జగనన్న ఇల్లు..అప్పుల మయం

ABN , First Publish Date - 2022-04-29T05:03:52+05:30 IST

జగనన్న ఇళ్ల నిర్మాణం అప్పులమయంగా మారుతోంది.

జగనన్న ఇల్లు..అప్పుల మయం

సభ్యులకు రుణాలు ఇప్పించాలని లక్ష్యాలు

రుణం తీసుకోవాలని డ్వాక్రా సభ్యులపై ఒత్తిళ్లు

ఒక్కో సభ్యురాలిపై రుణం రూ.2 లక్షలు


జగనన్న ఇళ్ల నిర్మాణం అప్పులమయంగా మారుతోంది. లబ్ధిదారులకు బలవంతంగా లోన్లు ఇప్పించి మరీ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టేలా చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇల్లు పొందిన డ్వాక్రా సభ్యుల పరిస్థితీ మరీ దారుణంగా తయారైంది. పునాదుల నిర్మాణానికి రూ.15 వేలు అప్పు ఇప్పించి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చేశారు. తిరిగి వారికే గోడల నిర్మాణానికి సీసీఎల్‌ లోన్లు రూ.35 వేలు బలవంతంగా ఇప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. 



మదనపల్లె, ఏప్రిల్‌ 28: వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా..పేదలకు ఒక ఇల్లూ మంజూరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కోటాను తన ఖాతాలో వేసుకుని గొప్పలు చెప్పుకుంటోందనే విమర్శలున్నాయి. గత ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్లకూ బిల్లులు ఇవ్వలేదు. కానీ జగనన్న సంపూర్ణ గృహ హక్కు-ఓటీఎస్‌ పేరుతో వసూళ్లు నిరంతరాయంగా కొనసాగిస్తోంది. పేదలను పీడించి మరీ రూ.10 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తోంది. మా ఇంటికి మాకు రిజిస్ర్టేషన్‌ ఎందుకు? మాకు హక్కు ఏందని బాధితులు వాపోతున్నా..పట్టించుకోవడం లేదు. ఓటీఎస్‌కు డబ్బులు చెల్లించాల్సిందేనంటూ ఆ పార్టీ నాయకుల నుంచి సచివాలయ ఉద్యోగుల వరకూ టార్గెట్‌ పేరుతో వసూళ్లు చేస్తున్నారు. రెండేళ్లుగా కరోనా లాక్‌డౌన్‌తో పనులు లేక పది వేలు చెల్లించే స్థోమత లేదని పేదలు వాపోతున్నా పట్టించుకోలేదు. చెల్లించి తీరాల్సిందేనంటూ మున్సిపాలిటీలలో మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి మెప్మా పీడీ వరకూ, పంచాయతీల్లో వీఆర్వోల నుంచి డ్వామా పీడీ వరకూ వారి వారి స్థాయిల్లో ఒత్తిడి పెంచుతున్నారు. ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల్లో అప్పులు ఇప్పించి, ఓటీఎస్‌ ఖాతాకు జమ చేసుకుంటున్నారు. ఇలా చివరకు ఇల్లు వద్దన్నా..ఏదో రూపంలో అప్పులు చేయించి ముప్పుతిప్పలు పెడుతున్నారని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.


పునాదికి పొదుపులో అప్పు

జగనన్న కాలనీ పేరుతో ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘంలో పునాదుల నిర్మాణానికి రూ.15 వేలు అప్పు ఇప్పించారు. అక్కడ ఇంటి పట్టా జారీ అనంతరం మొదట్లో పునాది నిర్మించాలని అధికారుల నుంచి సిబ్బంది వరకూ లక్ష్యాలు విధించారు. చేతిలో చిల్లిగవ్వలేదని, ఈ పరిస్థితిలో ప్లాటులో పునాది ఎలా నిర్మించేదని లబ్ధిదారులు వాపోయారు. ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఇంటికి ఇచ్చే రూ.1.80 లక్షలు ఏ మూలకూ చాలదని, పునాదికే రూ.లక్షన్నర అవుతుందని బాధితులు వాపోయారు. ఈ నేపథ్యంలో వారికి ఎలాగైనా ఇంటిని కట్టబెట్టాలని భావించిన ప్రభుత్వం..తమ భవిష్యత్తు అవసరాలకు స్వయం సహాయక సంఘంలో దాచుకున్న పొదుపు సొమ్ముల నుంచి రూ.15 వేలు అప్పు ఇప్పించి నిర్మాణానికి దింపారు.


ఓటీఎస్‌కు సమాఖ్యలో అప్పు

ఓటీఎస్‌ పథకానికి ముందుకు రాని మహిళలకు స్వయం సహాయక సంఘంలోని సమాఖ్యలో రూ.10-15 వేలు అప్పు చేయించి, తమ ఖాతాకు జమ చేసుకున్నారు. ఇందులో గ్రూపులోని సభ్యురాలికి సంబంధం లేకుండా గ్రూపు ఓబీ (లీడర్లు) నుంచి మినిట్స్‌ తీసుకుని, సమాఖ్య ఓబీలు డబ్బులు తీసి ఓటీఎస్‌కు జమ చేశారు. ఇక్కడ రికవరీకి ఇబ్బంది లేకుండా గ్రూపులోని పది మంది సభ్యుల ఆమోదంతో అప్పు నెత్తిన పెట్టారు.


