అమ్మకానికి ‘జగనన్న’ స్థలాలు..

ABN , First Publish Date - 2022-10-02T06:52:07+05:30 IST

ప్రభుత్వం మార్కెట్లో ఉన్న ఇంటి నిర్మాణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా పెద్ద సంఖ్యలో ఇళ్లు నిర్మించామని రాజకీయంగా గొప్పలు చెప్పుకోవడానికి స్థలాలను కేటాయించి ఇళ్లను మంజూరు చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో ఇల్లు కట్టుకోలేక.. కట్టుకోకపోతే స్థలం రద్దు అవుతుందన్న భయంతో అమ్ముకుంటున్నారని, దీనికి ప్రభుత్వమే కారణమని పలువురు

అమ్మకానికి ‘జగనన్న’ స్థలాలు..
కడప నగరం శివారులోని వైఎ్‌సఆర్‌ లే అవుట్‌ సమీపంలో ఉన్న జగనన్న లే అవుట్లు

కడప, ప్రొద్దుటూరులో ఇంటి స్థలాల విక్రయం

ఒక్కో ప్లాటు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షలు

ఇంటి నిర్మాణానికి ప్రభుత్వమిచ్చే డబ్బులు సరిపోక.. 

కట్టుకోకపోతే స్థలాలు రద్దు చేస్తారన్న భయంతో.. 

అమ్మేస్తున్న లబ్ధిదారులు


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్థలం ఇచ్చి ఇల్లు కేటాయిస్తామంటే పేదలు సంబరపడ్డారు. సొంతింటి కల నెరవేరుతుందని ఎగిరి గంతేశారు. అయితే ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలం.. ఇంటి నిర్మాణానికి ఇచ్చే డబ్బు చూసి సగం మంది పేదల్లో సొంతింటి ఆశ నీరుగారిపోయింది. కొన్ని చోట్ల ఎక్కడో ఊరికి దూరంగా విసిరివేసినట్లుగా స్థలాలు ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి ఇచ్చే డబ్బు సరిపోదు గనుక ప్రభుత్వమే నిర్మించాలంటూ చాలామంది కోరారు. అయితే లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకోవాలని ప్రభుత్వం వత్తిడి తేవడంతో అప్పో సప్పో చేసి నిర్మాణాలు చేపట్టారు. నెలలు గడుస్తున్నా బిల్లులు రాలేదు. ఇళ్లు కట్టుకోకుంటే స్థలాలు రద్దు చేస్తాం.. వేరొకరికి ఇస్తాం అంటూ ఒక పక్క అధికారుల బెదిరింపులు.. కట్టుకుందామంటే అంత స్థోమత లేక పేదల అవస్థలు.. దీంతో కొన్ని చోట్ల జగనన్న ఇళ్ల స్థలాలను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా కడప, ప్రొద్దుటూరులో ఈ అమ్మకాలు ఎక్కువగా సాగుతున్నాయని అంటున్నారు. కేవలం నిర్మాణం భారం కావడంతో అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. 


(కడప - ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మార్కెట్లో ఉన్న ఇంటి నిర్మాణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా పెద్ద సంఖ్యలో ఇళ్లు నిర్మించామని రాజకీయంగా గొప్పలు చెప్పుకోవడానికి స్థలాలను కేటాయించి ఇళ్లను మంజూరు చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో ఇల్లు కట్టుకోలేక.. కట్టుకోకపోతే స్థలం రద్దు అవుతుందన్న భయంతో అమ్ముకుంటున్నారని, దీనికి ప్రభుత్వమే కారణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిలా ్లవ్యాప్తంగా 529 లేఅవుట్లలో 1,06,043 ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. కడప కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో సెంటు చొప్పున, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు చొప్పున ఇళ్లస్థలాలు ఇచ్చారు. కడప నియోజకవ ర్గానికి 22,529 ఇళ్లను కేటాయించారు. కార్పొరేషన్‌ పరిధిలో 15 లే అవుట్లు ఇళ్ల స్థలాలు కేటాయించారు. వైఎ్‌సఆర్‌ లేఅవుట్‌ సమీపంలో ఒకటి, నానాపల్లె, మామిళ్లపల్లె, కొప్పర్తితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో జగనన్న లే అవుట్లు వేశారు.


అలా అమ్మేస్తున్నారు

గృహ నిర్మాణాలు వేగవంతం చేసేందుకు క్షేత్రస్థాయి అధికార యంత్రాంగంపై ఉన్నతాధికారులు తీవ్ర వత్తిడి చేస్తున్నారు. దీంతో గృహనిర్మాణ శాఖ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఇంకా బేస్‌మట్టం వేసుకోని వారికి బేస్‌మట్టం వేసుకోవాలంటూ.. బేస్‌మట్టం స్థాయిలో ఉన్న నిర్మాణాలు, రూఫ్‌ స్థాయిలో ఆగిన నిర్మాణాలు పూర్తి చేసేలా లబ్ధిదారులపై వత్తిడి తెస్తున్నారు. ఇల్లు కట్టుకోకపోతే స్థలాలు రద్దు చేసి వేరే వారికి ఇస్తామంటూ వలంటీర్లు హెచ్చరిస్తున్నట్లు చెబుతున్నారు. కట్టుకోవాలంటే ప్రభుత్వమిచ్చే డబ్బు సరిపోదు.. కట్టుకోకపోతే స్థలం రద్దవుతుంది.. దీంతో ప్రధాన ప్రాంతాలకు దగ్గరలో ఉండే ఇంటి స్థలాలను అమ్ముతున్నట్లు సమాచారం.

కడప నగరం శివారులోని వైఎ్‌సఆర్‌ లేఅవుట్‌ సమీప ప్రాంతాల్లో వేసిన కొన్ని స్థలాలు ఇప్పటికే అమ్మేసినట్లు చెబుతున్నారు. ఇక్కడ ఒక్కో స్థలం రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల మధ్య అమ్మేసినట్లు తెలుస్తోంది. లబ్ధిదారుని పేరిటనే కొనుగోలు చేసిన వారు ఇంటి నిర్మాణం చేపడతారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వమిచ్చే సొమ్ము అసలు లబ్ధిదారుడే తీసుకుంటాడు. ఇల్లు మాత్రం కొనుగోలు చేసిన వారు సొంత డబ్బు వెచ్చించి కట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్లు రాసుకుంటున్నారని సమాచారం. మామిళ్లపల్లె, కొప్పర్తి లే అవుట్లలో కూడా ఇదే తరహాలో అమ్మకాలు జరిపినట్లు చెబుతున్నారు. ప్రొద్దుటూరులోని మీనాపురంలో 104.72 ఎకరాల్లో జగనన్న లేఅవుట్లు వేశారు. ఎకరా రూ.40 లక్షలకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇక్కడ 4,959 ప్లాట్లు వేశారు. ఈ లే అవుట్‌ సమీపంలో ప్రొద్దుటూరుకు చెందిన ఓ నేత ప్రైవేటు వెంచర్‌ ఉంది. ఇక్కడ స్థలాలకు డిమాండ్‌ ఉండడంతో మీనాపురం లేఅవుట్లలోని జగనన్న ఇళ్ల స్థలాలను కూడా అమ్మకాలు జరిపినట్లు చెబుతున్నారు. ఇక్కడ సెంటు రూ.2 లక్షల చొప్పున విక్రయించారని తెలిసింది. అమృతానగర్‌లో కొన్ని ప్లాట్లు క్రయ విక్రయాలు జరిపినట్లు సమాచారం. 

Updated Date - 2022-10-02T06:52:07+05:30 IST