Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్‌ సీఎం పదవిలో ఉండటం నైతికమా?: వర్ల రామయ్య

విజయవాడ: తనపై ఉన్న అవినీతి కేసులపై న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతుండగా.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండటం నైతికమేనా? ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి సాక్షులు భయపడరా? అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. జగన్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తనపై జరుగుతున్న సీబీఐ విచారణకు సహకరించకపోతే.. ఆయనకు నైతిక విలువల పట్ల నమ్మకం లేదనే భావించాలన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగ పెట్టుబడులతోనే జగన్‌ పత్రిక లాభసాటిగా నడుస్తోందన్నారు. తన తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని జగన్మోహన్‌రెడ్డి రూ.43 వేల కోట్లు అన్యాక్రాంతం చేశారన్న అభియోగాలపై సీబీఐ 11 చార్జిషీట్లు వేసిందని తెలిపారు.


జగన్‌సహా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులపై నిన్న హైదరాబాదు సీబీఐ కోర్టులో సీబీఐ, నిందితుల తరపున వాదనలు చాలా స్పష్టంగా పత్రికల్లో వచ్చిందని తెలిపారు. నిమ్మకగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్‌ కంపెనీకి జగన్‌ తండ్రి రాజశేఖర్‌రెడ్డి 12వేల ఎకరాలు దఖలు పరిచారని తెలిపారు. ఆ భూమి ఖరీదు రూ.17 వేల కోట్లు ఉంటుందని చెప్పారు. దానికి ప్రతిఫలంగా వాన్‌పిక్‌ సంస్థ నుంచి జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో రూ.854 కోట్లు పెట్టుబడి పెట్టారని తెలిపారు. అందుకే నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఎక్కడో సెర్బియా ఎయిర్‌ పోర్టులో ఆపితే, ఇక్కడున్న క్యాబినెట్‌ మొత్తం వణికిపోయిందని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.


Advertisement
Advertisement