కాలనీలు.. కాగితాల్లోనే

ABN , First Publish Date - 2022-01-10T06:08:42+05:30 IST

కాలనీలు కావవి... ఊళ్లు అంటూ జగన్‌ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన జగనన్న కాలనీలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. ఏడాది క్రితం పట్టాలిచ్చినప్పటికీ 80 నుంచి 90 శాతం ఇళ్లకు పునాదులే పడలేదు.

కాలనీలు.. కాగితాల్లోనే
ప్రత్తిపాడు: కొత్తమల్లాయపాలెంలో పిచ్చి మొక్కలతో జగనన్న లేఅవుట్‌

పునాదుల్లోనే జగనన్న ఊళ్లు 

ఏడాదైనా పురోగతి నామమాత్రం

బేస్‌ మట్టాల కంటే దిగువనే ఇళ్లు 

లేఅవుట్లలో నత్తనడకన నిర్మాణాలు

70 శాతంపైగా లబ్ధిదారులు వెనుకడుగు

 

ఊళ్లన్నారు.. ఊరించారు. కానీ కాగితాల దశలోనే జగనన్న కాలనీలు  ఉన్నాయి. సకల సౌకర్యాలతో జగనన్న కాలనీలు నిండి ఉంటాయన్నారు. లబ్ధిదారులకు రూ.లక్షల ఆస్తి అన్నారు. అయితే ఏడాదైనా ఇంతవరకు జిల్లాలోని లేఅవుట్లలో ఇళ్ల పురోగతి చూస్తే శూన్యంగా ఉంది.  కాలనీల్లో పనులు ముందుకు సాగక పోవడంతో ఊళ్లు.. జగనన్న ఇళ్లు కాగితాలకే పరిమితమయ్యాయి. పదుల సంఖ్యలోని లేఅవుట్లలో వేలాది మంది లబ్ధిదారులకు ఏడాది క్రితం నివేశన పట్టాలు పంపిణీ చేశారు. వెంటనే ఇళ్లు కట్టుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేసినా అరకొరగానే గృహనిర్మాణాలు జరుగుతున్నాయి. ఆయా లేఅవుట్లలో మౌలిక సదుపాయలు లేక కొన్ని.. ఊళ్లకు దూరంగా మరికొన్ని ఉండటంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రావడంలేదు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో పలు రకాలుగా ఒత్తిడి తెచ్చినా సొంతంగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలంటే లబ్ధిదారులు కష్టమంటున్నారు. 


కాలనీల్లో సమస్యలు కోకొల్లలు

జగనన్న కాలనీల లేఅవుట్లలో నిర్మాణాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే  ఏడాది అయినా అవి సమకూరలేదు. చాలా లేఅవుట్లలో ఇంత వరకు రోడ్ల నిర్మాణమే చేపట్టలేదు. మేరక విషయాన్ని అధికారులు మరిచారు. లోతట్లు ప్రాంతాల్లో ఇచ్చిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవాలంటే మూడు అడుగులకుపైగానే మెరక చేయాల్సి ఉంది. చిన్నపాటి వర్షం కురిసినా చెరువులుగా మారుతున్నాయి. స్థలాల వద్దకు రోడ్డుపై నుంచి మెటీరియల్‌ తెచ్చుకునే పరిస్థితిలేదు. ఇక విద్యుత్‌ సౌకర్యం లేదు. నీటికి అవసరమైన ఏర్పాట్లే లేవు. కొన్ని దగ్గర్ల రహదారులు మాత్రం తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.


ఒత్తిళ్లు.. బెదిరింపులు

తొలుత జగనన్న కాలనీల లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఎక్కువ మంది ప్రభుత్వం కట్టిస్తామన్న ఆప్షన్‌కే మొగ్గుచూపారు. దీంతో ప్రభుత్వం వెనుకంజ వేసి లబ్ధిదారులే కట్టుకోవాలని అందుకు అవసరమైన మెటీరియల్‌ అందిస్తామని చెప్పింది. లబ్ధిదారుల చేత ఇందుకు ఒప్పించి అంగీకర పత్రం తీసుకునే బాధ్యతను అధికారులు సచివాలయ సిబ్బందికి, వలంటీర్లకు అప్పగించారు. పట్టా తీసుకున్న వెంటనే శంకుస్థాపన చేయడంతో పాటు ఇల్లు నిర్మించుకోవాలి లేదంటే రద్దు చేస్తామని వారు లబ్ధిదారులపై ఒత్తిడి, బెదిరింపులకు దిగారు. చేసేదేమీ లేక కొంతమంది శంకుస్థాపనలు మాత్రం చేశారు. పెరిగిన ధరలు.. ఎక్కడో ఊళ్లకు దూరంగా.. తక్కువ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు పలువురు ముందుకు రాలేదు. ఇక కొందరు ఇల్లు కట్టుకునే పనులు చేపట్టినా బిల్లుల చెల్లింపుల జాప్యంతో వారు నిర్మాణాలను వదిలేశారు. 

