ఐదు పైలట్‌ గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి

ABN , First Publish Date - 2022-01-18T06:29:20+05:30 IST

వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద జిల్లాలో ఎంపిక చేసిన ఐదు పైలట్‌ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి రికార్డు వర్కుని కూడా ముగించారు.

ఐదు పైలట్‌ గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి

నేడు భూయజమానులకు టైటిల్‌, ప్రాపర్టీకార్డుల అందజేత

గుంటూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద జిల్లాలో ఎంపిక చేసిన ఐదు పైలట్‌ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి రికార్డు వర్కుని కూడా ముగించారు. సర్వేపై అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిష్కరించి మంగళవారం భూయజమానులకు టైటిల్‌, ప్రాపర్టీ కార్డులు అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌ విధానంలో ప్రారంభిస్తారు. అనంతరం జిల్లాలోని ఐదు పైలట్‌ గ్రామాల్లోని సచివాలయలకు భూమి రికార్డులన్నింటిని రెవెన్యూ అధికారులు అందజేస్తారు. ఆ తర్వాత భూమి యజమానులకు టైటిల్‌, ప్రాపర్టీ కార్డులు మంజూరు చేస్తారు. జిల్లాలో 2020వ సంవత్సరం డిసెంబరు నెల చివరి వారంలో ఎంపిక చేసిన ఐదు పైలట్‌ గ్రామాల్లో భూముల రీసర్వేని ప్రారంభించారు. ప్రత్తిపాడు మండలంలోని కొండజాగర్లమూడి, దుగ్గిరాలలోని దేవరపల్లి అగ్రహారం, వేమూరులోని పులిచింతలపాలెం, దాచేపల్లిలోని అలుగుమల్లిపాడు, యడ్లపాడులోని మర్రిపాలెంలో ఈ సర్వే ప్రారంభమైంది. అయితే ప్రారంభ దశలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడం, కరోనా రెండో దశ వ్యాప్తితో నిర్ణీత సమయంలో ఈ ఐదు గ్రామాల్లోనే రీసర్వే పూర్తికాలేదు. కరోనా రెండో దశ తగ్గుముఖం పట్టిన తర్వాత పీవోఎల్‌ఆర్‌(భూమి రికార్డుల స్వచ్ఛీకరణ), డ్రోన్‌ సర్వే, హద్దురాళ్లు పాతడం, భూమి రికార్డుల స్వచ్ఛీకరణ వంటివి పూర్తి చేశారు. గ్రామ సభలు నిర్వహించి సంబంధిత ఖాతాదారుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. వాటిని పరిష్కరించి ఎట్టకేలకు సర్వే పూర్తి చేసి భూయజమానుల పేర్లతో టైటిల్‌, ప్రాపర్టీ కార్డులను సిద్ధం చేశారు. కొండ జాగర్లమూడిలోని 47 సర్వే నెంబర్లలో 296.09 ఎకరాలు, దేవరపల్లి అగ్రహారంలో 47 సర్వే నెంబర్లలో 165.08 ఎకరాలు, పులిచింతలపాలెంలో 57 గ్రామాల్లో 258.45 ఎకరాలు, అలుగుమల్లిపాడులో 102 సర్వే నెంబర్లలో 996.64 ఎకరాలు, మర్రిపాలెంలో 96 సర్వే నెంబర్లలో 664.51 ఎకరాల్లో భూముల రీసర్వే పూర్తి అయింది. ఇందుకోసం సర్వే ఆఫ్‌ ఇండియా బృందంతో ఒక డ్రోన్‌తో సర్వే నిర్వహించారు. ఆ సంస్థ అందజేసిన ఓఆర్‌ఐ చిత్రాలు, ఆరు రోవర్లను సర్వే కోసం వినియోగించారు. గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయింట్‌లు, డీజీపీఎస్‌ రీడింగ్‌లతో తీసుకొన్నారు. గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములను గుర్తింపును పూర్తి చేశారు. మాగాణి, మెట్ట, పోరంబోకు భూములను స్పష్టంగా మార్కింగ్‌ చేశారు. ప్రతీ సర్వే నెంబరు. సబ్‌ డివిజన్‌, విస్తీర్ణం, భూ వర్గీకరణ ఆర్‌ఎస్‌ఆర్‌తో పరిశీలించి నవీకరించారు. ప్రతీ రైతు ఆధార్‌కార్డు, మొబైల్‌ నెంబర్లను ఖాతాలకు అనుసంధానం చేశారు. దీని వలన భవిష్యత్తులో వెబ్‌ల్యాండ్‌లో ఎలాంటి మార్పులు జరిగినా సంబంధిత రైతు ఫోన్‌ నెంబరుకు సమాచారం వెళుతుంది. కాగా ప్రతీ ఆస్తికి స్వంత హక్కుపత్రం సిద్ధం చేశారు. వాటిని లాంఛనంగా మంగళవారం దుగ్గిరాలలోని దేవరపల్లి అగ్రహారంలో పంపిణీకి శ్రీకారం చుడతారు. 

  

Updated Date - 2022-01-18T06:29:20+05:30 IST