జగనన్న.. కాలనీళ్లు

ABN , First Publish Date - 2021-07-19T05:19:19+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ఎంతో ఘనంగా..

జగనన్న.. కాలనీళ్లు
నరసరావుపేటలో చెరువును తలపిస్తున్న లేఆవుట్‌, కొట్టుకుపోయిన ఇసుక, కంకర, ఇతర పనిముట్లు

నీట మునిగిన కాలనీలు

వర్షాలకు ముంపులో లేఅవుట్లు 

తటాకాలను తలపిస్తోన్న కాలనీలు

నామరూపాలు కోల్పోయిన రోడ్లు, డ్రెయిన్లు

వరద పాలైన ఇసుక, కంకర, నిర్మాణ సామగ్రి

 

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌): వర్షం వస్తే జగనన్న కాలనీలు.. జలమయం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ఏర్పాటు చేసిన లేఅవుట్లు తటాకాలను తలపిస్తోన్నాయి. కొన్ని ప్రాంతాల్లోని లేఅవుట్లు బురదమయంగా మారాయి. ప్లాట్లలోకి అడుగు పెట్టాలంటే కనాకష్టంగా మారింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో లేఅవుట్ల లోతట్టు ప్రాంతాల్లో వేయడంతో చుట్టుపక్కల నుంచి పెద్దఎత్తున వర్షపు నీరు జగనన్న కాలనీలను చుట్టుముట్టేసింది. దీంతో లేఅవుట్లలో ఎవరి ప్లాటు ఎక్కడ అన్న ఆనవాళ్లే లేకుండా పోయింది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లోని లేఅవుట్లు నీట మునిగాయి. ఆయా ప్లాట్లలోని వరద నీరు ఆదివారం సాయంత్రానికి కూడా అలానే ఉంది. ఇటీవల నిర్వహించిన గ్రౌండింగ్‌ మేళాలో శంకుస్థాపన చేసుకున్న నిర్మాణాలు మొదలు పెట్టారు. ఇలాంటి వారికి చెందిన ఇసుక, కంకర, సిమెంటు, ఇతర నిర్మాణ సామగ్రి అంతా   నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. వర్షపు నీటిని చూసి ఇలాంటి ప్రాంతంలో ఇల్లు కట్టుకుని ఎలా ఉండాలి అంటూ పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. మరికొందరైతే ఇల్లు నిర్మించుకుని నివాసం ఉండాలంటే జంకుతున్నారు.  

 

లబ్ధిదారుల లబోదిబో

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జగనన్న కాలనీల్లోని నిర్మాణ సామగ్రి నీటి పాలైంది. పలు ప్రాంతాల్లో ఇళ్ళ నిర్మాణం కోసం కొనుగోలు చేసిన ఇసుక, కంకర వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. రెండు ట్రాక్టర్ల ఇసుక రూ.12 వేలకు కొనుగోలు చేశామని, అంతా వాగు పాలైందని నరసరావుపేటలోని జగనన్న కాలనీ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు తెచ్చుకునే డ్రమ్ములు, పనులకు సంబంధించిన బొచ్చలు, ఇతర పనిముట్లు కూడా నీటిలో కొట్టుకు పోయాయిని లబోదిబోమంటున్నారు. 


వైసీపీ ప్రభుత్వం ఎంతో ఘనంగా చెప్పుకుంటోన్న జగనన్న కాలనీల లేఅవుట్‌లు ఒక్క వర్షానికే నీటి తటాకాలుగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని లేఅవుట్లలో నిలిచిన వర్షపునీరు భూమిలోకి ఇంకిపోవాల్సిందే తప్ప బయటకు పోవడానికి  తగిన డ్రెయినేజీ వ్యవస్థ లేదు. జిల్లాలో 2,65,642 మంది లబ్ధిదారులను గుర్తించి 1,340 లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. పట్టణ ప్రాంత లబ్ధిదారులకు సెంటు, గ్రామీణ ప్రాంతాల వారికి సెంటున్నర భూమిని ఇచ్చారు. ఇందుకోసం 2,114.41 ఎకరాల ప్రభుత్వ భూమి, 4,367.5 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించారు. ప్రైవేటు భూమి కోసం రూ.1,535.06 కోట్లు వెచ్చించారు. ఇక లేఅవుట్లలో అంతర్గత రోడ్లు, కాలువలు, విద్యుత్‌, బోర్ల సౌకర్యాల పేరుతలో రూ.180 కోట్లు వెచ్చించినట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే వర్షానికి ఆయా లేఅవుట్లలో లోపాలు బహిర్గతమౌతున్నాయి. ఎక్కడో పొలాలు, వాగులు పక్కన ఈ లేఅవుట్‌లు ఏర్పాటు చేయడంతో వరదనీరు అందులోకి వచ్చి చేరుతున్నది. శనివారం గుంటూరు నగరం, తాడికొండ, మంగళగిరి, దుగ్గిరాల, ఫిరంగిపురం, మేడికొండూరు తదితర మండలాల్లో కురిసిన వర్షానికి జగనన్న కాలనీల లేఅవుట్లలోకి వరదనీరు భారీగా వచ్చి చేరింది. దాంతో అవి చెరువులను తలపిస్తోన్నాయి. ఆయా లేఅవుట్లలో ఇళ్లను నిర్మించుకోవాలంటే వందల లారీలు మట్టిపోసి స్థలాన్ని ఎత్తు పెంచుకోవాల్సి ఉంటుంది. అంత చేసినా డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షం కురిస్తే వరదనీరు లేఅవుట్లను చుట్టుముట్టేస్తుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల్లో ఎక్కువమంది ఇప్పుడప్పుడే ఇళ్ల నిర్మాణాలు చేపట్టకూడదని నిర్ణయించుకుంటున్నారు. 


