జగనన్న కాలనీకి ముంపు ముప్పు!

ABN , First Publish Date - 2022-05-14T06:56:10+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో గల ఎనిమిది నియోజక వర్గాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు సబ్బవరం మండలం పైడివాడఅగ్రహారంలో వేసిన భారీ లేఅవుట్‌ (జగనన్న ఇళ్ల కాలనీ)కు ముంపు ముప్పు పొంచి ఉంది.

జగనన్న కాలనీకి ముంపు ముప్పు!
రైతులకు కేటాయించిన పరిహారం ప్లాట్లులో వరద మేటలు

సబ్బవరం మండలం పైడివాడఅగ్రహారంలో వేసిన

భారీ లేఅవుట్‌లోకి వరద నీరు

కోతకు గురైన రహదారులు

ఒక మోస్తరు వర్షానికే ఇలాగైతే...

భారీవర్షాలు పడితే ఏమవుతుందోనని

లబ్ధిదారులు, రైతుల్లో ఆందోళన

చుట్టుపక్కల గల కొండల పైనుంచి వచ్చే నీరు ప్రవహించే గెడ్డలను పూడ్చివేయడం వల్లే ఈ పరిస్థితి

వాటిని యథాప్రకారం ఉంచాలని డిమాండ్‌


సబ్బవరం, మే 13:

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో గల ఎనిమిది నియోజక వర్గాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు సబ్బవరం మండలం పైడివాడఅగ్రహారంలో వేసిన భారీ లేఅవుట్‌ (జగనన్న ఇళ్ల కాలనీ)కు ముంపు ముప్పు పొంచి ఉంది. రెండు రోజుల క్రితం తీవ్ర తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షానికి చుట్టుపక్కల కొండల పైనుంచి వచ్చిన నీరు లేఅవుట్‌ను ముంచెత్తింది. ఎక్కడికక్కడ మట్టి మేటలు వేసింది. ఇంకా రహదారులు కోతకు గురయ్యాయి. ఒక మోస్తరు వర్షానికి ఇలా అయితే...రేపు భారీ వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన ఇప్పుడు లబ్ధిదారులు, రైతుల్లో (భూములు ఇచ్చి ఆ లేఅవుట్‌లో ప్లాట్లు తీసుకోబోయేవారు) వ్యక్తమవుతోంది. కొండల పైనుంచి వచ్చే నీరు ప్రవహించే గెడ్డలను లేఅవుట్‌ కోసం అధికారులు పూడ్చివేయడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. వివరాల్లోకి వెళితే...

సబ్బవరం మండలం పైడివాడ, పైడివాడ అగ్రహారం, ఎరుకునాయుడుపాలెం గ్రామాల పరిధిలో అర్బన్‌ హౌసింగ్‌ స్కీమ్‌ కింద పట్టణ పేదలకు సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 320.83 ఎకరాలు సమీకరించారు. ఇందులో ప్రభుత్వ భూములతో పాటు జిరాయితీ, అసైన్డ్‌ కూడా ఉన్నాయి. ప్లాట్లు వేసేందుకు అనువుగా లేని 1.52 ఎకరాలను వదిలేసి, లబ్ధిదారులకు సెంటు చొప్పున ఇచ్చేందుకు 102.38 ఎకరాలు, యుటిలిటీ ఏరియా కింద 7.13 ఎకరాలు, రహదారులకు 98.66 ఎకరాలు, ఓపెన్‌ స్పేస్‌ కింద 23.3 ఎకరాలు, రైతులకు పరిహారం కింద ఇవ్వాల్సిన ప్లాట్ల కోసం 87.84 ఎకరాలు కేటాయించి...ఆ మేరకు లేఅవుట్‌ సిద్ధం చేశారు.   

వరద నీరు పోయే దారేది..

లేఅవుట్‌ వేసేందుకు ఎంపిక చేసిన ప్రాంతంలో రెండు, మూడు గెడ్డలు ఉండేవి. చుట్టూ గల కొండల పైనుంచి వచ్చే నీరు ఆ గెడ్డల ద్వారా ప్రవహిస్తుండేది. కానీ లేఅవుట్‌ వేసే సమయంలో వాటిని వీఎంఆర్‌డీఏ అధికారులు మూడో కంటికి తెలియకుండా పూడ్చేశారు. ఇప్పుడు వర్షాలు కురుస్తుండడంతో అధికారుల నిర్వాకం బయటపడింది. ఇటీవల కురిసిన వర్షాలకు కొండల పై నుంచి వచ్చిన నీరు లేఅవుట్‌ మీదుగా ప్రవహించడంతో రహదారులు, ప్లాట్లు కోతకు గురయ్యాయి. ఎక్కడికక్కడ మట్టి మేట వేసింది. ఒక మాదిరి వర్షాలకే పరిస్థితి ఇలా ఉంటే...రేపు భారీవర్షాలు కురిస్తే వరద నీరు ఇళ్లలోకి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.

