అమరావతి: ఏపీలో త్వరలో నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీవిమరణ చేయనున్నారు. వైసీపీ సంఖ్యా బలం చూస్తే నాలుగు సీట్లు వైసీపీకే దక్కునున్నాయి. దీంతో అధికార పార్టీలో రాజ్యసభ అభ్యర్థులపై చర్చ ప్రారంభమైంది. ఈ పదవులు ఎవరికి దక్కతాయనే విషయంపై పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఖారారైన రెండు సీట్లలో ఒకటి ఆదాని కుటుంబానికి దక్కనుంది. మరో ఇద్దరు అభ్యర్థులపై ఉత్కంఠ నెలకొంది. మరో పది రోజుల్లో ఏపీ కేబినెట్ పనర్వ్యవస్థీకరణ జరుగనుంది. ఎవరెవరికీ కేబినెట్లో స్థానం దక్కుతుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యులపై వైసీపీలో సమాలోచనలు సాగుతున్నాయి. జూన్‌లో రాజ్యసభ నుంచి నలుగురు సభ్యులు రిటైర్డ్ అవుతున్నారు.
రాజ్యసభ పదవీవిరమణ చేయనున్నవారిలో సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనాచౌదరి, విజయసాయిరెడ్డి ఉన్నారు. సుజనా, టీజీ వెంకటేష్‌తో పాటు బీజేపీ ప్రతిపాదనతో సురేష్ ప్రభుకు టీడీపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇప్పుడు వీరి ముగ్గురితో పాటు విజయసాయి పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. అసెంబ్లీలో అధికార పార్టీకి ప్రస్తుత బలాబలగాలు చూస్తే నాలుగు రాజ్యసభ స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. ఇందులో విజయసాయి రాజ్యసభ సభ్యత్వాన్ని మరోసారి పునరుద్దరిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. సీబీఐ, ఈడీ కేసుల వ్యవహారంతో పాటు ఢిల్లీలో పార్టీ తరపున అన్ని వ్యవహారాలు చక్కదిద్దే సమర్థత విజయసాయికే ఉందని జగన్ నమ్ముతున్నారు. అయితే తనకు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చాలాకాలం నుంచి పట్టుపడుతున్నారు. విజయసాయికి మరోసారి అవకాశమిస్తే.. సుబ్బారెడ్డికి ఈ సారి కూడా లేనట్టేనని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
ఆదాని కుటుంబానికి టికెట్ ఇచ్చే అంశంపై వైసీపీకి బీజేపీ నుంచి ప్రతిపాదన వచ్చిందని చెబుతున్నారు. ఇటీవల ఆదాని సోదరులు జగన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత గంగవరం పోర్టుతో పాటు భారత సౌర విద్యుత్ సంస్థ (సెకి)తో ఒప్పందాలు ఖరారయ్యాయి. అదే సమయంలో రాజ్యసభ టికెట్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయిందని చెబుతున్నారు. మిగిలిన రెండు స్థానాల విషయంలో వైసీపీలో ఉత్కంఠ నెలకొంది. ముస్లిం సామాజివర్గం నుంచి నటుడు అలీకి టికెట్ దక్కినట్టేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ముస్లింలకు టికెట్ ఇవ్వకుంటే ఎస్సీ, బీసీలకు రెండు టికెట్లు ఇస్తారని చెబుతున్నారు. గతంలో జగన్ హామీ ఇవ్వడంతో నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావు పేరు దాదాపుగా ఖారారవుతుందని అంటున్నారు. ఇక ఎస్సీ కోటాలో ఎవరికి అదృష్టం దక్కుతుందనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి