గుంటూరు: ప్రభుత్వం ఏదైనా పథకం ఇస్తానంటే వద్దనడం చూశారా?. కానీ అదే జరుగుతుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం తమకు వద్దంటే వద్దంటున్నారు నిరు పేద ప్రజలు. లబ్ధిదారులను ఇంతలా భయపెడుతున్న ఆ పథకంలోని లొసుగులు చూస్తే ప్రతిఒక్కరూ ఈ మాటే అంటారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంది. ఎప్పుడో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లకు, జాతీయ గృహ నిర్మాణ పథకం ఇళ్లకు ఇప్పుడు బకాయిలు చెల్లంచడమేంటని ప్రశ్నిస్తున్నారు. పట్టణాల్లో ఈ పథకంపై అవగాహన కల్పించడానికి వెళ్లిన వార్డు, సచివాలయ సిబ్బందికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.
20, 30 ఏళ్ల కిందటే నిర్మించుకున్న ఇళ్లకు అసలు లబ్ధిదారులు లేకపోయినా ఆ ఇళ్లలో నివాసముంటున్న వారిని వన్ టైం సెటిల్ మెంట్ చేసుకోవాలంటూ సచివాలయ సిబ్బంది ఒత్తిడి తేవడంతో గుంటూరు పట్టణంలో కొన్ని చోట్ల పేదలు తిరగబడుతున్నారు. కొన్ని ఇళ్లు ఇప్పటికే చేతులు మారాయి. అలాంటి వారు రెండింతలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి రావడంతో ఇలాంటి పథకం తమకొద్దని అనుకున్నారు. ఓవైపు వన్ టైం సెటిల్ మెంట్ తప్పనిసరి కాదని ఆదేశాలు ఇచ్చి మరోవైపు వీఆర్వోల ద్వారా తమకు అంగీకారం కాదని రాయించుకోవడంతో పలువురు పట్టణ పేదలు అభద్రతాభావంతో ఉన్నారు.