Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగనన్న గృహనిర్మాణ లబ్ధిదారుల ఇక్కట్లు

లేఅవుట్లలో రోడ్లు, విద్యుత్‌ వసతి నిల్‌

నీటి వసతి లేక ట్యాంకర్‌కు రూ.1200 చెల్లింపు

బేస్‌మెంట్‌ పూర్తయినా బిల్లులు పడని వైనం

ఎక్కడ పనులు అక్కడ నిలిపివేత


కోవూరు, అక్టోబరు 19 : మండల పరిధిలోని గ్రామాల్లో జగనన్న గృహ నిర్మాణ లబ్ధిదారులు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కోవూరు, పోతిరెడ్డిపాళెం, పడుగుపాడు గ్రామ పొలిమేరల్లో వందలాది ఎకరాల్లో గృహ నిర్మాణాలను చేపట్టేందుకు లేఅవుట్లు సిద్ధం చేశారు. లేఅవుట్లకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. విద్యుత్‌ వసతి కల్పించకపోవడంతో పనులు చేసేందుకు వీలుకావడం లేదు. గుమ్మళ్లదిబ్బ, పోతిరెడ్డిపాళెంల్లోని లేఅవుట్లకు రోడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో సామగ్రి చేరవేత కష్టంగా ఉంది.  అన్నింటికి మించి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు ఎక్కడ పనులను అక్కడే ఆపేశారు. పనులు పూర్తయి 45రోజులు దాటుతున్నప్పటికీ బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సిమెంటు, ఇసుక కలుపుకునేందుకు అవసరమైన నీరు కూడా లేకపోవడంతో ట్యాంకరు నీటిని రూ.1200లకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. అలాగే ట్యాంకు బాడుగకు అదనంగా మరో రూ.200 చెల్లించాల్సి రావడంతో లబ్ధిదారులను ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అధికారులు సమస్యలు పరిష్కరించకుండా గృహాలు నిర్మించుకోకుంటే పట్టాలు రద్దు చేస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో గృహనిర్మాణ లబ్ధిదారులు దిక్కుతోచని స్ధితికి చేరుకుంటున్నారు.


బిల్లులెప్పుడు చెల్లిస్తారో..

బేస్‌మెంట్‌ పనిచేసి 45 రోజులు అవుతోంది. ఇంత వరకు బిల్లు కాలేదు. డబ్బులు బ్యాంకు అకౌంట్‌లో పడతాయని చెబుతున్నారు. బ్యాంకు చుట్టూ తిరుగుతూనే ఉన్నా. అకౌంట్‌లో  డబ్బులు పడిందీ లేదు. మాకు మాత్రం అదిగో ఇదిగో అని చెబుతున్నారు. మా దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పుడేమి చేయాలి.

- కుందుర్తి లక్ష్మి, లబ్ధిదారులు, పోతిరెడ్డిపాళెం


వసతులు లేవు

మా కాలనీకి వసతులు లేవు. ఇళ్లు కట్టుకొనేదానికి నీళ్లు దొరకడం లేదు. ట్యాంకరు నీళ్లు  కొంటే రూ.1200 అవుతోంది. అలాగే విద్యుత్‌ వసతి లేదు. ఎప్పుడు కల్పిస్తారో తెలియడం లేదు. కరెంటు ఉంటేనే కదా పనులు అయ్యేది. అన్నింటికి మించి అసలు బిల్లులు పడటం లేదు. త్వరగా బిల్లుల నగదు పడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. 

- యాకసిరి రమణమ్మ, గుమళ్లదిబ్బ

 

 

Advertisement
Advertisement