జగన్మాతా.. నమోనమః

ABN , First Publish Date - 2022-09-26T05:14:26+05:30 IST

‘అయిగిరి నందిని...నందిత మేదిని...’అంటూ సకల జగతికి మాతృదేవత, జగజ్జనని దుర్గామాతను తొమ్మిది రోజులపాటు పూజించి తరించే దేవీ నవరాత్రి ఉత్సవాలు ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రారంభమవుతున్నాయి.

జగన్మాతా.. నమోనమః

  1. నేటి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు
  2. విద్యుద్దీపాల అలంకరణలో అమ్మవారి ఆలయాలు
  3. ఉమ్మడి జిల్లాలో నిత్య అలంకరణలు, ప్రత్యేక పూజలు

కర్నూలు (కల్చరల్‌), సెప్టెంబరు 25 : ‘అయిగిరి నందిని...నందిత మేదిని...’అంటూ సకల జగతికి మాతృదేవత, జగజ్జనని దుర్గామాతను తొమ్మిది రోజులపాటు పూజించి తరించే దేవీ నవరాత్రి ఉత్సవాలు ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రారంభమవుతున్నాయి. ఏటా ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుంచి దశమి వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి ఆలయాలు (అమ్మవారి శాలలు), శ్రీశైలం, మహానంది, యాగంటి, చౌడేశ్వరి దేవి క్షేత్రాల్లో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయా ఆలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. ఉత్సవాల ప్రత్యేకతను చాటేలా ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు చేశారు. అలాగే అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజాదికాలు, నైవేద్యాలు, హోమాలు నిర్వహించనున్నారు. నవరాత్రుల్లో నిత్యం అమ్మవారికి విశేష అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో దేవీ నవరాత్రి వేడుకలను శరన్నవరాత్రి వేడుకల పేరుతో వైభవంగా నిర్వహిస్తారు. కర్నూలు నగరంలో వివిధ ప్రాంతాల్లో భక్తులు దుర్గామాత ఉత్సవ విగ్రహాలను పెట్టి పూజించి, ముగింపు రోజున నిమజ్జనం చేయడం సంప్రదాయంగా వస్తోంది.

ఫ శక్తి స్వరూపిణిగా అమ్మవారికి పూజలు...

స్త్రీని శక్తి స్వరూపిణిగా, మాతగా, దేవతగా ఆరాధించాలని భారతీయ వేదాలు, ఇతిహాసాలు చెబుతాయి. ప్రకృతి స్వరూపిణిగానూ స్త్రీని వర్ణిస్తారు. ప్రకృతిలోని పంచభూతాల్లోని శక్తిని స్త్రీ కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతను వివిధ అలంకరణల్లో తొమ్మిది రోజులపాటు పూజిస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాలు శరత రుతువులో వస్తున్నందున శరత నవరాత్రి, శరన్నవరాత్రి’ ఉత్సవాలుగా పిలుస్తారు.

ఫ బ్రహ్మాది దేవతలచే పూజలందుకున్న విశ్వ జనని...

విశ్వ సృష్టికి నాంది పలికిన జగన్మాతగా దుర్గామాతను పూజిస్తారు. బ్రహ్మ, విష్ణువు, శివపరమాత్మలు కూడా దేవదేవిని పూజించారు. త్రిమూర్తులంతటి వారు పూజించిన లోకమాతను ఈ నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించాలి. ఆమెను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో పూజించాలి. నేయి దీపాలు వెలిగించి, నిత్యం హోమాలు, పూజలు, అష్టోత్తర నామ పారాయణం, స్తుతి, భజనలతో ఆరాధించాలి. అరిషడ్‌ గుణాలను వదులుకొని దేవీ ఆరాధనలో గడిపేవారికి ఆమె కరుణా కటాక్షాలు ప్రసాదిస్తుందని పండితులు పేర్కొంటారు.  

ఫ కన్నుల పండువలా దేవీ నవరాత్రి ఉత్సవాలు..

దుర్గామాతకు ఈ నవరాత్రి వేడుకల్లో ప్రత్యేక పూజలు, శాంతి హోమాలు జరపడం ఒక ధార్మిక సంప్రదాయంగా వస్తోంది. లోకకంఠకుడైన మహిషాసురుడిని మర్థించి (వధించి)న తరుణంలో శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని మహిషాసుర మర్థినిగా భక్తులు కొలిచి తరిస్తారు. కొన్ని కుటుంబాలతోపాటు, స్థానిక భవానీ భక్తులు అవహనీయ అగ్ని, గ్రహపత్య అగ్ని, దక్షిణి అగ్ని అనే హోమాలు నిర్వహిస్తారు. ఇదే కాకుండా ఆదిత్య హోమం, మహా సూర్య మంత్రాలను రోజూ పఠిస్తూ పూజలు చేస్తారు. ఈ హోమాలు చేయడం వల్ల ఇంటి ఆవరణంతోపాటు పరిసరాలన్నీ మహాశక్తి మయమై, ఈ ప్రాంతాలన్నీ ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటాయని పురాణాలు ఉదహరిస్తాయి. 

ఫనవరాత్రుల్లో దేవదేవి అలంకరణలు ఇవీ...

