ఇవేం బెదిరింపులు!

ABN , First Publish Date - 2022-08-10T06:11:48+05:30 IST

జగనన్న కాలనీల్లో ఇళ్ల లబ్ధిదారులపై అధికారులు ప్రతాపం చూపుతున్నారు.

ఇవేం బెదిరింపులు!

లబ్ధిదారులపై నిబంధనల అస్త్రం అమలు

  జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల రద్దుకు యోచన 

  ఇళ్ల పురోగతి కోసం అధికారుల అడ్డదారులు 

  రెండు జిల్లాల్లోనూ దాదాపు లక్ష మంది లబ్ధిదారులపై జులుం 

జగనన్న కాలనీల్లో ఇళ్ల లబ్ధిదారులపై అధికారులు ప్రతాపం చూపుతున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి చూపించుకోవడం కోసం దొడ్డిదోవ పద్ధతులకు శ్రీకారం చుడుతున్నారు. లబ్ధిదారులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే.. ఇంటి పట్టాను రద్దు చేస్తామని భయపెడుతున్నారు. గట్టిగా అడిగితే ‘కండీషన్‌’ అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నారు. మీకు ఇచ్చిన ఇంటి పట్టాలో ఆరు నెలల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే స్వాధీనం చేసుకునే నిబంధన ఉందని బెదిరిస్తూ  లబ్ధిదారుల నోళ్లు మూయిస్తున్నారు. లే అవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలనే నిబంధన అమలు చేయని అధికారులపై ఎవరు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు తిరిగి ప్రశ్నిస్తున్నారు.  రెండు జిల్లాల్లో దాదాపుగా లక్ష మంది లబ్ధిదారులపై పట్టా రద్దు బెదిరింపు కత్తి వేలాడుతోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. వేసవి కాలం కాస్తోకూస్తో పురోగతి కనిపించినా.. వర్షాకాలం వచ్చే సరికి పూర్తిగా పనులు సాగటం లేదు. జిల్లా యంత్రాంగంపై జగనన్న ఇళ్ల పురోగతికి ప్రభుత్వం టార్గెట్లు నిర్దేశిస్తోంది. ఈ టార్గెట్‌లో వెనుకబడకుండా ఉండేందుకు రెండు జిల్లాల అధికారులు అన్ని దారులూ వెతుక్కుంటున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాగా ఉన్నపుడు జిల్లాలో 3 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వగా అందులో తొలి విడతగా 2.15 లక్షల మంది లబ్ధిదారులను ఇంటిని నిర్మించుకునేందుకు ఎంపిక చేశారు. రెండు జిల్లాల్లో ఇప్పటికీ ఏ విధమైన పనులూ మొదలు పెట్టనివారు 90 వేల మంది ఉన్నారు. వీరంతా అప్పులు చేసి వాటిని తీర్చే స్తోమత లేక.. ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించలేక నానా అగచాట్లు పడుతున్నారు.

  ఇంటి నిర్మాణం ఖర్చు భరించలేక..

జగనన్న కాలనీల్లో ఇంటిని నిర్మించాలంటే హీన పక్షంగా రూ.5 లక్షల వ్యయం అవుతోంది. కాంట్రాక్టు సంస్థల ద్వారా ప్రభుత్వం చేపట్టే పేదల ఇంటి నిర్మాణం సైతం రూ.4.50 లక్షలు అవుతోంది. కరోనా సంక్షోభ అనంతర  పరిస్థితుల్లో పేదల ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో లబ్ధిదారుల మెడ మీద కత్తి పెట్టి ఇళ్ల నిర్మాణ పనులు చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా.. రెండు జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం ఆశాజనకంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పేదల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయటం కోసం.. రెండు జిల్లాల గృహనిర్మాణ శాఖ అధికారులు  అడ్డదారుల్లో వెళుతున్నారు. ఇళ్ల నిర్మాణం పురోగతి కోసం బేస్‌మెంట్‌ పనులు అయినా ప్రారంభించటానికి వీలుగా గృహ నిర్మాణ శాఖ అధికారులు బెదిరింపుల పర్వానికి దిగుతున్నారు. 

  లే అవుట్‌లో సదుపాయాల సంగతేంటి?

జగనన్న కాలనీల్లో పేదల గృహ నిర్మాణాల సంగతి అటుంచితే జిల్లా యంత్రాంగాలు లే అవుట్లలో నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంది. ఈ నిబంధనలను జిల్లా యంత్రాంగాలు ఎక్కడా పాటించలేదు. రెండు జిల్లాల్లో మొత్తం 1456 లే అవుట్లు ఉన్నాయి. ఈ లే అవుట్లలో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్లు, వీధి దీపాలు తదితరాలు వంటివి ఏర్పాటు చేయాలి. జిల్లా యంత్రాంగం ఒక్క లే అవుట్‌లో కూడా ఈ పనులు చేపట్టలేదు. నిబంధనల ప్రకారం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇల్లు ఎలా కట్టుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. మరి జిల్లా యంత్రాంగం మీద ఎవరు చర్యలు తీసుకుంటారని మండిపడుతున్నారు. 

  కండీషన్‌ ఏమిటి?

ఉమ్మడి జిల్లాగా ఉన్నపుడు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఇళ్ల పట్టాల్లో లబ్ధిదారులకు కొన్ని నిబంధనలను నిర్దేశించారు. అందులో ఇంటిని మంజూరు చేసిన తేదీ నుంచి 24 నెలల్లో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. పట్టాలోని నిబంధనల్లో ఈ అంశాన్ని చేర్చకపోయినా.. అసైన్డ్‌ పట్టాలకు సంబంధించి ఆరు నెలల్లోపు కనీసం ఇంటి నిర్మాణం ప్రారంభించి అయినా ఉండాలి. రెండు జిల్లాల్లో 90 వేల మంది లబ్ధిదారులు రెండు సంవత్సరాలు దాటినా ఇంటి నిర్మాణం పూర్తి చేయటం సంగతి అటుంచితే మొదలే పెట్టలేదు. దీంతో ఈ అంశాన్ని కండీషన్‌ అస్త్రంగా గృహ నిర్మాణ సంస్థ అధికారులు వాడుకుంటున్నారు. 



Updated Date - 2022-08-10T06:11:48+05:30 IST