గోడలకు సీసీఎల్‌ లోన్లు

అటు పునాది, ఇటు ఓటీఎస్‌ పూర్తి కాకముందే, మరోసారి లబ్ధిదారుల నెత్తిన మరో అప్పుల కుప్ప పెట్టడానికి ఒత్తిళ్లు మొదలు పెట్టారు. తాజాగా గోడల నిర్మాణానికి మళ్లీ స్వయం సహాయక సంఘాలను ఆశ్రయిస్తున్నారు. గ్రూపు ద్వారా బ్యాంకు నుంచి సీసీఎల్‌ రుణాల కింద రూ.35 వేలు అప్పు తీసి ఇవ్వాలంటూ మున్సిపాలిటీలో మెప్మా, గ్రామాల్లో వెలుగు సంస్థ ఉద్యోగులు, సిబ్బందిపై ఒత్తిడి మొదలైంది. ఇందులో పట్టణాల్లో జిల్లా స్థాయిలో పీడీ నుంచి సీఎంఎం, ఆర్‌పీ వరకూ, గ్రామాల్లో జిల్లా స్థాయిలో డ్వామా పీడీ నుంచి ఏపీఎం, సీసీల వరకూ లక్ష్యాలు విధించారు. సాధారణంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకుల్లో బ్రిడ్జి రుణాలు తీసుకుని చెల్లిస్తుంటారు. ప్రస్తుతం బ్యాంకులో రుణం ఎంత తీసుకుంటున్నా.. దాంతో పనిలేకుండా అదనంగా రూ.35 వేలు, సాధారణ రుణం తీసుకోకుంటే (బ్రిడ్జి) ఇంటి నిర్మాణం కోసమే ప్రత్యేకంగా సభ్యురాలికి రూ.35 వేలు ఇప్పించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా అధికారులు, సిబ్బంది బ్యాంకు బాట పడుతున్నారు.


ఒక్కో సభ్యురాలిపై రూ.2 లక్షల రుణం

డ్వాక్రా సంఘంలోని ఒక్కో సభ్యురాలిపై సుమారు రూ.2 లక్షల వరకూ రుణం ఉంటుందని అంచనా. వివిధ అవసరాల నిమిత్తం కొందరు మహిళలు ఇప్పటికే గ్రూపులో అవకాశమున్న అన్ని మార్గాల్లో అప్పు తీసుకున్నారు. గ్రూపులో, పొదుపులో, పట్టణ సమాఖ్యలో, బ్యాంకు లింకేజీ రుణం తీసుకున్నారు. ప్రస్తుతం జగనన్న ఇళ్ల నిర్మాణానికి, ఓటీఎస్‌ అదనం. ఈ లెక్కన తీసుకుంటే ఒక్కో సభ్యురాలికి సగటున రూ.2 లక్షలు అప్పు ఉంటుందని అటు మెప్మా, ఇటు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ఇవి చాలదన్నట్లు జగనన్న తోడు, స్టెప్‌ లోన్లు, పీఎంస్వానిధి రుణాలు సభ్యులకు ఇప్పించేలా ఆర్‌పీలు, సీసీలకు టార్గెట్లు పెట్టారు. దీనిని అధిగమించే క్రమంలో అటు బ్యాంకర్లు, ఇటు సభ్యులను అడుక్కుని రుణాలు ఇప్పించడానికి ఆర్‌పీలు, సీసీలు నానా తంటాలు పడుతున్నారు. కొందరు సభ్యులైతే ఇక అప్పులే వద్దని, తాము చెల్లించలేమని వాపోతున్నా.. టార్గెట్‌ కోసం బలవంతంగా ఇప్పిస్తున్నారు. జగనన్న తోడు, స్టెప్‌, పీఎంస్వానిధి రుణాలు యూనిట్‌ విలువ రూ.10-20 వేలు మాత్రమే. కానీ రూ.10 వేల రుణమైనా, రూ.10 లక్షలలోనైనా ఒకే ప్రాసెస్‌ కావడంతో బ్యాంకర్లు తలపట్టుకుంటున్నారు. మహిళలకు గ్రూపులోన్లు మినహా, ప్రభుత్వం మంజూరు చేసే రూ.పది వేలు, ఇరవై వేల రుణాల కోసం వెళ్లిన కస్టమర్లు, మెప్మా సిబ్బందిని చూసి బ్యాంకర్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ ప్రభావంతో ఇప్పటికే ఇచ్చిన అప్పులు రికవరీ సక్రమంగా లేక బ్యాంకర్లు నానాతంటాలు పడుతుండగా, అటు వ్యాపారాలు, ఇటు ఉపాధి లేక నెలనెలా రుణకంతులు చెల్లించలేమని కొందరు మహిళలు చేతులెత్తేస్తున్నారు.


ఇళ్లు పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం

-బి.రఘునాథరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, మదనపల్లె

ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. నిర్మాణం చేపట్టాకే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది. లబ్ధిదారులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు స్టేజ్‌ వారీగా డ్వాక్రా గ్రూపులో రుణాలు ఇప్పిస్తున్నాం. ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా లబ్ధిదారులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నాం.

Updated Date - 2022-04-29T05:03:52+05:30 IST