 

 (ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

కాలనీలు కావవి... ఊళ్లు అంటూ జగన్‌ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన జగనన్న కాలనీలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. ఏడాది క్రితం పట్టాలిచ్చినప్పటికీ 80 నుంచి 90 శాతం ఇళ్లకు పునాదులే పడలేదు. పట్టాలైతే ఇచ్చారుకానీ ఎక్కడా ఆ స్థాయిలో నిర్మాణాలు ముందుకు సాగడంలేదు. ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. గృహాలు మంజూరు చేసిన ప్రాంతాలు లోలెవల్‌లో ఉండటం, ఊళ్లకు దూరంగా ఉండటం, నీరు అందుబాటులో లేకపోవటం, నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి పోవడం, తదితర కారణాల వల్ల గృహాలు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదు. అంతేగాక సెంటు భూమిలో నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోయే పరిస్థితి లేదంటున్నారు.  ఇక ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలని ముందుకు వస్తున్నా లేఅవుట్లలో మౌలిక వసతుల ఏర్పాటులో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.

 - తెనాలిలో జగనన్న కాలనీలకు ఇసుక కొరత వేధిస్తోంది. పట్టణంలో 19,150, మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కొల్లిపర మండలంలో 1961 ఇళ్లకు 400 ఇళ్లకు, తెనాలి మండలంలో సుమారు 2 వేలకు పదుల సంఖ్యలో మాత్రమే పునాదులు పడ్డాయి. 

వేమూరు నియోజకవర్గంలోని 89 గ్రామాల్లో 11003 మందికి పట్టాలు ఇవ్వగా 7333 మంది మాత్రమే శంకుస్థాపనలు చేసుకున్నారు. వీరిలో కేవలం157 మంది నిర్మాణాలు పూర్తి చేశారు. 

- సత్తెనపల్లి పట్టణవాసులకు 3697 గృహాలు మంజూరుకాగా 200లోపు గృహాలు మాత్రమే నిర్మాణాలు జరుగుతున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలకు 1273 గృహాలు మంజూరుకాగా 343పైగా మాత్రమే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక నకరికల్లు, రాజుపాలెం, ముప్పాళ్ల  మండలాల్లో జగనన్న కాలనీల నిర్మాణప్రక్రియ ప్రారంభమే కాలేదు.

- నరసరావుపేట మునిసిపాల్టీ పరిధిలో మూడు చోట్ల జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి 6107 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీటిలో సుమారు 500 మంది మాత్రమే నిర్మాణం చేపట్టారు. వీటిలో 10 గృహాల వరకు నిర్మాణం పూర్తయినట్టు అధికారులు తెలిపారు. నరసరావుపేట, రొంపిచర్ల మండలాలలో 9400   పట్టాలు పంపిణీ చేయగా క్క నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు.

- గురజాల నియోజకవర్గంలో 14,812 మందికి గత ఏడాది జగనన్న కాలనీ పేరుతో ఇళ్లపట్టాల పంపిణీ చేశారు. వీటిలో 512 లోపే నిర్మాణాలు చేపట్టగా వాటిల్లో కొన్ని బేస్‌మెంట్‌ లెవల్‌, పునాదుల దశలోనే ఉన్నాయి. గుత్తికొండ, జానపాడు,  జూలకల్లు, తురకపాలెం, మోర్జంపాడు, పొందుగుల, పిడుగురాళ్లతోపాటు కాలనీల్లో ఏర్పాటు చేసిన ప్రతి లేఅవుట్‌ ఆయా గ్రామాలకు దూరంగా ఉన్నాయి.

- తాడికొండ మండలంలో 15 గ్రామాల్లో 1859 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా 315 నిర్మాణాలు  బేస్‌మట్టం దాటాయి. 1162 మంది శంకుస్థాపనలు చేసుకున్నారు కాని పనులు ప్రారంభించలేదు.

