సొంతింటి కల... నెరవేరేదెలా..?

ABN , First Publish Date - 2021-07-27T06:48:05+05:30 IST

పేదల బతుకుల్లో ‘నవరత్న’ కాంతులు నింపుతామని, అందులో భాగంగా అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తామని చెప్పిన సీఎం జగన మాట తప్పారు. ఇళ్లు కట్టించలేము. మీరే నిర్మించుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో పేదల సొంతింటి ఆశలు అడియాశలయ్యాయి.

సొంతింటి కల... నెరవేరేదెలా..?

ఇళ్లు కట్టిస్తామని చెప్పి..మాట తప్పిన ప్రభుత్వం

లబ్ధిదారులే కట్టుకోవాలని ఆదేశాలు 

ఇళ్లు కట్టుకోకుంటే పట్టా వెనక్కు .. 

భారీగా పెరిగిన ఇంటి సామగ్రి ధరలు 

ఇళ్లు కడితే అప్పులపాలే అంటున్న లబ్ధిదారులు 

నేడు గృహనిర్మాణ శాఖ మంత్రి సమీక్ష

అనంతపురం, జూలై26(ఆంధ్రజ్యోతి): పేదల బతుకుల్లో ‘నవరత్న’ కాంతులు నింపుతామని, అందులో భాగంగా అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తామని చెప్పిన సీఎం జగన మాట తప్పారు. ఇళ్లు కట్టించలేము. మీరే  నిర్మించుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో పేదల సొంతింటి ఆశలు అడియాశలయ్యాయి. ఇదిలా ఉండగా... ఇళ్లు నిర్మించుకోకపోతే పట్టా రద్దు చేస్తామని అధికారుల నుం చి ఒత్తిళ్లు అధికమయ్యాయి. ఇళ్లు నిర్మించుకోకపోతే.. పట్టా రద్దవుతుంది. నిర్మించుకుంటే అప్పుల పాలు కాకతప్పదని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.  మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు ప్రభుత్వం మంజూరు చేసిన స్థలా (జగనన్న కాలనీలు)ల్లో అప్పో సప్పో చేసి వేసుకున్న పునాదులు పూర్తిగా  నీటమునిగాయి. ఈ విధంగానూ లబ్ధిదారుడు ఆర్థికభారాన్ని మోయాల్సి వస్తోంది. ఇలాంటి దారుణ పరిస్థితులు లబ్ధిదారులు ఎదుర్కొంటున్న తరుణంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు మంగళవారం ఆ శాఖపై ఏమి సమీక్ష చేయదలచుకు న్నారో అంతుపట్టడం లేదు. జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత ఆవరణలో ఉన్న డీఆర్‌సీ భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా ఇంచార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, జిల్లా మంత్రి శంకరనారాయణ, కలెక్టర్‌ నాగలక్ష్మి, జేసీలు నిశాంతకుమార్‌, డాక్టర్‌ సిరి, హౌసింగ్‌ జేసీ నిశాంతి, హౌసింగ్‌ పీడీ వెంకటేశ్వరరెడ్డి, ఈఈలు, డీఈలు, ఏఈలతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొననున్నారు. 


తొలి విడత లక్ష్యం బారెడు... గ్రౌండింగ్‌ మూరెడు

జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. 2.25 లక్షల మం ది పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకొ చ్చింది. అందులో 75 శాతం మందికి స్థలాలు కేటాయిం చారు. మరో 25 శాతం మందికి ఇప్పటికీ స్థలాలు కేటా యించలేదు. స్థలాల కోసం ఆ పేదలంతా ఎదురు చూస్తు న్నారు.  జిల్లాలో తొలి విడతలో 1,11,099 ఇళ్లు నిర్మించా లని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఆ మేరకు జిల్లా యంత్రాంగానికి ఆ బాధ్యతలను అప్పజెప్పింది. ఇటీవలే ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజా కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లోనూ ఆర్భాటంగా చేపట్టారు. అందుకోసం 429 లే అవుట్లలో నిర్మాణాలు చేపట్టారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే... అనంతపురం అర్బనలో 10136 ఇళ్లు కేటాయించగా 477 గ్రౌండింగ్‌ అయ్యాయి. శింగనమలలో 4147 ఇళ్లకుగానూ 2274, తాడిపత్రిలో 3491 ఇళ్లకు 1478, గుంతకల్లులో 4195 ఇళ్లకు 1394, ఉరవకొండలో 26137 ఇళ్లకు 12960, మడకశిరలో 1201 ఇళ్లకు 371 ఇళ్లు మా త్రమే గ్రౌండింగ్‌ చేశారు. హిందూపురం నియోజక వర్గంలో 12113 ఇళ్లకు గాను 4169, పెనుకొండలో 7161 ఇళ్లకు 4396, పుట్టపర్తిలో 5558 ఇళ్లకు 2700, కదిరిలో 3360 ఇళ్లకు 752, రాయదుర్గంలో 1549 ఇళ్లకు 432, కళ్యాణదుర్గంలో 3469 ఇళ్లకు 768, ధర్మవరంలో 14894 ఇళ్లకు 4856, రాప్తాడులో 13678 ఇళ్లకు 6132 ఇళ్లకు గ్రౌండింగ్‌ చేశారు. దీన్నిబట్టి చూస్తే... తొలి విడతలో ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంలో 43,159 ఇళ్లను మాత్రమే గ్రౌం డింగ్‌ చేశారు. అంటే  39 శాతం ఇళ్లు మాత్రమే గ్రౌం డింగ్‌ కావడం చూస్తే పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమవుతోంది.


