Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

జగనే చెప్పాలి!

twitter-iconwatsapp-iconfb-icon

‘‘మానాన్నను చంపినవాళ్లను ఇంకెప్పుడు పట్టుకుంటారు?’’ ..రెండేళ్ల క్రితం దారుణ హత్యకు గురైన వై.ఎస్‌.వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి అడిగిన సూటి ప్రశ్న ఇది. సోదరుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తనకు న్యాయం జరగడం లేదని ఆమె శుక్రవారం ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో ఆవేదన వ్యక్తంచేశారు. పులివెందులలో తమ బంధువులు కాకుండా బయటి వ్యక్తులు వచ్చి హత్య చేసే అవకాశమే లేదని కూడా స్పష్టంచేసిన డాక్టర్‌ సునీత.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిపై తనకు అనుమానం ఉందని కూడా చెప్పారు. వివేకా హత్య జరిగి రెండేళ్లు గడిచినా బాధ్యులను అరెస్ట్‌ చేయకపోవడంతో ఆమె తనలోని ఆవేదనను బహిరంగంగా వ్యక్తంచేశారు. డాక్టర్‌ సునీత ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిపై ఉంది. సొంత బాబాయ్‌ సొంతింట్లో హత్యకు గురైనప్పుడు తొలుత సాధారణ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసిన జగన్‌ బంధువులు సాక్ష్యాలను మాయం చేయడానికి కూడా ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో వివేకానందరెడ్డి పడి ఉన్న దృశ్యాలు బయటకు రావడంతో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే హత్య చేయించారని ప్రచారం కూడా చేశారు. ‘నారా సుర రక్తచరిత్ర’ అని సొంత పత్రికలో కథనాలను ప్రచురింపజేసిన జగన్‌రెడ్డి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కూడా పొందారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వివేకా హత్య కేసును నీరుగార్చే ప్రయత్నాలను ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి చేశారన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. చంద్రబాబు హయాంలో హత్య కేసును దర్యాప్తు చేయడానికి నియమితులైన అధికారులను జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బదిలీ చేశారు. వారిలో కొందరికి పోస్టింగులు కూడా ఇవ్వలేదు. హత్య కేసును నీరుగారుస్తున్నారన్న అనుమానం రావడంతో వివేకా సతీమణి హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆమె న్యాయస్థానాన్ని వేడుకున్నారు. సీబీఐ దర్యాప్తు విషయంలో జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక యూటర్న్‌ తీసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్‌రెడ్డి సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ముఖ్యమంత్రి అయ్యాక సీబీఐ దర్యాప్తు అవసరం లేదని ప్రభుత్వం తరఫున అఫిడవిట్‌ దాఖలు చేయడం ఈ ఉదంతంలో కీలక పరిణామం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధీనంలో ఉన్న పోలీసులపై నమ్మకం లేక సీబీఐ దర్యాప్తు కోరారని అనుకుందాం. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు గడిచినా కేసు దర్యాప్తు అతీగతి లేకపోవడానికి కారణమేంటి? సొంత బాబాయ్‌ని దారుణంగా చంపినవారిని పట్టుకోవడానికి జగన్‌రెడ్డికి సమయం సరిపోలేదా? అయినా ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేయలేదే. దీంతో జగన్‌ వ్యవహార శైలి పట్ల అనుమానం కలిగిన వివేకానందరెడ్డి సతీమణి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు న్యాయం చేయవలసిందిగా అర్థించడం కోసం డాక్టర్‌ సునీతారెడ్డి రెండు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని కలిశారు. పులివెందులలోనే నివసిస్తున్న వారి బంధువుల్లో కొంతమంది ముఖ్యులు కూడా సునీతతో పాటు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి తమకు సహకరించరన్న అభిప్రాయానికి వారు వచ్చారు. సీబీఐతో విచారణ జరిపించాలని వారు కోరినప్పుడు ‘‘నేను ముఖ్యమంత్రిగా ఉండి కూడా సీబీఐ విచారణ కోరితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లవా?’’ అని జగన్‌రెడ్డి వారి విజ్ఞప్తిని తిరస్కరించారట.


