కార్మికుడు, నీరగట్టువారిపల్లె.


ట్రాక్టర్‌కు డబుల్‌ బాడుగ ఇస్తున్నాం

ఇల్లు కట్టేందుకు బండరాళ్లు, మట్టి, ఇసుక తోలేందుకు ట్రాక్టర్‌కు డబుల్‌ బాడుగ ఇస్తున్నాం. టౌన్‌లో ఇచ్చే రేటు ఇస్తామంటే ఒక్క ట్రాక్టర్‌ కూడా రావడం లేదు. ఇక్కడ బోర్లు లేవు, కూలోల్లకు తాగేందుకు కూడా నీళ్లు టౌన్‌లోనే తెచ్చుకుంటున్నాం. పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్ల ట్యాంకర్‌ పెడితే రూ.600 తీసుకుంటున్నారు. కూలి చేసుకునే మాకు ఈ ఇల్లు కట్టడం గగనం అవుతోంది. 

- నజీరా, కూలి, మదనపల్లె టౌన్‌


రూ.82 లక్షలతో టెండర్లు పిలిచాం

పోతబోలు లేఅవుట్‌లో బోర్లు వేసేందుకు రూ.82 లక్షలతో టెండర్లు పిలిచాం. ఇంకా ఫైనలైజ్‌ కాలేదు. ఫైనలైజ్‌ అవుతూనే బోర్లు వేస్తాం. విద్యుత్‌ సరఫరా కోసం ఎస్పీడీసీఎల్‌కు లేఖ రాశాము. వారు విద్యుత్‌ స్తంభాలు సేకరించి, లేఅవుట్‌ వద్దకు తోలుతున్నారు. త్వరలో మౌలిక వసతులు కల్పిస్తాం.

- రఘునాథరెడ్డి, కమిషనర్‌, మదనపల్లె మున్సిపాలిటీ



Read more