జగనన్న.. కాలనీళ్లు

ABN , First Publish Date - 2022-07-25T05:45:15+05:30 IST

‘రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలు నిర్మిస్తాం.. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం..’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేసిన ప్రకటనలు ఆచరణలో అభాసుపాలవుతున్నాయి.

జగనన్న.. కాలనీళ్లు
అనంతవరప్పాడు - 2లోని జగనన్న కాలనీలో నిలిచిన వర్షపు నీరు


 23 జీఎన్టీ 01, 02 

23 జీఎన్టీ 05, 06



అడుగు పెడితే అవస్థలే...

వర్షాలతో అధ్వానంగా మారిన జగనన్న కాలనీలు

సగం లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కరువు

చెరువులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు

కనీసం రోడ్డు సదుపాయం లేనివి ఎన్నో!

లెవలింగ్‌ సరి లేక లేఅవుట్లలో నిలిచిన నీరు

ఇసుక, కంకర, ఇనుము నీటిలోనే..

నిర్మాణాలు కష్ట సాధ్యమంటున్న లబ్ధిదారులు


 ‘రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలు నిర్మిస్తాం..  పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం..’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేసిన ప్రకటనలు ఆచరణలో అభాసుపాలవుతున్నాయి. కాలనీల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. జగనన్న పేరుతో నిర్మించే ఆ కాలనీల్లో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడం మాటేమోగానీ, అక్కడ కనీస మౌలిక సదుపాయాలను కూడా ఈ ప్రభుత్వం కల్పించలేక పోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సగానికి పైగా లేఅవుట్లలో ఈ రోజుకీ మౌలిక సదుపాయాల కల్పన పూర్తి కాలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే అంచనా వేయవచ్చు. వర్షాలకు నీట మునిగి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. కనీసం అడుగు వేసేందుకు కూడా వీలుపడడం లేదు. ఇసుక, కంకర, ఇనుము నీటిలోనే ఉండడంతో నిర్మాణాలు కష్ట సాధ్యమంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. 

  గుంటూరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): విభజిత గుంటూరు జిల్లా పరిధిలో 284 లే అవుట్లు ఉన్నాయి. వీటిలో లక్షా 17వేల 356 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. వీటిలో 116 లేఅవుట్లకు సంబంధించి లెవలింగ్‌(మెరక), రోడ్ల నిర్మాణం, నీటి సరఫరా, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు వంటి 117 పనులు మంజూరయ్యాయి. అందుకోసం రూ.37.25 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో 90 పనులు పంచాయతీరాజ్‌, 18 పనులు విద్యుత్‌ శాఖ పనులు ఉన్నాయి. మిగిలినవి ఇతర శాఖలకు సంబంధించిన పనులు. కాగా వీటిలో కొన్ని పనులు మాత్రమే ప్రారంభం కాగా, మెజారిటీ పనులు టెండర్‌ దశలో ఉన్నాయి. చాలా పనులకు ఇప్పటికీ టెండర్లు పూర్తికాలేదు. ఫలితంగా తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాలలోని లాం, పేరేచర్ల, పత్తిపాడు, కొర్నెపాడులతో సహా పలు ప్రాంతాల్లో లేఅవుట్లు వర్షపు నీరు, బురద, పిచ్చి మొక్కలతో నిండిపోయి ఆనవాలు కూడా లేకుండా పోయాయి. తెనాలి డివిజన్‌ పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో కేటాయించిన మెజారిటీ లే అవుట్లు తటాకాలను తలపిస్తున్నాయి. పేరేచర్ల, ఏటుకూరు, అనంతవరప్పాడు, కొర్నెపాడు, పొత్తూరులతో పాటు చాలా చోట్ల లేఅవుట్లకు వెళ్లేందుకు దారి, కాలనీల్లో అంతర్గత రోడ్లు, మంచి నీరు, విద్యుత్‌ స్తంబాల ఏర్పాటు వంటి పనులు ప్రారంభం కూడా కాలేదు. జిల్లాలో సగానికి పైగా లే అవుట్లలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. 