- గుంటూరు సమీపంలోని పేరేచర్ల, వింజనంపాడు, లాం తదితర గ్రామాల్లో వేసిన లేఅవుట్‌లు నీట మునిగాయి. ఎవరి ప్లాటు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి తలెత్తింది. ఇళ్ల నిర్మాణాల కోసం ఇటీవలే డిజైన్‌ కోసం పోసిన ముగ్గు తుడిచి పెట్టుకుపోయింది. అంతర్గత రోడ్లు బురదమయంగా మారడంతో ప్లాట్ల వద్దకు వెళ్లలేని పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి. డ్రెయిన్లు, రోడ్లు ఏవో తెలియకుండా అంతా నీటిలో మునిగాయి. 

- నరసరావుపేట పట్టణ శివారు టిడ్కో నిర్మాణం సమీపంలోని లేఅవుట్‌లోని జగనన్న కాలనీలో సుమారు 400 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ఇటీవల కురిసిన వర్షానికి ఇక్కడి ప్లాట్లలోకి నీరు ప్రవేశించి చెరువుగా మారింది. లేఆవుట్‌ సమీపంలో ఉన్న కట్టవాగుకు మరమ్మతులు నిర్వహించి లేఅవుట్‌లోకి నీరు రాకుండా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 



- తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలోని రెండు లే అవుట్లలో 232 మంది లబ్దిదారులకు స్థలాలు మంజూరు చేశారు. అయితే జడ్పీ పాఠాశాల వెనుక ఉన్న లేఅవుట్‌  వర్షాలకు నీట మునిగింది. ఈ ప్రాంతమంతా బురదమయంగా మారింది. దీంతో ఇక్కడ ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు వెనుకంజ వేస్తున్నారు.

- సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామ జగనన్న కాలనీలో 60 మందికి ఇళ్లపట్టాలు కేటాయించారు. కొంత మంది ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టారు. వర్షాలకు కాలనీ మొత్తం నీటితో నిండింది. దీంతో నిర్మాణ పనులకు ఆటంకంగా మారింది. స్థలాలు లోలెవల్‌లో ఉండటం వల్ల వర్షపునీరు నిలిచిందని మెరక తోలించుకోవాల్సి వస్తుందని లబ్ధిదారులు వాపోతున్నారు.   

- దుగ్గిరాల మండలం కేఆర్‌కొండూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన నివేశన స్థలాలు వర్షాలకు జలమయం అయ్యాయి. కాలనీలోని రోడ్లు గుంతలమయమయ్యాయి.  

- నాదెండ్ల మండలం గణపవరం గ్రామ పరిధిలోని చెరువు రోడ్డులో జగనన్న కాలనీ కోసం ఇంటి స్థలాలను పంపిణీ చేశారు. అవి చౌడు భూములు కావడంతో కొద్ది వర్షానికే ప్లాట్లలో నీరు నిలిచింది. పెద్ద వర్షం కురిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని లబ్ధిదారులు వాపోతున్నారు. చిలకలూరిపేట పసుమర్రులో ఈవూరివారిపాలెం మార్గంలో వాగు పక్కన నివేశన స్థలాలలో మెరక చేయలేదు. భారీ వర్షం కురిసి ఓగేరువాగుకు వరద వస్తే ప్లాట్లలోకి నీరు చేరే ప్రమాదం పొంచి ఉంది.

- గురజాల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పల్లపు ప్రదేశాలను ఎంపిక చేశారు. దీంతో ఓ మోస్తరు వర్షాలకు లేఅవుట్‌ స్థలాలు నీట మునుగుతున్నాయి. పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెం, జూలకల్లు, బ్రాహ్మణపల్లి, దాచేపల్లి మండలం కాట్రపాడు, కొత్తూరుతోపాటు గురజాల మండలంలోని మరికొన్ని గ్రామాల్లో పంపిణీ చేసిన జగనన్న కాలనీలోనూ వర్షం వస్తే లబ్ధిదారులకు చుక్కలు చూపుతున్నాయి. 

- బాపట్ల మూలపాలెంరోడ్డులోని లేఅవుట్‌ ప్లాట్లలో వర్షపు నీరు నిలిచి బురదమయంగా మారాయి. బేతనీకాలనీ, ప్యాడిసన్‌ లేవుట్‌లలో కూడా వర్షపునీరు నిలిచింది. దీంతో గృహ నిర్మాణ సామగ్రి రావాణాకు ఆటంకంగా మారింది. లేఅవుట్లు పూర్తిస్థాయిలో మెరక చేయకుండా పొలాల్లోనే స్థలాలు ఇవ్వడంతో ఇబ్బంది పడుతున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు.

Updated Date - 2021-07-19T05:19:19+05:30 IST