మరో సందర్భంలో, ‘మీరు అనుమానిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటే వారు భారతీయ జనతాపార్టీతో చేతులు కలుపుతారు’ అని కూడా జగన్‌రెడ్డి వ్యాఖ్యానించారట! దీంతో ముఖ్యమంత్రి మనోగతం అప్పుడు అక్కడే ఉన్న పోలీసు ఉన్నతాధికారులకు అర్థమైంది. సునీత వెంట వచ్చిన జగన్‌రెడ్డి బంధువులకు కూడా పరిస్థితి అర్థమైంది. దాంతో సీబీఐ దర్యాప్తు కావాలని వివేకా సతీమణి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు నుంచి నేటి వరకు జరిగిన వివిధ పరిణామాలను పరిశీలించిన వారికి ఎవరికైనా హంతకులను కాపాడటానికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న అనుమానం కలుగక మానదు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డితో పాటు మరికొందరిపై తమకు అనుమానాలు ఉన్నాయని డాక్టర్‌ సునీత తల్లి హైకోర్టుకు తెలిపారు. డాక్టర్‌ సునీత అనుమానపడుతున్న భాస్కర్‌రెడ్డి ఎవరో కాదు. వైఎస్‌ రాజారెడ్డి సోదరుడైన చిన్న కొండారెడ్డి కుమారుడే! అంటే హత్యకు గురైన వివేకానందరెడ్డికి వరుసకు సోదరుడు అవుతారు. భాస్కర్‌రెడ్డి కుటుంబంతో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సతీమణి భారతి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిజానికి రాజారెడ్డి కుటుంబానికి, ఆయన సోదరుడి కుమారుల కుటుంబానికి మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి. తమ తండ్రి దయతో పైకొచ్చిన రాజారెడ్డి తమ కుటుంబాన్ని పైకి రానివ్వలేదని భాస్కర్‌రెడ్డి కుటుంబం భావిస్తూ ఉంటుందని చెబుతారు. రాజశేఖర్‌రెడ్డి జీవించి ఉన్నంతవరకు భాస్కర్‌రెడ్డి ప్రభృతులు రాజకీయాల వైపు చూడలేదు. ఆయన మరణానంతరం వారి వైఖరిలో మార్పు వచ్చింది. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్న జగన్‌రెడ్డికి వివేకానందరెడ్డి అడ్డుగా ఉండేవారు. ఈ క్రమంలోనే ఎంపీ పదవికి రాజీనామా చేయవలసిందిగా ఒక దశలో వివేకానందరెడ్డిపై జగన్‌ ఒత్తిడి తేవడం, ఆయన కాదనడంతో చేయి కూడా చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దాంతో పరిస్థితిని వివరిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీకి వివేకానందరెడ్డి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తన హత్యకు ముందు వివేకానందరెడ్డి మళ్లీ రాజకీయంగా క్రియాశీలకం అయ్యారు. వైసీపీలో వివేకానందరెడ్డికి ప్రాధాన్యం లభించడం ఇష్టం లేని భాస్కర్‌రెడ్డి కుటుంబం ఆయనపై కక్ష పెంచుకున్నదని డాక్టర్‌ సునీత కుటుంబం అనుమానిస్తోంది. బహుశా ఈ కారణంగానే రాజకీయ కారణాలతోనే తన తండ్రిని హత్య చేశారని ఆమె శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తండ్రి మరణంపై ఇంతకాలం బహిరంగంగా నోరు విప్పని డాక్టర్‌ సునీత, ఇప్పుడు ఒక్కసారిగా తన మనసులోని ఆవేదనను వెలిబుచ్చారు. సోదరుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ న్యాయం జరగకపోవడంతో ఆమె మానసికంగా కుంగిపోయారు. అయితే పులివెందులలోని బంధువర్గంలో కొంతమంది ముఖ్యులు ఆమెకు అండగా నిలబడ్డారు. అదే సమయంలో జగన్‌రెడ్డి సొంత చెల్లెలు వైఎస్‌ షర్మిల కూడా డాక్టర్‌ సునీతకు మద్దతుగా నిలబడ్డారు. సునీత చెప్పినట్టుగా ఆ రోజు ఏం జరిగిందో, అందుకు ఎవరు కారకులో షర్మిలకు కూడా తెలుసు. షర్మిల ఇప్పటికే జగన్‌తో రాజకీయంగా విభేదించి తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నారు. తండ్రిని హత్య చేసినవారిని శిక్షించాలని కోరుతూ మరో సోదరి సునీత ఇప్పుడు బయటికొచ్చారు. జగన్‌ కుటుంబంలో ఇప్పుడు ఇద్దరు ఆడపడుచులు ఆయనపై తమ దాడిని పెంచబోతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో గాథ. సొంత చెల్లెలు రాజకీయంగా ఎదగకూడదన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఆమెను పక్కన పెట్టారు. సొంత బాబాయ్‌ కంటే పెదతాత కుమారుడైన భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడైన అవినాష్‌రెడ్డి ముఖ్యమని జగన్‌రెడ్డి భావించడాన్ని డాక్టర్‌ సునీత జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తంమీద ఇద్దరు చెల్లెళ్లు కూడా తాము సోదరుడి చేతిలో వంచనకు, తిరస్కారానికి గురయ్యామని భావిస్తున్నారు. నోరు తెరిస్తే అక్కచెల్లెమ్మలు అని అంటున్న జగన్‌రెడ్డి చేతిలో సొంత చెల్లెళ్లే నిరాదరణకు గురవుతున్నారని చెప్పవచ్చు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబంలో ఇటువంటి పరిణామం జరుగుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. సొంత బాబాయ్‌ హత్యకు గురైనా, సొంత చెల్లెలు తనదారి తాను చూసుకుంటున్నా ఉలుకు పలుకు లేకుండా ఉండగలగడం ఒక్క జగన్‌రెడ్డికే సాధ్యం. బంధువర్గం కూడా రెండుగా చీలిపోయింది. జరుగుతున్న పరిణామాలతో రాజశేఖర్‌రెడ్డి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి మానసికంగా కుమిలిపోతున్నారు. ఇవన్నీ పట్టని జగన్‌రెడ్డి పూర్వకాలపు చక్రవర్తుల మాదిరి ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి అడుగు బయటపెడితే చాలు రహదారుల వెంట ఇనుప కంచెలు నిర్మించుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం ఇప్పుడే చూస్తున్నాం. అయితే రాచరికపు వ్యవస్థలలో జరిగాయని మనం చదువుకున్నటువంటి అంతఃపుర కలహాలు ఇప్పుడు జగన్‌రెడ్డి కుటుంబంలో కూడా జరుగుతున్నాయి. జగన్‌రెడ్డి వైపు వేలెత్తి చూపుతున్న ఆడపడుచులది ఒక్కొక్కరిది ఒక్కో ఆవేదన. వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ఒక ప్రధాన సాక్షిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ప్రచారం జరుగుతోంది. డాక్టర్‌ సునీత భయపడుతున్నట్టుగా అసలైన హంతకులను వెంటనే పట్టుకోని పక్షంలో మిగతా సాక్షుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. చెల్లెలు సునీత తనను బాహాటంగా తప్పుబట్టినందున జగన్‌రెడ్డి ఇప్పటికైనా పూనుకొని దోషులను పట్టుకునేలా చొరవ తీసుకోవడం కనీస బాధ్యత. అయితే ఆయనపై చెల్లెళ్లకు మాత్రం నమ్మకం లేదు. వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద సునీత, షర్మిల మాత్రమే నివాళులర్పించారు. పులివెందులలోని బంధువర్గం నుంచి ఒక్కరు కూడా షర్మిలను కలవకుండా కట్టడి చేశారు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబంలోని ఆడపిల్లలు ఒకవైపు, జగన్‌రెడ్డి మరోవైపు నిలబడ్డారు. పట్టుదల, మొండితనం విషయంలో జగన్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఆయన చెల్లెళ్లు ముందుకు సాగుతున్నారు. తండ్రి హంతకులను చట్టానికి పట్టించడానికై డాక్టర్‌ సునీత చేస్తున్న ఒంటరి పోరాటాన్ని అభినందించాల్సిందే. అయితే ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, ఇకపై జరగబోయేది మరో ఎత్తు. డాక్టర్‌ సునీత మొదటిసారిగా నోరు తెరిచి అనేకవిషయాలు బయటపెట్టినందున ఆమె ప్రాణాలకు హానిజరిగే ప్రమాదం లేకపోలేదు. తమ ఇంటి ఆడపడుచు అయిన సునీత ప్రాణాలను కాపాడాల్సిన కనీస బాధ్యత ముఖ్యమంత్రి జగన్‌పై ఉంటుంది. ఆమెకు ఏ మాత్రం అపాయం జరిగినా అందుకు జగన్‌రెడ్డి నైతిక బాధ్యత వహించక తప్పదు.