- చిలకలూరిపేట పట్టణంలో మొదటి దశలో 4,565 మందికి పట్టాలు ఇవ్వగా వారిలో సుమారు వెయ్యి మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలకు అంగీకరించరే కాని 200 మంది మాత్రమే  పనులు ప్రారంభించారు. బిల్లుల చెల్లింపుల జాప్యంతో వారు కూడా నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. యడ్లపాడు మండలంలో 1326 మందికి 200 మంది మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారు.   

- దుగ్గిరాల మండలంలో 2680 ఇళ్లు మంజూరు కాగా 495 ఇళ్లు నిర్మాణం ప్రారంభించారు.   శృంగారపురం, పెదకొండూరు, గొడవర్రు, ఈమని, చుక్కపల్లివారిపాలెం కొందరు పనులు ప్రారంభించారు.  నాలుగు కిలోమీటర్ల దూరంలోని పొలాల్లో కేటాయించడంతో చిలువూరు గ్రామస్తులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు. 

 - క్రోసూరు మండలంలో 2,342 మందికి 1870 మందికి గృహాలు మంజూరుకాగా 322 మంది శంకు స్థాపనలు చేసుకున్నారు. బెల్లంకొండ మండలంలో 425 మందికి స్థలాలు ఇచ్చినా నిర్మాణ పనులు జరగలేదు. అమరావతి మండలంలో 2,600 మందికి  1842 గృహాలు మంజూరుకాగా 250 గృహాలకు మాత్రమే పనులు జరుగుతున్నాయి. అచ్చంపేట మండలంలో 3,826 మందికి 2,311 గృహాలు మంజూరయ్యాయి. వీటిలో 1832 గృహాల పనులు జరుగుతున్నాయి. పెదకూరపాడు మండలంలో  1739 గృహాలకు  274 మాత్రమే పనులు జరుగుతున్నాయి.  

- పొన్నూరులో  4,467 మందికి 85 మంది, చేబ్రోలు మండలంలో 1560 మందికి 450 మంది మాత్రమే పనులు చేపట్టారు.  పెదకాకాని మండలం 12 లేఅవుట్లలో పట్టాలు పంపిణీ చేయగా నంబూరులో మాత్రమే ఇళ్ల నిర్మాణలు చేపట్టారు.    

- మాచర్ల పట్టణ, మండల పరిధిలో 51 లేఅవుట్లలో 9 వేల మందికి పట్టాలు పంపిణీ  చేశారు. అయితే మౌలిక వసతులు లేక పోవడంతో పనులు ప్రారంభించలేదు. విజయపూరిసౌత్‌లో 400 మందికి, వెల్దుర్తి మండలంలో 2 వేల మందికి, కారంపూడి మండలంలో 2050 మందికి, రెంటచింతల మండలంలో 2257 మందికి,   పట్టణంలో 881 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు కాని వారు నిర్మాణాలకు ముందుకురాలేదు. 

- బాపట్ల పట్టణంలో 3,362కి 929 గృహాలకు గ్రౌండింగ్‌ చేయగా 200 మాత్రమే శ్లాబ్‌ వేశారు.మండలాల్లోని లేఅవుట్లకు సంబంధించి గృహాలు ఇంకా మంజూరు కాలేదు. 

- తుళ్లూరు మండలంలో పెదపరిమిలో 280 మందికి, హరిశ్చంద్రాపురంలో వంద మంది స్థలాలు కేటాయించినా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. 

- రేపల్లె పట్టణంలో 3008కిగాను 400 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. రేపల్లె మండలం, నగరం, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాలలో 6 వేల మందికి స్థలాలు మంజూరు చేశారు. అయితే ఇవి ఊరి బయట వసతులు ఏమీ లేని ప్రాంతాల్లో ఉండటంతో లబ్ధిదారులు నిర్మాణాలకు ఆసక్తి చూపడంలేదు.  



