ఒత్తిడి తగ్గినట్టేనా!?

ABN , First Publish Date - 2021-10-10T05:58:36+05:30 IST

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల్లో వేగం ఎందుకు పెరగడం లేదు. మీరంతా ఏం చేస్తున్నారు.

ఒత్తిడి తగ్గినట్టేనా!?
నెల్లూరు : జనార్ధన్‌రెడ్డికాలనీలో మందకొడిగా సాగుతున్న ఇళ్ల నిర్మాణాలు

పేదల ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు ఆదేశాలు

జీవన విధానానికి సరిపడా స్థలం లేదని అభ్యంతరం

ఓ వైపు బిల్లులు, మెటీరియల్‌ ఇవ్వని ప్రభుత్వం

ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రాని లబ్ధిదారులు

అధికారులపై ఒత్తిళ్లు.. హైకోర్టు ఆదేశాలతో ఉపశమనం


నెల్లూరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : 

‘‘జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల్లో వేగం ఎందుకు పెరగడం లేదు. మీరంతా ఏం చేస్తున్నారు. ఖచ్చితంగా పురోగతి కనిపించాలి. రోజుకు కనీసం రూ.2 కోట్ల బిల్లులు అప్‌లోడ్‌ చేయాలి.’’

ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా ఉన్నతాధికారులపై వస్తున్న ఒత్తిళ్లు ఇవి.

దీంతో జిల్లా ఉన్నతాధికారులు కూడా డివిజన్‌, మండల స్థాయి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తూ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై రోజూ సమీక్షిస్తున్నారు. నిత్యం క్షేత్రస్థాయి పరిస్థితులపై వివరణ ఇవ్వాల్సి ఉండడంతో కిందిస్థాయి అధికారులూ ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తూ, సకాలంలో సిమెంటు, స్టీలు వంటి మెటీరియల్‌ అందిస్తే పేదలు  కూడా ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకొస్తారు. అవేమీ చేయకుండా తమపై ఒత్తిడి తెస్తే ఏం చేయగలమంటూ క్షేత్రస్థాయి అధికారులు గత కొంతకాలం నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నట్లైంది. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటన్నర స్థలంలో ఇళ్ల నిర్మాణం జీవన విధానానికి మంచిది కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. పర్యావరణాన్ని, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇళ్లను నిర్మించకపోతే ఆ కాలనీలన్నీ మురికివాడలుగా మారిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం, వీటిపై అధ్యయనం చేసేందుకు కేంద్ర అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చే వరకు నిర్మాణాలపై ముందుకెళ్లవద్దని ఆదేశించింది. 


ఎమ్మెల్యేలకూ తప్పని తిప్పలు

పేదలందరికీ ఇళ్లు పథకంలో మొదటి విడతలో జిల్లాకు 54 వేల ఇళ్లు మంజూరయ్యాయి. జూలైలో ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టగా, అనుకున్న విధంగా సకాలంలో బిల్లులు, మెటీరియల్‌ అందజేస్తే మూడు నెలల్లో  పూర్తయ్యేవి. కానీ 2 నెలలుగా బిల్లులు, మెటీరియల్‌ సరిగ్గా అందకపోవడంతో ఇళ్లు నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇది గమనించిన మిగిలిన లబ్ధిదారులు అసలు నిర్మాణాలకే ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగానికి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. ప్రతి ఒక్క లబ్ధిదారులు ఇంటి నిర్మాణం మొదలుపెట్టేలా ప్రత్యేక గ్రౌండింగ్‌ మేళాలను నిర్వహించారు. చాలా వరకు బలవంతంగా లబ్ధిదారుల చేత నిర్మాణాలు మొదలుపెట్టించారు. అయితే తర్వాత బిల్లులు, మెటీరియల్‌ విషయంలో పరిస్థితి మారింది. వీటి కోసం లబ్ధిదారులు అధికారులను అడుగుతూ వస్తున్నారు. ప్రభుత్వం నుంచి విడుదల కాకపోవడంతో అధికారులు కూడా లబ్ధిదారులకు సర్దిచెప్తూ వస్తున్నారు. ఆ తేదీలో వస్తాయి.. ఈ తేదీలోపు వస్తాయి.. అని చెప్పినప్పటికీ ఆ సమయంలోపు రాకపోవడంతో అధికారులు కూడా లబ్ధిదారుల ఎదుటకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఓవైపు ఉన్నతాధికారులు, మరోవైపు లబ్ధిదారుల మధ్య క్షేత్రస్థాయి అధికారులు మానసికంగా నలిగిపోతున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యేలకు కూడా బిల్లుల సెగ తగులుతోంది. ఆర్భాటంగా ఇళ్లు మొదలుపెట్టించారని, బిల్లులెప్పుడిస్తారని లబ్ధిదారులు నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా సమాధానం చెప్పలేక తప్పించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, వారు పడుతున్న బాధలను ఎమ్మెల్యేలు జిల్లా సమీక్ష కమిటీ(డీఆర్సీ) సమావేశం వేదికగా వెల్లబుచ్చడం గమనార్హం. 


పేదల పరిస్థితి ఏమిటి?

ప్రభుత్వం పేదలకిచ్చిన స్థలాలపై కేంద్ర అధికారుల కమిటీ నివేదిక ఇచ్చే వరకు అందులో ఇళ్ల నిర్మాణాలపై ముందుకెళ్లవద్దని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం సూచించింది. అయితే ఇప్పటికే నిర్మాణాలు మొదలుపెట్టిన పేదల పరిస్థితేమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ముందుచూపులేనితనం, పర్యావరణ, జీవన విధానాలపై అధ్యయనం చేయకుండా స్థలాలు పంపిణీ చేయడం మూలంగానే ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. సకాలంలో బిల్లులు, మెటీరియల్‌ అందజేసి ఉంటే ఈ పాటికి చాలా వరకు ఇళ్లు పూర్తయ్యేవని మరికొంత మంది లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-10-10T05:58:36+05:30 IST