జగనన్న కాలనీల్లో సెంటు స్థలంలో ఇల్లు కట్టాలంటే...

వైఎ్‌సఆర్‌ గృహ నిర్మాణం పథకంలో భాగంగా పట్టణవాసులకు ఒక సెంటు, గ్రామీణ ప్రాంతవాసులకు 1.5 సెంట్లు స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పడంతో లబ్ధిదారులు అదే ఆశల్లో ఉన్నారు. ప్రభుత్వం రూ. 1.80 లక్షలు ఇస్తాం. మీరే కట్టుకోవాలని చెప్పడంతో లబ్ధిదారులు ఖంగుతింటున్నారు. బిల్డర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల అభిప్రాయం మేర కు ఒక సెంటులో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఇల్లు నిర్మాణం పూర్తి చేయాలంటే... రూ. 5.28 లక్షలు ఖర్చ వుతోంది. ప్రభుత్వం రూ. 1.80 లక్షలు ఇస్తామని చెబుతున్న నేపథ్యంలో మిగిలిన రూ. 3.48 లక్షల అదనపు భారాన్ని లబ్ధిదారుడే భరించాల్సి ఉంటుంది. ఇక సెంటున్నరలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలంటే అదనంగా మరో రూ. లక్షన్నర ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఎటు చూసినా లబ్ధిదారుడు రూ. ఐదు లక్షల్లోపు ఆర్థికభారాన్ని మోయాల్సి వస్తోంది.  ఉదాహరణకు ఒక సెంటులో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలంటే... బిల్డర్‌, ఇంజనీర్‌ ఎస్టిమేషన మేరకు... ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో... 6 వేల సిమెంటు ఇటుకలు కావాలి. ఒక్కో ఇటుక సగటున రూ. 15లు, ఈ లెక్కన 6 వేల ఇటుకలకు రూ. 90 వేలు ఖర్చవుతోంది. వంద బస్తాల సిమెంటు అవసరం. ఒక బస్తా సిమెంటు ధర రూ. 350 నుంచి రూ.400 వరకు ఉంది. ఈ లెక్కన సగటున రూ. 35 వేల నుంచి రూ. 40 వేలు ఖర్చవుతోంది. అదే విధంగా ఇనుము అర టన్నుకుపైగా పడుతుంది. ఈ లెక్కన సగటున కేజీ ఇనుము రూ. 67 నుంచి రూ. 80లు ధర పలుకు తోంది. రూ. 40,200 నుంచి రూ. 48 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇసుక నాలుగు టిప్పర్లు అవసరం. ఈ లెక్కన టిప్పరు ఇసుక రూ. 25 వేలకు లభిస్తోంది. నాలుగు టిప్పర్లకు రూ. లక్ష ఖర్చవుతుంది. ఇల్లు నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన కూలీల కోసం రూ. 1.5 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఇక కిటికీలు, తలుపులు, వగైరా ఖర్చుల కోసం మరో రూ. లక్ష ఖర్చవుతోంది. ఈ లెక్కన ఎటు చూసినా... రూ. 3.48 లక్షలకుపైగా అప్పులు చేయాల్సిందేనన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఇక సెంటున్నరలో ఇంటి నిర్మా ణం పూర్తి చేయాలంటే లబ్ధిదారుడు రూ. 5 లక్షలకుపైగా అప్పు చేయక తప్పదు.



ఆప్షన 1 : ఇంటి నిర్మాణానికి ప్రభుత్వమే సామగ్రి, కూలీ ఖర్చులు 

ఇస్తుంది. లబ్ధిదారులే ఇళ్లు కట్టుకోవాలి. 

ఆప్షన 2 : ప్రభుత్వం దశల వారీగా డబ్బులు చెల్లిస్తుంది. లబ్ధిదారులే 

సామగ్రిని తెచ్చుకొని ఇళ్లు నిర్మించుకోవాలి.

ఆప్షన 3 : ప్రభుత్వమే నాణ్యతతో కూడిన సామగ్రితో ఇళ్లు కట్టించి ఇస్తుంది. 

ఇందులో ఏ ఆప్షన ఎంచుకున్నా... ప్రభుత్వం చేయూతనిస్తుంది.

ఇదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రతి వేదిక లోనూ చెప్పారు. 