పూర్వ స్థితి ఎలా ఉండేదంటే..

పైడివాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 73లో 115.11 ఎకరాల్లో కొండ ఉంది. దీనికి అనుకొని సర్వే నంబర్‌ 75లో 51.47 ఎకరాల (పోరంబోకు అడవి)ను ఇళ్ల స్థలాల కోసం తీసుకున్నారు. అలాగే సర్వే నంబర్‌ 164లో 76.9 ఎకరాల్లో కొండ ఉంది. దీనికి అనుకొని గల సర్వే నంబర్‌ 167లో 160.4 ఎకరాలు (అడవి) ఉంది. దీనిని ఇళ్ల స్థలాలకు కేటాయించారు. సర్వే నంబర్లు 115.11, 164లలో గల రెండు కొండల నుంచి వచ్చే వరద నీరు 75, 167 సర్వే నంబర్లలో గల భూముల్లో నుంచి ప్రవహిస్తుంటుంది. ఇప్పుడు ఆ భూములను లేఅవుట్‌ కోసం సేకరించి చదును చేసి ప్లాట్లుగా విభజించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు గతంలో మాదిరిగానే వరద నీరు లేఅవుట్‌ మీదుగా ప్రవహించింది. అదేవిధంగా పైడివాడఅగ్రహారం సర్వే నంబరు 128లో 54.2 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించారు. ఇందులో నుంచి గెడ్డ ప్రవహించేది. ఇప్పుడు దానిని చదును చేసి రైతులకు పరిహారంగా ఇచ్చేందుకు ప్లాట్లుగా అభివృద్ధి చేశారు. ఇటీవల వర్షాలకు ఆ ప్లాట్లలో మట్టి మేట వేసింది. రోడ్లు కొట్టుకుపోయాయి. వాస్తవానికి సర్వే నంబర్‌ 128లో ఎప్పటి నుంచో గెడ్డ ఉంది. ఎరుకునాయుడుపాలెం, పైడివాడ కొండల నుంచి వరద నీరు ఈ గెడ్డలోకి వస్తుంది. ఇంకా పైడివాడఅగ్రహారం నర్సయ్య ట్యాంక్‌, తుమ్మల ట్యాంక్‌, దమ్ము చెరువు నుంచి మిగులు నీరు కూడా ఈ గెడ్డకు చేరుతుంది. అక్కడ నుంచి గొల్లలపాలెం, నంగినారపాడు గ్రామాల పరిధిలో గల రాయపురాజు చెరువుకు వెళుతుంది. అధికారులు గెడ్డలు పూడ్చివేయడంతో లేఅవుట్‌ ముంపునకు గురయ్యే ప్రమాదం వుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, వీఎంఆర్‌డీఏ అధికారులు ఒకసారి వాస్తవ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. వరద నీరు యథావిధిగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని, జరిగిన పొరపాట్లు సరిదిద్ది లబ్ధిదారులకు, రైతులకు మరోచోట ప్లాట్లు ఇవ్వాలని కోరుతున్నారు.


గెడ్డవాగులు యథావిధిగా ఉంచాలి

అక్కిరెడ్డి దుర్గినాయుడు, రైతు, పైడివాడ అగ్రహారం


పైడివాడఅగ్రహారం రెవెన్యూ పరిధిలో ఉన్న గెడ్డవాగులను యథాప్రకారం కొనసాగించిన తరువాతే రైతులకు ప్లాట్లు కేటాయించాలి. వీఎంఆర్‌డీఏ అధికారులు సరైన ప్రణాళిక లేకుండా గెడ్డవాగులు పూడ్చేసి ప్లాట్లు ఇచ్చిన తరువాత వరదలకు కొట్టుకుపోతే మా పరిస్థితి ఏంటి. వరద నీరు పోయేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. వాటర్‌ బాడీస్‌ నాశనం చేయకుండా చర్యలు తీసుకోవాలి.  





Read more