ప్రహసనంగా..

ABN , First Publish Date - 2022-10-03T05:54:34+05:30 IST

జిల్లాలో జగనన్న లే అవుట్ల అభివృద్ధి, పక్కా గృహాల నిర్మాణం ప్రహసనంగా మారింది.

ప్రహసనంగా..
కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలో లే అవుట్‌ పరిస్థితి ఇదీ..

ముందుకు సాగని ఇంటి నిర్మాణాలు

 కరగ్రహారంలో 16వేల మందికి ఇచ్చిన లే అవుట్‌లో మోకాలి లోతు నీరు

 మెరక పనులు ఎప్పటికో..

 మళ్లీ వేసవి వరకు మెరక చేసేందుకు అవకాశం లేని వైనం

 జిల్లాలో జగనన్న లే అవుట్ల అభివృద్ధి, పక్కా గృహాల నిర్మాణం ప్రహసనంగా మారింది.  660 జగనన్న లే అవుట్లలో 96 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని అధికారులు చెబుతున్నా 74,821 మందికి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇప్పటివరకు 5 వేల గృహాల నిర్మాణం మాత్రమే పూర్తయింది. జగనన్న లేఅవుట్‌లలో కనీస అభివృద్ధి పనులు,  వసతులు లేకపోవడంతో పేదలు గృహాల నిర్మాణాలను ప్రారంభించేందుకు ముందుకురాని పరిస్థితి నెలకొంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు జగనన్న లే అవుట్లలో వర్షపునీరు చేరింది. అక్టోబరు, నవంబరు నెలల్లో భారీవర్షాలు కురిస్తే మరో రెండునెలల పాటు గృహాల నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఉండని స్థితి నెలకొంది.

 ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :  మచిలీపట్నంలో 16 వేల మంది పేదలకు కరగ్రహారం సమీపంలో 350 ఎకరాల్లో ఇళ్లస్థలాలు ఇచ్చారు. రెండేళ్లుగా ఈ లేవుట్‌ను మెరక పనులు చేయకుండా నిలిపివేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లే అవుట్‌ అని చెబుతున్నారు. అయినా ఈ లే అవుట్‌లో మెరకచేసే పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. 16 వేల మందికి ఇక్కడ ప్లాట్లు ఇచ్చినా ఒక్కరు కూడా ఇక్కడ గృహాల నిర్మాణం ప్రారంభించలేదు. భారీ వర్షాలు కురిస్తే డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేని లోతట్టు ప్రాంతాన్ని ఇళ్లస్థలాలుగా ఎంపిక చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. వర్షాల వల్ల రానున్న రెండు నెలలపాటు ఇక్కడ గృహల నిర్మాణం ప్రారంభించడానికి వీలు ఉండదని చెబుతున్నారు. బందరు మండలంలోని రుద్రవరం పంచాయతీ పరిధిలో చిన్నాపురం-మచిలీపట్నం రహదారి పక్కనే లేఅవుట్‌ వేశారు. రూ.1.50 కోట్లతో ఇక్కడ మెరక చేశామని అధికారులు, పాలకులు చెబుతున్నారు. లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు ట్యాగింగ్‌ కూడా చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ లేఅవుట్‌లో సగభాగం నీటితో నిండిపోయింది. దీంతో ఇక్కడ గృహాల నిర్మాణం నిలిచిపోయింది.

 లే అవుట్లలో సమస్యలు కోకొల్లలు..

గుడివాడ మండలం మోటూరు, చౌటపల్లి, గుంటాకోడూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన లే అవుట్లలో వర్షపునీరు నిలిచిపోయింది. గృహాల నిర్మాణానికి మెటీరియల్‌ను తీసుకువెళ్లేందుకు రహదారులు బురదకయ్యలుగా మారడంతో నిర్మాణం నిలిచి పోయింది. గుడివాడలో 9 వేలకుపైగా టిడ్కో గృహాలకు వెళ్లే రహదారిని నిర్మిస్తున్నారు. ఈ గృహాలకు విద్యుదీ కరణ కాంట్రాక్టును ఎంపీ విజయసాయిరెడ్డి బంధు వులకు కట్టబెట్టడంతో ఈ అంశం వివాదాస్పదమైంది. అవనిగడ్డ మండలం పాతఎడ్లంకలో వేసిన లేఅవుట్‌కు వెళ్లేందుకు రహదారి లేదు. నాగాయలంక మండలం వక్కపట్లవారి పాలెంలోని లేఅవుట్‌దీ ఇదే దుస్థితి.  కృత్తివెన్ను మండలం మాట్లాంలోని లేఅవుట్‌లో వర్షపునీరు నిలిచి ఉంది. ఇక్కడ పనులు చేసేందుకు తాపీ మేస్త్రీలు ఎవ్వరూ రావడంలేదు. గన్నవరం మండలం మర్లపాలెంలోని లేఅవుట్‌ బురదయంగా మారింది. కేసరపల్లిలో 70 ఎకరాల్లో లేఅవుట్‌ వేయగా కేవలం 15 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసి ప్లాట్లు వేశారు. మిగిలిన 55 ఎకరాలను అభివృద్ధి చేయకుండా నిలిపివేశారు. బంటుమిల్లిలో 660 మంది పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చారు.వర్షానికే ఈ లేవుట్‌లోకి నీరు చేరింది. రహదారుల పనులు చేయకపోయినా 250 మంది ఇక్కడ గృహాల నిర్మాణం ప్రారంభించారు. జిల్లాలోని జగనన్న లే అవుట్లలో రూ.72కోట్ల అంచనాలతో రహ దారులు, విద్యుత్‌, తాగునీటి వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నా ఎక్కడ, ఎంతమేర పనులు జరుగుతున్నాయో అధికారులకే తెలియాలి.  


Updated Date - 2022-10-03T05:54:34+05:30 IST