గుదిబండగా లేఅవుట్ల అభివృద్ధి 

జగనన్న కాలనీల లేఅవుట్ల అభివృద్ధికి అవసరమైన  నిధులు అంచనాలు చూస్తే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉన్న రాష్ట్రాన్ని మరింత పాతాళంలోకి నెట్టేసేలా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లకు సంబంధించి శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ప్రజారోగ్య శాఖలు రూపొందించాయి. ఆయా శాఖలు నివేదించిన గణాంకాలు ప్రకారం దాదాపు రూ.1,772 కోట్లు అవసరం. జిల్లా వ్యాప్తంగా 538 లేఅవుట్లను వేసింది. అయితే వాటిల్లో కేవలం నామమాత్రంగానే లెవలింగ్‌ పనులు చేసి వదిలేశారు. జిల్లాలో ఉన్న ఐదు భారీ లేఅవుట్లలో మాత్రం ప్రభుత్వమే ఇళ్లు నిర్మిస్తోన్నది. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలు జరిగాక అక్కడ ప్రజలు నివసించాలంటే కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, కాలువలు, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ, తాగునీటి పైపులైన్లు, వీధిలైట్లు వంటివి ఏర్పాటు చేయాలి.  అంతర్గత రోడ్లు, ఫుట్‌పాత్‌లు, కల్వర్టులు, లింకు రోడ్లకు రూ.92.9.31 కోట్లు,  తాగునీటి సరఫరాకు రూ.458.50 కోట్లు, డ్రెయిన్ల నిర్మాణానికి రూ.178.66 కోట్లు, సీవరేజ్‌ పనులకు రూ. 150.67 కోట్లు అవసరమని అంచనాలు సిద్ధం చేశారు.  గ్రామీణ ప్రాంతాల్లో తాత్కాలిక పనుల కోసం రూ.41.91 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో రూ. 13.90 కోట్లు అవసరమని ఆర్‌డబ్ల్యూ, పబ్లిక్‌హెల్త్‌ శాఖలు నివేదించాయి. ఇంత ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేపట్టినా గ్రామాలకు దూరంగా ఉన్న జగనన్న కాలనీల లేఅవుట్లకు ప్రజలు వెళ్లి నివసిస్తారా అంటే ఖచ్చితంగా ఔను అని చెప్పలేని పరిస్థితి.  


నిర్మాణాలు జూన్‌కి అసాధ్యమే

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు అనే నినాదంతో పీఎంఏవై వైఎస్‌ఆర్‌ అర్బన్‌ బీఎల్‌సీ స్కీమ్‌ పేరుతో ఎంతో ఆర్భాటంగా వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన పక్కా ఇళ్ల నిర్మాణాలు నత్తతో పోటీపడుతున్నాయి. గత ఏడాది ముక్కోటి ఏకాదశి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి నిర్మాణాలకు శ్రీకారం చుట్టగా సుమారు ఆరు నెలల క్రితం తొలి దశ పనులు ప్రారంభించారు. ఈ ఏడాది జూన్‌ నాటికి 100 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశలో జిల్లా వ్యాప్తంగా లక్షా 22 వేల 427 గృహాలను మంజూరు చేశారు. వీటిల్లో పట్టణ ప్రాంతాల్లో 73 లేఅవుట్లలో 73,004 ఇళ్లు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 513 లేఅవుట్లలో 49,423 ఇళ్లు నిర్మించాల్సి  ఉన్నది.  అయితే ఇప్పటివరకు జరిగిన పురోగతి చూస్తే తొలి దశ ఇళ్లు పూర్తి చేయడానికే ఎన్ని సంవత్సరాలు పడుతుందోనన్న చర్చ జరుగుతున్నది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఇక్కడ ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉన్నప్పటికీ ఇళ్ల నిర్మాణాల్లో ఆశించిన పురోగతి సాధించలేకపోవడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. 71 శాతం మందితో ఇప్పటివరకు పనులు ప్రారంభింప చేశారు. అసలు 34,406 మంది ఇప్పటివరకు బొచ్చ మట్టి కూడా వేయలేదు. బేస్‌మెంట్‌ కంటే దిగువున 75,247 ఇళ్లు ఉన్నాయి. బేస్‌మెంట్‌ స్థాయికి కేవలం 5,953 మాత్రమే ఉన్నాయి. రూఫ్‌ స్థాయికి 1,022 ఇళ్ల నిర్మాణాలు వచ్చాయి. 2,363 ఇళ్ల కు మాత్రం శ్లాబు పూర్తి అయింది. ఇప్పటివరకు కేవలం 369 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభించారు. దీనిని పరిగణనలోకి తీసుకొంటే 0.3 శాతం పురోగతిని కూడా ఇప్పటివరకు సాధించలేకపోయారు.


 

Updated Date - 2022-01-10T06:08:42+05:30 IST