విద్యాదీవెన.. వెతలు

ABN , First Publish Date - 2022-07-15T06:11:56+05:30 IST

గుంటూరుకు చెందిన ఓ విద్యార్థిని స్థానిక ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. జగనన్న విద్యాదీవెన పేరుతో వచ్చే ఫీజు రీయింబర్స్‌మెంటే ఆమె చదువుకు ఆధారం.

విద్యాదీవెన.. వెతలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక అగచాట్లు

సకాలంలో అందక భవిష్యత్‌పై నీలి నీడలు

కిందటేడాది సగం ఫీజులతో సరిపుచ్చిన ప్రభుత్వం

బకాయిల కోసం విద్యార్థులపై యాజమాన్యాల ఒత్తిడి

కళాశాలకు రానీయకుండా అడ్డుకుంటున్న నిర్వాహకులు

అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

ఉమ్మడి జిల్లాలోని 96 వేల మంది విద్యార్థుల దీనస్థితి ఇది


(ఆంధ్రజ్యోతి - గుంటూరు)

గుంటూరుకు చెందిన ఓ విద్యార్థిని స్థానిక ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. జగనన్న విద్యాదీవెన పేరుతో వచ్చే ఫీజు రీయింబర్స్‌మెంటే ఆమె చదువుకు ఆధారం. కిందటేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సగమే వచ్చింది. దీంతో మిగిలిన ఫీజు చెల్లించాలని కళాశాల యాజమాన్యం పట్టుపట్టింది. కిందటేడాది ఫీజు బకాయితో పాటు, ఈ ఏడాది తొలి దఫా ఫీజు చెల్లిస్తేనే క్లాసులకు అనుమతిస్తానని తేల్చి చెప్పింది. మూడేళ్ల కష్టం వృథా అవుతుందన్న బాధతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు అప్పు తెచ్చి ఫీజు కట్టాల్సి వచ్చింది. 

- ఇది ఆ విద్యార్థిని ఒక్కరి పరిస్థితే కాదు. ఉమ్మడి జిల్లాలోని 96 వేల మంది విద్యార్థుల దీనస్థితి. జగనన్న విద్యాదీవెన సకాలంలో అందడంలేదు. అందని వారికి కూడా అరకొరగానే అందుతోంది. విద్యాసంవత్సరం మొదలవడంతోపాటే విద్యార్థులకు విద్యాదీవెన వెతలు మొదలయ్యాయి. దీవెన సకాలంలో అందకపోవడంతో వారి విద్యా భవిష్యత్‌పై నీలినీడలు ముసురుతున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంటు సకాలంలో రాకపోవడంతో వారి చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఫీజులు కట్టకపోతే కాలేజీలో అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు.

పాత పథకం పేరు మార్పు.. నిబంధనల షాక్‌

ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజులు చెల్లిస్తామని ప్రస్తుత సీఎం జగన్‌ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత అప్పటికే ఉన్న పథకాన్ని మార్చారు. ఆర్భాటంగా తన పేరుతో ‘జగనన్న విద్యాదీవెన’ అంటూ హడావుడి చేశారు. ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందన్న ఆశతో చాలామంది నిరుపేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌, ఎంసీఏ, ఎంబీఏ వంటి టెక్నికల్‌ కోర్సుల్లో చేరారు. తీరా పథకం మొదలయ్యాక కోతలు, ఏరివేతలతో ప్రభుత్వం విద్యార్థులకు షాకుల మీద షాకులు ఇస్తూ వచ్చింది.   రకరకాల నిబంధనలను తీసుకువచ్చి మూడేళ్లుగా విద్యార్థుల సంఖ్యను భారీగా తగ్గించింది. పథకం మొదలైన నాటి నుంచి ప్రభుత్వం నిబంధనల వడపోతు మొదలు పెట్టింది. విద్యార్థి కుటుంబానికి 10 ఎకరాలలోపు మాగాణి లేదా 25 ఎకరాలలోపు మెట్ట, లేదా రెండూ కలిపినా 25 ఎకరాలలోపే ఉండాలని, పట్టణ ప్రాంతంలో 1500 చదరపు అడుగులకు మించి ఇల్లు ఉండరాదని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదని, ఆదాయపు పన్ను, పెన్షనర్లు ఉండకూడదని సవాలక్ష నిబంధనలు పెట్టి విద్యార్థులను పథకానికి దూరం చేసింది. దీంతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వర్తించదని చెప్పి మరో 10 వేల మందికి ఠోకరా ఇచ్చింది.  

వాయిదాలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం

కిందటేడాది రావాల్సిన విద్యాదీవెన సగం మాత్రమే వచ్చింది. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి చివరి రెండు విడతల విద్యాదీవెన పెండింగులో ఉంది. గతంలో విద్యార్థుల ఫీజులను ఆయా కళాశాలలకే నేరుగా ప్రభుత్వం చెల్లించే పద్ధతి ఉండడంతో యాజమాన్యాలు వేచి చూసేవి. ప్రస్తుత ప్రభుత్వం ఫీజులను తల్లుల ఖాతాల్లో వేస్తోంది. వారే నేరుగా కళాశాలలకు ఫీజులు చెల్లిస్తున్నారు. ఈ పద్ధతి కారణంగా ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేకుండా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి తల్లిదండ్రులపై పడింది. దీంతో యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే కళాశాలల్లోకి అనుమతిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కిందటేడాది బకాయిలతో పాటు ఈ ఏడాది తొలివిడత ఫీజులను కూడా చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 


Updated Date - 2022-07-15T06:11:56+05:30 IST