ఈ నేపథ్యంలో లబ్ధిదారులు మూడో ఆప్షనకే మొగ్గు చూపుతున్నారు. అయితే 

ప్రభుత్వం రూ. 1.80 లక్షలు లబ్ధిదారుడికి ఇస్తాము. ఎవరికి వారే ఇళ్లు 

కట్టుకోవాలని చెప్పడంతో ఆ వర్గాలు తీవ్ర నిరాశకు లోనవుతున్నాయి.



ఇల్లు కట్టుకునే స్తోమత లేదు : రాజేశ్వరి, గుంతకల్లు టౌన

పేదవాళ్లమనే మాకు ఇంటి స్థలాలిచ్చారు. ఇల్లు కట్టించి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడేమో ఎవరికి వారే ఇళ్లు కట్టుకోవాలని చెబుతున్నారు. మాకు ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే రూ. ఐదారు లక్షలు ఖర్చవుతోంది. సిమెంటు, ఇనుము ధరలు అధికంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలి. 


పునాదికే ఉన్న డబ్బులు ఖర్చయ్యాయి 

: భాగ్యలక్ష్మి, కొట్లోపల్లి, చిలమత్తూరు మండలం

ప్రభుత్వం నాకు ఏడాది కిందట ఇల్లు మంజూరు చేసింది. ఇప్పటికే పునాది నిర్మించుకున్నాం. కూలీనాలీ చేసి దాచుకున్న డబ్బులు పునాది వేసుకోవడంతోనే ఖర్చయిపోయాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని ఇక్కడి అధికారులు ఒత్తిడి పెడుతున్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఇటుకల దగ్గరి నుంచి ఇనుము, కలప ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వమే చొరవ తీసుకొని ఇళ్లు కట్టిస్తేగానీ మాలాంటి పేదలకు సొంతింటి కల నెరవేరదు. 


ప్రభుత్వమిచ్చే డబ్బులు పునాదులకే సరిపోవు 

: రంగమ్మ, అగళి, మడకశిర


ప్రభుత్వం ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పడంతో సంతోషించాం. ఇప్పుడేమో ఎవరికి వారే కట్టుకోవాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రభు త్వమిచ్చే రూ. 1.80 లక్షలు ఇప్పుడున్న ధరలతో పునాదులకే సరిపోవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోవా లంటే... రూ. ఆరేడు లక్షలు కావాలి. పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. 


కరోనాతో పనుల్లేక తిండికే ఇబ్బందులు పడుతున్నాం

వెంకటసునీత, యాడికి

రెండేళ్లుగా కరోనాతో పనుల్లేక తిండికే ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాం. ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో మాట తప్పుతున్నారు. ఇప్పుడున్న కష్టకాలంలో రూ. లక్షలు ఖర్చు చేసి ఇల్లు నిర్మించుకునే పరిస్థితుల్లో లేము. అది సాధ్యం కూడా కాదు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పేదలకిచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలి. 

 

కూలీ పనులు చేసుకునేవాళ్లం... ఇల్లు ఎలా కట్టుకోవాలి

: హుస్సేన బి, కల్లూరు, గార్లదిన్నె మండలం

కూలికి పోతేనే కుండకాలే బతుకులు మావి. ఒకరోజు పని దొరకకపోయినా ఆ రోజు తిండి కోసం అప్పులు చేయా ల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పూట గడవడమే కష్టంగా బతుకుతున్నాం. పునాదుల కోసం ట్రాక్టర్‌ రాయికి రూ. 7 వేలు అడుగుతున్నారు. ఎద్దుల బండి ఇసుక రూ. 2వేలకుపైనే తీసుకుంటున్నారు. ఇక ఇనుము, సిమెంటు ధరలు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బతుకు తున్న మాలాంటి పేదలకు ఇళ్లు నిర్మించుకునే పరిస్థితి లేదనే విషయం ప్రభుత్వానికి తెలుసు. మా కష్టాలను గుర్తించి ప్రభుత్వమే జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. 


నెల జీతం తిండికి, ఇంటి బాడుగకే సరిపోవడం లేదు 

అమ్మజాన, గాంధీనగర్‌, కదిరి

నా భర్త బట్టలషాపులో పనిచేస్తాడు. నెలకు రూ. 7 వేలు జీతమిస్తారు. ఆ జీతంలోనే ఇంటి బాడుగ రూ. 4 వేలు చెల్లించాలి. మిగిలిన డబ్బులతోనే కుటుంబాన్ని నడపాలి. ఇద్దరు పిల్లలున్నారు. ఇక మా బాధలు ఎలా ఉంటాయో అందరికీ ఎరుకే. ప్రభుత్వం ఇల్లు కట్టిస్తామంటే ఎంతో పొంగిపోయాం. ఇప్పుడేమో మీరే ఇల్లు కట్టుకోవాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అధికారులు చెప్పినట్లు అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటే జీవితాంతం ఆ అప్పు తీర్చలేను. ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తే మా కష్టాలు తీరుతాయి.

Updated Date - 2021-07-27T06:48:05+05:30 IST