జగన్‌ పుణ్యమా అని..

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొద్దిరోజుల క్రితం శాసనసభలో చేసిన వ్యాఖ్యల విషయానికి వద్దాం. గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందినవాళ్లు ఎకరం అమ్ముకుని తెలంగాణలో మూడెకరాల భూమి కొనుక్కునేవారనీ, ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయిందనీ, తెలంగాణలో ఒక ఎకరం అమ్ముకుంటే ఆంధ్రప్రదేశ్‌లో రెండెకరాలు కొనుక్కోగలిగేలా పరిస్థితి మారిందని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. నిజానికి ఇందులో పెద్దగా అతిశయోక్తి ఏమీ లేదు. 60, 70 ఏళ్ల క్రితం ఆంధ్రా ప్రాంతానికి చెందిన వేలాదిమంది తమకున్న కొద్దిపాటి భూమిని అమ్ముకుని తెలంగాణకు వలస వచ్చి వ్యవసాయ భూములు కొనుక్కుని ఆర్థికంగా స్థిరపడ్డారు. ధరల్లో కొంత తేడా ఉన్నప్పటికీ నిన్నమొన్నటి వరకు ఇదే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కేసీఆర్‌ అన్నట్టుగానే సీన్‌ రివర్స్‌ అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు విద్యుత్‌ కొరత లేకుండా చేశారు. దీంతో తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా ఎకరం భూమి ధర పాతిక లక్షల రూపాయలకు తక్కువ లేదు. రెండేళ్ల క్రితం తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు అమరావతిలో భూముల కొనుగోలుకు ఆసక్తి చూపారు. ఫలితంగా హైదరాబాద్‌లో భూముల ధరల పెరుగుదల మందగించింది. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని చంపేయాలనుకోవడంతో హైదరాబాద్‌కు మళ్లీ మహర్దశ పట్టుకుంది. అదే సమయంలో సాగునీటి వసతి పెరగడంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భూముల ధరలు పెరిగిపోయాయి. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్‌ శాసనసభలో ఆ వ్యాఖ్యలు చేశారు. ఆయనన్న మాటలకు ఆంధ్ర ప్రజలు నొచ్చుకోనవసరం లేదు గానీ, అధికారంలో ఉన్నవాళ్లు సిగ్గుతో తల దించుకోవాలి. మంత్రి కొడాలి నాని మాత్రం ఇందుకు భిన్నం గా తమ రాష్ట్రంలో భూముల ధర ఎకరా పది లక్షలకు పడిపోవడానికి చంద్రబాబే కారణమని తన సహజ ధోరణిలో తిట్టిపోశారు. ఒక రకంగా చూస్తే ఆయనన్న మాటల్లో నిజముంది. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి ఉండకపోతే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరో రకంగా ఉండేదని చాలామంది అంగీకరిస్తున్నారు. దీన్నిబట్టి ఎన్నికల్లో ఓడిపోవ డం ద్వారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని కొడాలి నాని మాటలకు అర్థం అయి ఉండవచ్చు. గత ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ ముఖ్యులతో మాట్లాడుతూ, ఆంధ్రాలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌ రియల్‌ ఎస్టెట్‌ రంగం దెబ్బతినే ప్రమాదముందని, జగన్‌రెడ్డి అధికారంలోకి రావడం తమకు మంచిదని వ్యాఖ్యానించారు. ఆయన ఊహించినట్టుగానే జరిగింది..జరుగుతున్నది.


హైదరాబాద్‌లో ఉండే వెధవలకేమి తెలుసు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి అని కొడాలి నాని రెండు రోజుల క్రితం నోరు పారేసుకున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందినవాళ్లు ఇటీవలి కాలంలో హైదరాబాద్‌ చుట్టుపక్కల భూములను విపరీతంగా కొంటున్నారు. ఫలితంగా గతేడాదితో పోలిస్తే హైదరాబాద్‌ రింగ్‌రోడ్డు అవతల వైపు ఉన్న భూముల ధరలు కూడా రెండు కోట్ల నుంచి ఐదు కోట్లకు పెరిగిపోయాయి. కొడాలి నానికి ఈ విషయం తెలియదా? ఫలానా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆ రాష్ట్ర ప్రజల అదృష్టం అని పొరుగు రాష్ర్టాలవారు భావిస్తుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి ఉండటం తమ అదృష్టమని తెలంగాణవాసులు సంబరపడుతున్నారు. ఆంధ్రా ప్రజలు ఎలా భావిస్తున్నారో తెలియదు. ‘సంక్షేమ పథకాల కోసం అప్పులు చేయడం మా హక్కు. చేసిన అప్పులను ఇప్పుడు కాకపోతే పదేళ్లకు తిరిగి చెల్లిస్తాం. అది మా ఇష్టం’ అని కొందరు మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. అప్పులు చేసి పంచిపెట్టడానికి జగన్‌రెడ్డే ముఖ్యమంత్రి కావాలా? ఆ పని మనం చేయలేమా? రాష్ట్ర సంపద పెంచే చర్యలు తీసుకోకుండా ప్రజలను అప్పులపాలు చేయడం గొప్పతనం ఎలా అవుతుంది? జగన్‌రెడ్డి తన సొంత ఆస్తులు అమ్మి పంచి పెట్టడం లేదు కదా? ఎవరో అధికారంలోకి రావడం కోసం అప్పులు చేసి పంచిపెట్టి, రేపు అధికారం నుంచి తప్పుకొంటే ఆ అప్పులు ఎవరు తీరుస్తారు? రాజకీయ నాయకులు అధికారంలోకి రావడం కోసం సంక్షేమ పథకాలను ప్రకటించి వాటి అమలుకు అప్పులు చేస్తున్న తీరుపై జవాబుదారీతనం తీసుకురావలసిన సమయం ఆసన్నమైంది. ఈ రెండేళ్లలో ఉభయ తెలుగు రాష్ర్టాల్లో జరిగిన పరిణామాలను గమనిస్తే దక్షిణ కొరియా, ఉత్తర కొరియా గుర్తుకువస్తున్నాయి. పాలకులను బట్టి ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి ఎలా చితికిపోతుందో చెప్పడానికి ఉత్తర కొరియానే నిదర్శనం. ఒకే దేశంగా ఉండే కొరియా 1948లో దక్షిణ కొరియా, ఉత్తర కొరియాగా విడిపోయింది. ఆ తర్వాత 1950–53 మధ్య ఉభయ దేశాల నడుమ మళ్లీ యుద్ధాలు జరిగాయి. యుద్ధానంతరం ఆరేళ్లకు దక్షిణ కొరియా కోలుకుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే స్థాయికి చేరుకుంది. ఎలక్ర్టానిక్‌, ఆటోమొబైల్‌, చిప్‌ తయారీ రంగాలలో రారాజుగా నిలిచింది. పలు అంతర్జాతీయ బ్రాండ్లకు నిలయంగా మారింది. ఉత్తర కొరియా కూడా యుద్ధం తర్వాత ఏడెనిమిదేళ్లకు కోలుకుంది. సోవియట్‌ యూనియన్‌, చైనా వంటి దేశాల సహకారంతో తలసరి ఆదాయంలోనే కాకుండా జీడీపీలో కూడా దక్షిణ కొరియాను అధిగమించింది. ప్రస్తుత పాలకుడు కిమ్‌ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉత్తర కొరియా ఆర్థికంగా పటిష్ఠంగానే ఉంది. ఆ తర్వాత అంతర్జాతీయంగా జరిగిన పరిణామాల వల్ల విదేశీ సహకారం నిలిచిపోయి ఉత్తర కొరియా ఆర్థికంగా చితికిపోయింది. 1984 నాటికి ఉత్తర కొరియా అప్పులు చెల్లించడంలో డిఫాల్ట్‌ అయింది. ఈ నేపథ్యంలో 2012లో అధికారం చేపట్టిన ప్రస్తుత పాలకుడు కిమ్‌ కొన్ని సంస్కరణలు తెచ్చినా పాశ్చాత్య దేశాలు విశ్వసించలేదు. క్షిపణి, అణ్వస్త్ర పరీక్షలకు కిమ్‌ ప్రాధాన్యం ఇవ్వడంతో ఉత్తర కొరియా ఏకాకిగా మిగిలి మరింతగా ఆర్థిక సంక్షోభంలోకూరుకుపోయింది. ఆర్థిక సంస్థలేవీ అప్పులు ఇవ్వడం లేదు. నియంత పాలనలో ఉత్తర కొరియా కష్టాల కడలిలో ఈదుతున్నది. ఇప్పుడు మన తెలుగు రాష్ర్టాల విషయానికి వస్తే.. రెండు రాష్ర్టాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతూనే ఉంది. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి నిలిచిపోయిందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసినా ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ప్రభుత్వ ఆస్తులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. నాయకుడికి ఉండే దార్శనికత, దూర దృష్టిని బట్టే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది. ఆ రెండూ లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న పరిస్థితులే ఉత్పన్నమవుతాయి!

ఆర్కే

జగనే చెప్పాలి!

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.