నీరు నిలిచే చోట నిర్మాణాలు ఎలా..?

ABN , First Publish Date - 2021-08-11T20:37:45+05:30 IST

నక్కపల్లి(విశాఖపట్నం) : లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచే చోట జగనన్న ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తుండడంతో లబ్ధిదారులు ముందుకు రావడం లేదు.

నీరు నిలిచే చోట నిర్మాణాలు ఎలా..?

‘జగనన్న’ ఇళ్ల నిర్మాణాలకు పలు గ్రామాల్లో ముందుకు రాని లబ్ధిదారులు 

లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వడమే కారణం

ప్రభుత్వం ఇచ్చే సొమ్ము పునాదులకే చాలదని ఆవేదన


నక్కపల్లి(విశాఖపట్నం) : లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచే చోట జగనన్న ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తుండడంతో లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. మండలంలోని అమలాపురం, రమణయ్యపేట, ముకుందరాజుపేట, గుల్లిపాడు, ఉపమాక గ్రామాల్లో జగనన్న కాలనీ ఇళ్లకు స్థలాలను ముంపు ప్రదేశంలో కేటాయించారు. దీంతో ఇప్పటి వరకు లబ్ధిదారులెవ్వరూ నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. భారీ వర్షాలు పడితే.. ఈ లే అవుట్లలో రోజుల తరబడి నీరు నిలుస్తోంది. రహదారి కంటే దాదాపు ఐదు అడుగుల దిగువన ఉన్న పంట పొలాలను లే అవుట్లుగా మార్చారు. దీంతో పునాదులు ఎత్తుగా కట్టుకుని, ఇళ్లు నిర్మించుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చే సొమ్ము చాలదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదు. 


అమలాపురం పంచాయతీలో నీటి ముంపులేని ప్రాంతంలో స్థలాలు అందుబాటులో ఉన్నా.. అక్కడ కాదని, అధికారులు ముంపునకు గురయ్యే ప్రాంతంలో లే అవుట్లు ఏర్పాటు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అమలాపురంలో అమలాపురం, పాటిమీద గ్రామాలకు చెందిన 61 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇక్కడ వర్షపు నీరు వెళ్లేందుకు కల్వర్టులు లేకపోవడంతో వర్షాలు పడినప్పుడు నీరు నిలుస్తోందని వాపోతున్నారు. ఈ పంచాయతీలోని మరో శివారు గ్రామమైన మూలపర్ర గ్రామస్తులకు ఇచ్చిన లే అవుట్‌ ఏపీఐఐసీ గుర్తించిన భూములకు సమీపంలో ఉండడం విశేషం. ఇక ఉపమాక గ్రామానికి సంబంధించి ఉపమాక- జానకయ్యపేట గ్రామాల రహదారికి ఆనుకుని ఉన్న పంట పొలాల్లో  ఉపమాక గ్రామానికి చెందిన సుమారు 129 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇక్కడ లే అవుట్లను మాత్రం గ్రావెల్‌తో కాస్త ఎత్తు చేశారు. 



Updated Date - 2021-08-11T20:37:45+05:30 IST