 జగనన్న కాలనీలు జలమయం

 పొన్నూరు, చేబ్రోలు మండలాల్లోని పలు గ్రామాల్లో పంట పొలాలను రైతులు నుంచి సేకరించి ప్రభుత్వం నిరుపేదల కోసం ఇళ్ల స్థలాలను ఏర్పాటు చేసింది. ఈ కాలనీలు లోతట్టు పాంత్రాల్లో ఉండడంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న కాలనీల్లోకి నీరు నిలిచింది. గత వేసవిలో ప్రభుత్వం మెరుక పేరుతో పెద్దఎత్తున పనులు నిర్వహించింది. ఇందుకోసం చేబ్రోలు మండలంలోని గ్రావెల్‌ క్వారీల నుంచి పెద్దఎత్తున గ్రావెల్‌ను తరలించారు. అయినప్పటికీ కాలనీలన్నీ జలమయం అవుతున్నాయి. మౌలిక వసతులు లేక రహదారులు నిర్మించకపోవడం  వలన ఇప్పటికే లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. 

  

వర్షం వస్తే నీట మునకే..

తాడికొండలోని గురుకుల పాఠశాల వెనుక ఇచ్చిన కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి గుంతలు పడి వర్షం నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలుతోంది. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో 153 ఇళ్లు మంజూరు చేశారు.  కాలనీలోని ప్రధాన రహదారితో పాటు, ఇళ్లు కూడా వర్షం నీటిలో మునిగాయి. పొన్నెకల్లులోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ వెనుక వైపు ఇచ్చిన స్థలాలకు మెరక లేకపోవటంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవాటానికి ముందుకు రావటం లేదు.  


  నల్లరేగడి భూముల్లో..

తెనాలి మండలంలోని సంగంజాగర్లమూడిలో గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో నల్లరేగడి భూముల్లో కాలనీ ఏర్పాటుకు స్థలాలు మంజూరు చేశారు. అయితే గ్రామ ప్రధాన రహదారి నుంచి దూరంగా ఉండటంతో పాటు నల్లరేగడి నేల, చుట్టూ పొలాలు ఉండటంతో లబ్ధిదారులు అక్కడ ఉండేందుకు ఆసక్తి కనబరచలేదు. అధికారులు వారికి అవగాహన కల్పించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇవ్వడంతో కొందరు లబ్ధిదారులు ముందుకు వచ్చారు. అయితే అక్కడకు చేరేందుకు సరైన రోడ్డుమార్గం వేయలేదు. గత నెలలో కలెక్టర్‌ పర్యటించి ఆ స్థలాల దుస్థితిని పరిశీలించి కనీస వసతులు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎర్రగ్రావెల్‌తో రోడ్డు మార్గం వేశారు దానిపై అక్కడక్కడ చిన్నపాటి కంకరరాళ్లు వేశారు. వర్షం కురవడంతో ఆ గ్రావెల్‌ కుంగిపోయి, రాళ్లు చెల్లాచెదురయ్యాయి. నీరునిలిచి బురదమయం అయింది. కాలనీలో స్థలాలు గ్రావెల్‌ రోడ్డు మార్గం కన్న పల్లంగా ఉన్నాయి.  పెదరావూరు లే అవుట్‌లలో అర్బన్‌, రూరల్‌కు కలిపి సుమారుగా ఏడువేల పట్టాలు అందించారు.  అక్కడ నిర్మాణ పనులు పూర్తి అయినవి పదుల సంఖ్యలో ఉండగా బేస్‌మెంట్‌ స్థాయిలో మరికొన్ని ఉన్నాయి. 


 సొగసు చూడతరమా!

మంగళగిరి నగరపాలక సంస్థలోని ఆత్మకూరు గ్రామ పరిధిలో సుమారు 9.64 ఎకరాల విస్తీర్ణంలో జగనన్న కాలనీని ఏర్పాటు చేశారు. పేదలకు 482 గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే కొంతమంది ఇళ్లు నిర్మించుకోగా పలుచోట్ల నిర్మాణాలు సాగుతున్నాయి. రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి వంటి సౌకర్యాలు లేకపోవడంతో కాలనీ వాసులు అల్లాడుతున్నారు. కొద్దిపాటి వర్షానికే ప్రధాన రహదారితోపాటు అంతర్గత రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మురుగు, వర్షపు నీరు పారుదల లేకపోవడంతో రోజుల తరబడి ఇళ్లు నీళ్లలోనే నానుతున్నాయి. కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు నిర్మాణ సామాగ్రిని తరలించుకోవడం కష్టంగా మారింది. అధికారులేమో ఇళ్ల నిర్మాణం పూర్తయితేనే మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెబుతున్నారు. రోడ్లు ఇలా వుంటే ఇళ్ల నిర్మాణం సాగెదెలాగంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.




Updated Date - 2022-07-25T05:45:15+05:30 IST