అసలు తక్కువ.. ఆర్భాటమెక్కువ

ABN , First Publish Date - 2021-08-17T06:29:26+05:30 IST

వైఎస్‌ఆర్‌ - జగనన్న కాలనీల్లో..

అసలు తక్కువ.. ఆర్భాటమెక్కువ
కంకిపాడు మండలం వణుకూరు లే అవుట్‌ లో నిర్మించిన ఆర్చి

వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ప్రచారార్భాటానికే ప్రాధాన్యం

మౌలిక సదుపాయాలను మరచి భారీ ఆర్చిల నిర్మాణం

కాలనీల్లో రోడ్లు, డ్రెయిన్లు లేవు.. ఇళ్ల నిర్మాణం ఐదు శాతమే 


ఆంధ్రజ్యోతి, విజయవాడ: వైఎస్‌ఆర్‌ - జగనన్న కాలనీల్లో అసలు కంటే ఆర్భాటమెక్కువగా కనిపిస్తోంది. కాలనీల లే అవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన అధికారులు అది మరిచి, ఆర్భాటంగా ఆర్చిలను నిర్మిస్తున్నారు. కాలనీల్లో రోడ్లు, డ్రెయిన్లు, పైప్‌లైన్లు, విద్యుత్‌ లైన్లు లేవు. ఇళ్ల నిర్మాణాలు ఐదు శాతానికి మించి మొదలు కాలేదు. కాలనీల చుట్టూ ప్రహరీల్లేవు. ప్రవేశ మార్గంలో మాత్రం అప్పు చేసి మరీ అట్టహాసంగా ఆర్చిలను నిర్మిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా జగనన్న కాలనీల్లో జరుగుతున్న పనులేమైనా ఉన్నాయా అంటే అది ఆర్చిల నిర్మాణం మాత్రమే.


వైఎస్‌ఆర్‌ - జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణం ఫార్సుగా మారుతోంది. లే అవుట్లలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలకంటే ప్రచారార్భాటపు పనులే ఎక్కువగా జరుగుతున్నాయి. కాలనీల్లో మౌలిక సదుపాయాల పనులను మరచి,  వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గృహ సముదాయం పేరుతో ప్రవేశ మార్గంలో ఆర్చిల నిర్మాణ పనులు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా పలు లే అవుట్లలో ఆర్చిల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. శంకుస్థాపనలు చేసి నెల రోజులు దాటినా, లబ్ధిదారులకు ఇవ్వవలసిన సిమెంట్‌, ముందుగా చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవటంతో 95 శాతం ఇళ్ల నిర్మాణ పనులే ప్రారంభం కాలేదు. ఇళ్ల నిర్మాణం కంటే ముందుగా చేపట్టవలసిన మౌలిక సదుపాయాలపైనా దృష్టి సారించలేదు. లే అవుట్లకు తీసుకున్నవి వ్యవసాయ భూములు కావటంతో వర్షం పడితే చెరువులను తలపిస్తున్నాయి. 90 శాతం లే అవుట్లలో మెరక పనులు  చేపట్టలేదు. మెరక చేశాక రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్లు, విద్యుత్‌ లైన్లు, వీధిలైట్లను ఏర్పాటు చేయాలి. ఇవేమీ జరగకుండానే ఆర్చిల నిర్మాణ పనులు చేపట్టడం విడ్డూరంగా ఉంది. ఆర్చిల నిర్మాణ పనులు చేపట్టడం ద్వారా అధికారులు ప్రభుత్వ మెప్పు పొందాలని చూస్తున్నారే తప్ప.. ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టుకునేందుకు వీలుగా కాలనీల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం లేదు.


నిధుల కోసం నిరీక్షణ  

జగనన్న కాలనీల్లో తలపెట్టాల్సిన మౌలిక సదుపాయాల పట్ల అధికారుల్లో అంతులేని నిర్లిప్తత నెలకొంది. రోడ్లు, డ్రెయిన్లు, పైపులైన్లు, విద్యుత్‌ తదితర పనులకు అయ్యే వ్యయ అంచనాలతో ఆయా శాఖలు డీపీఆర్‌లు తయారు చేశాయి. ఈ డీపీఆర్‌ల ప్రకారం ప్రభుత్వం నిధులను విడుదల చేస్తే పనులను ప్రారంభించవచ్చునని సంబంధిత శాఖలు ఎదురుచూస్తున్నాయి. నెలలు గడుస్తున్నా నిధులు విడుదల కావడం లేదు. నిధులు లేకుండా ప్రభుత్వ శాఖలు పనులు చేపట్టే పరిస్థితి లేదు. పైగా ఇటీవల కాలంలో నిధులు మంజూరు కాని పనులకు టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. జగనన్న కాలనీల్లో ఇప్పటివరకు జరిగిన పని ఒక్కటే.అది ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ బోర్లను వేయించడం. దానితోపాటే పైపులైన్ల పనులు ప్రారంభించాల్సి ఉన్నా, మొదలు లేదు. పైపులైన్ల పనులు చేపడితేనే ఇళ్లనిర్మాణాలకు అవసరమైన నీరు అందుతుంది. 


ఇళ్లకు డబ్బులెప్పుడు ఇస్తారు? 

కాలనీల్లో ఇళ్ల పనులను ప్రారంభించటానికి అవసరమైన మెటీరియల్‌ను, డబ్బులను లబ్ధిదారులకు ఇప్పటివరకు అందించలేదు. శంకుస్థాపనలు చేసి నెల దాటింది. మెటీరియల్‌ కాంపోనెంట్‌గా ఇవ్వాల్సిన 40 సిమెంట్‌ బస్తాలు, నగదు రూపంలో చెల్లించాల్సిన రూ.40 వేలను చెల్లించలేదు. కరోనా అనంతరం లబ్ధిదారులెందరో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇంటిని నిర్మించుకునేందుకు సొంత పెట్టుబడి పెట్టుకోలేక ప్రభుత్వమిచ్చే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో లబ్ధిదారులకు సహకరించాల్సిందిపోయి.. హడావిడిగా ఆర్చిలను నిర్మించాల్సిన అవసరమేమిటో పాలకులే ఆలోచించాలి. 


రాజకీయ ఒత్తిళ్లతోనే ఆర్చిల నిర్మాణం 

రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కాలనీల ప్రవేశ మార్గంలో ముందుగా ఆర్చిల నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ మెగా కార్యక్రమంగా ప్రచారం చేసుకోవటానికి ఆర్భాటంగా ఆర్చిల నిర్మాణ పనులు చేపట్టేలా అధికారులపై మండల స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. దీంతో రెవెన్యూ, పంచాయతీరాజ్‌, హౌసింగ్‌ శాఖల అధికారులు ఆర్చి పనులకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ఆర్చి పనులకు కూడా డబ్బులు లేవు. స్థానికంగా అప్పులు చేసి వీటిని నిర్మిస్తున్నారు. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణ పనులే ఐదు శాతానికి మించి మొదలుకాలేదు. మౌలిక సదుపాయాలు అంతకన్నా లేవు. 


ప్రహరీ లేదు.. ఆర్చి అవసరమా?  

కాలనీల లే అవుట్లకు రక్షణగా ప్రహరీ నిర్మించకుండా, ప్రవేశ మార్గంలో ముఖ్యమంత్రి పేరుతో ఆర్చిలను నిర్మించడంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయించి, ప్రహరీ కూడా నిర్మించిన తర్వాత ఆర్చిని నిర్మిస్తేనే కాలనీలకు ఒక రూపు వస్తుంది. రక్షణా ఉంటుంది.   

Updated Date - 2021-08-17T06:29:26+05:30 IST