దేవీ నవరాత్రి వేడుకల్లో తొమ్మిది రోజులపాటు దేవదేవి అయిన దుర్గమ్మను తొమ్మిది రూపాల్లో దర్శిస్తారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో దుర్గామాతను అలంకరించి, విశేష పూజలు నిర్వహిస్తారు. విశ్వ జనని భక్తజనావళికి విశేషాలంకారాలతో ఈ తొమ్మిది రోజులు దర్శనమిస్తుంది. ఆయా రోజుల్లో జరిగే విశేషాలంకారాలను చూసి తరించేందుకు భక్తులు ఆలయాలకు అఽధిక సంఖ్యలో తరలి వచ్చి పూజలు నిర్వహిస్తారు. 

ఫ మొదటి రోజు ఆశ్వయుజ పాడ్యమి రోజున - స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి

ఫ రె ండో రోజు ఆశ్వయుజ విదియ రోజున -  బాలా త్రిపుర సుందరీదేవి

ఫ మూడో రోజు ఆశ్వయుజ తదియ రోజున -  గాయత్రీ దేవి

ఫ నాలుగో రోజు ఆశ్వయుజ చవితి రోజున -  అన్నపూర్ణా దేవి

ఫ అయిదో రోజు ఆశ్వయుజ పంచమి రోజున - లలితా త్రిపుర సుందరీ దేవి (లలిత పంచమి)

ఫ ఆరో రోజు ఆశ్వయుజ షష్టి రోజున - మహాలక్ష్మిదేవి (మహా షష్టి)

ఫ ఏడో రోజు ఆశ్వయుజ సప్తమి రోజున -  మహా సరస్వతి దేవి (మహా సప్తమి)

ఫ ఎనిమిదో రోజు ఆశ్వయుజ అష్టమి రోజున -  దుర్గాదేవి (దుర్గాష్టమి)

ఫ తొమ్మిదో రోజు ఆశ్వయుజ మహా నవమి రోజున - మహిషాసుర మర్థిని (మహార్ణవమి)

ఫ పదో రోజు ఆఽశ్వయుజ దశమి రోజున - రాజరాజేశ్వరి (విజయదశమి) రూపాల్లో ప్రత్యేక అలంకారాలతో అమ్మవారికి విశేష పూజలు, వాహన సేవలు నిర్వహిస్తారు.

ఫ కర్నూలు నగరంలో నవరాత్రి ఉత్సవాలు....

కర్నూలు నగరంలో ఏటా దేవీ నవరాత్రులను వివిధ ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక పాతనగరంలోని పెద్ద అమ్మవారిశాల, చిన్న అమ్మవారిశాల, కాళికాంబ దేవాలయం, గీతా మందిరం, కేసీ కెనాల్‌ సమీపంలోని అయ్యప్ప స్వామి ఆలయంలోని చౌడశ్వరి మాత ఆలయం,  చిదంబరరావు వీధి (ఖండేరీ)లోని శంకర మందిరం, కల్లూరులోని చౌడేశ్వరి దేవి ఆలయం, సూర్యనారాయణ స్వామి ఆలయంలలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, నిత్య హోమాలు, విశేష అలంకరణ కార్యక్రమాలను చేపడుతున్నారు. 

నేటి నుంచి  శరన్నవరాత్రులు

  1. శ్రీగిరిపై ప్రత్యేక ఏర్పాట్లు
  2. నవాలంకారాల్లో దర్శనమివ్వనున్న భ్రమరాంబిక  
  3. స్వామి అమ్మవార్లకు వాహన సేవలు 

శ్రీశైలం, సెప్టెంబరు 25: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి అగస్టు 5 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. సంప్రదాయబద్ధంగా తొమ్మిది రోజులు జరగనున్న ఈ మహోత్సవాలలో అమ్మవారికి నవదుర్గ అలంకారాలు,   నవావరణపూజలు, స్వామి అమ్మవార్లకు వాహనసేవలు, చండీయాగం, రుద్రయాగం జరిపించనున్నారు. భక్తులు తిలకించడానికి వీలుగా గంగాధర మండపం వద్ద ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేయనున్నారు.   ఆలయ ప్రాంగణం,  పరిసరాలను శోభాయమానంగా అలంకరించారు. మాఢవీధుల్లో ఉత్సవ వాతావరణం ప్రతిబింబించేలా ప్రాకార కుడ్యానికి విద్యుద్దీపాలంకరణ చేశారు.  నిత్యాకళారాధన వేదికపై ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు జరపనున్నారు.  స్వామి అమ్మవార్ల గ్రామోత్సవంలో జానపద కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు.

 ముఖ్య కార్యక్రమాలు : 

 దసర ఉత్సవాలు  సోమవారం ఉదయం 8.30గంటలకు అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశంతో   ప్రారంభించనున్నారు.   10 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, శివసంకల్పం, గణపతిపూజ, అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, రుద్రకలశస్థాపన, స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నకాలార్చనలు, మహానివేదనలు జరిపించనున్నారు.  సాయంకాలం నుంచి అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, రుద్రహోమం, అమ్మవారికి  నవావరణార్చన, కుంకుమార్చనలు నిర్వహించనున్నారు. తరువాత రుద్రహోమం, చండీహోమం జరిపించి, అనంతరం రాత్రి 9.30 గంటల నుంచి నీరాజనమంత్రపుష్పం, సుహాసినీ పూజ, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ కార్యమాలు జరిపిస్తారు.   దేవస్థానం అర్చకులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి 49 మంది రుత్వికులు పాల్గొననున్నారు.


Updated Date - 2022-09-26T05:14:26+05:30 IST