సచివాలయాల సిబ్బందికి జగన్‌ ఝలక్‌!

ABN , First Publish Date - 2022-06-27T07:19:48+05:30 IST

సచివాలయాల సిబ్బందికి జగన్‌ ఝలక్‌!

సచివాలయాల సిబ్బందికి జగన్‌ ఝలక్‌!

వేతనాల నిర్ధారణలో అన్యాయం

పదోన్నతులకు అవకాశమే లేదు

జీవితమంతా రికార్డ్‌ అసిస్టెంట్‌ కేడర్‌లోనే

ఇది అటెండరు కంటే కాస్త ఎక్కువ స్థాయి

పాతిక వేలకు మించి జీతం రాదు

అర్హత డిగ్రీ.. ఇచ్చింది ఇంటర్‌ స్థాయి కేడర్‌

ప్రజలకు జవాబుదారీ కార్యదర్శులే

పథకాల దరఖాస్తులో మాత్రమే వారి పాత్ర

మంజూరు చేయకుంటే ఎవరిని అడగాలి?

పై స్థాయిలో వారి గోడు వినేవారే లేరు

ఈ క్రమంలోనే అక్కడక్కడా దాడులు!


ప్రభుత్వం ఆలస్యంగానైనా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించినందుకు సంతోషించాలా..? లేక భవిష్యత్‌లో పదోన్నతులేమీ లేకుండా.. ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగాల్లో చిక్కుకున్నందుకు చింతించాలా..? అని రాష్ట్రంలో లక్ష మందికి పైగా సచివాలయాల ఉద్యోగులు తీవ్రంగా మథనపడుతున్నారు. గత 32 నెలల్లో అనుభవించిన నరక యాతనకు తోడు జగన్‌ ప్రభుత్వం తాజాగా తమ వేతనాలను రూ.25 వేలుగా మాత్రమే నిర్ధారించడంతో బిత్తరపోయారు. అసలీ ఉద్యోగాల్లోకి ఎందుకొచ్చామా అని విచారిస్తున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ ఉద్యోగం.. సొంత గ్రామాల్లో తల్లిదండ్రులు, కుటుంబాలతో జీవితాంతం హాయిగా గడపొచ్చన్న ఆశతో రూ.లక్షల వేతనాలతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శులకు రాత పరీక్షలు రాసి ఉద్యోగాలు దక్కించుకున్నారు. ఇంజనీరింగ్‌, అంతకంటే ఉన్నతమైన అర్హతలు కలిగిన యువత ప్రభుత్వ ఉద్యోగంలో సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందని భావించింది. అయితే 32 నెలల సర్వీసు కాలంలో వారు నరకం చవిచూశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను అమలు చేసే క్రమంలో సిబ్బంది చవిచూసిన ఆటుపోట్లు అన్నీ ఇన్నీ కావు. ఏ లబ్ధిదారుకు పథకం అందకపోయినా వారినే జవాబుదారీ చేస్తున్నారు. కానీ ఈ సమస్యలు పరిష్కరించే క్రమంలో ఎవరిని సంప్రదించాలో తెలియక సచివాలయాల ఉద్యోగులు దాడులు చవిచూడాల్సి వచ్చింది. ప్రొబేషన్‌ అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇటీవల పోస్టులను క్రమబద్ధీకరించింది. వేతనాలు, పదోన్నతుల్లో మొండిచేయి చూపడంతో ఈ ఉద్యోగంలో కొనసాగాలా..? రాజీనామా చేసి వేరే ఉద్యోగం చూసుకోవాలా అనే మీమాంసలో పడ్డారు.


ఆదిలోనే తప్పులు.. 

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏ స్థాయి పోస్టు కల్పించాలో నిర్ధారించే క్రమంలో మొదట్లోనే తప్పులు జరిగాయని నిపుణులు పేర్కొంటున్నారు. వారికి ప్రభుత్వం రికార్డ్‌ అసిస్టెంట్‌ స్థాయి కేడర్‌ కల్పించింది. అంటే ఈ పోస్టు ప్రభుత్వ ఉద్యోగంలో ఆఖరి స్థాయి కంటే ఒక్క అడుగు ముందు. అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో అటెండర్‌ ఆఖరి స్థాయి పోస్టు అయితే.. వారికి పదోన్నతి కల్పిస్తే రికార్డ్‌ అసిస్టెంట్‌ హోదా ఇస్తారు. ఈ పోస్టుకు ప్రభుత్వ సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం ఇంటర్‌ అర్హతగా నిర్ణయించారు. అయితే విచిత్రంగా గ్రామ/వార్డు సచివాలయాల కార్యదర్శులకు ప్రత్యేకంగా డిగ్రీ అర్హతగా నిర్ధారించారు. ప్రభుత్వ సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం డిగ్రీ అర్హతతో ఉన్న పోస్టులు.. జూనియర్‌ అసిస్టెంట్లు, అంతకంటే ఎక్కువ కేడర్‌ పోస్టులు. సచివాలయాల ఉద్యోగులను రికార్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో ఉంచి డిగ్రీ అర్హతతో నియమించడంపై సమస్యలొచ్చాయి. ప్రభుత్వ సర్వీస్‌ రూల్స్‌కు సంబంధించి ఈ అంశంపై కోర్టుకు వెళ్తే వారిని జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌ పోస్టులో నియమించాల్సి వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రికార్డ్‌ అసిస్టెంట్‌ స్థాయి పోస్టు కావడంతో సచివాలయాల సిబ్బందికి ఇప్పుడు వేతనంగా రూ.25 వేలు మాత్రమే చేతికొస్తాయి. ఈ పోస్టుల్లో చేరిన సగానికి మందికి పైగా యువత ప్రైవేటు రంగంలో రూ.50 వేల నుంచి రూ.లక్ష జీతం తీసుకునే వారు. ప్రభుత్వ ఉద్యోగమన్న ఆశతో వాటిని వదిలేసి వచ్చారు. ఇప్పుడు జీవిత కాలం పనిచేసినా అంత జీతాలు రావు.


పదోన్నతి చానల్‌ ఏదీ..?

ప్రభుత్వ ఉద్యోగమంటే జీవితాంతం భద్రత ఉంటుందని దానిని ఎంచుకుంటుంటారు. ఈ ఉద్యోగంలో వేతనాల పెరుగుదల కోసం పీఆర్సీలు, ప్రభుత్వం ఇచ్చే అలవెన్సులు, ప్రతి మూడేళ్లకు పదోన్నతులు ఉంటాయని నమ్మకం. సచివాలయ కార్యదర్శి ఉద్యోగం మాత్రం ఎదుగూ బొదుగూ లేనిదైంది.  ప్రభుత్వం ఈ పోస్టులు సృష్టించింది గానీ.. పదోన్నతి చానల్‌ను మాత్రం ఏర్పాటు చేయలేదు. గ్రామ/వార్డు సచివాలయాల్లో 19 రకాల కార్యదర్శులు పనిచేస్తున్నారు. ఈ పోస్టు నుంచి పదోన్నతి పొందితే ఆయా శాఖలకు సంబంధించి మండల స్థాయి ఉద్యోగం పొందాలి. అయితే ఏ శాఖలోనూ అలాంటి పదోన్నతి చానల్‌ సౌకర్యం కల్పించలేదు. ఒక వేళ ప్రభుత్వం పదోన్నతుల చానల్‌ రూపొందించినా.. ఆ మేరకు పోస్టులు కల్పించలేరు. దీంతో వారి జీవిత కాలంలో ఎప్పటికీ పదోన్నతి పొందే అవకాశమే లేదు. సచివాలయ కార్యదర్శి జీవితాంతం అదే పోస్టులో పనిచేసి అక్కడే రిటైరవ్వాలి. అంతే కాకుండా ఈ ఉద్యోగులు గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలో ఆయా సచివాలయాల్లో పనిచేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. అదే విధంగా ఆయా శాఖలకు సంబంధించి పదోన్నతి, టెక్నికల్‌ శిక్షణ వంటి అంశాలను ఆయా శాఖలే నిర్వహిస్తాయని పేర్కొంది. అయితే ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క గ్రామ సచివాలయంలో కూడా సర్పంచ్‌ ఆధ్వర్యంలో పనిచేసే వారు లేరు. పూర్తిగా సర్పంచ్‌లను, పంచాయతీలను దూరం చేసి నవరత్నాల అమలు కోసమే సచివాలయాల సిబ్బందిని వినియోగించుకుంటున్నారు. వారు ఆయా సచివాలయ పరిధిలోని గ్రామాలు/వార్డుల్లో నవరత్నాల పథకాల అమలుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. వారి పరిధిలో దరఖాస్తుల ప్రక్రియ జరుగుతోంది. ప్రభుత్వం రూపొందించిన యాప్‌ల ద్వారా ఆ ప్రక్రియ చేపడుతున్నారు. అయితే మంజూరు విషయంలో మాత్రం వారి ప్రమేయమేమీ లేదు. ఎవరికైనా నవరత్నాలందకపోతే జనం సచివాలయ సిబ్బందినే నిలదీస్తున్నారు. ఆ దరఖాస్తులేమయ్యాయో, ఎందుకు రాలేదో ఎవరిని అడగాలో తెలియక కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు.  


మహిళా పోలీసుల వివాదం కోర్టులో..

సచివాలయాల కార్యదర్శుల సర్వీసు రూల్స్‌కు సంబంధించి కోర్టులో ఎవరైనా వ్యాజ్యం వేస్తే పరిస్థితులు మారిపోయే అవకాశముంది. మహిళా పోలీసులకు సంబంధించి ఇప్పటికే సర్వీస్‌ రూల్స్‌ వివాదం న్యాయస్థానంలో ఉంది. వారు మహిళా సంక్షేమ శాఖ ఉద్యోగులా.. లేక యూనిఫాం ఉద్యోగులా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. అదే విధంగా అన్ని శాఖలకు సంబంధించిన సచివాలయాల కార్యదర్శుల పోస్టుల పదోన్నతుల ప్రక్రియపై అదే పరిస్థితి నెలకొంది. గతంలో పంచాయతీరాజ్‌ శాఖలో వీడీవో పోస్టులను ఏర్పాటు చేశారు. వారికి పదోన్నతి చానల్‌ ఏర్పాటు చేయకపోవడంతో మొన్నటి వరకు ఎదుగూ బొదుగులేకుండా కొనసాగారు. ఇటీవల వారిని ఆ శాఖ పంచాయతీ కార్యదర్శుల్లో విలీనం చేయడంతో వారి పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. గతంలో ఎంపీడీవో పోస్టును ప్రభుత్వం గ్రూప్‌-1లో చేర్చింది. వారికి కూడా పదోన్నతి చానల్‌ లేకపోవడంతో వారు జీవితకాలం ఎంపీడీఓవోలుగా మిగిలిపోయారు. ఆ పోస్టుల్లోనే రిటైరైపోతున్నారు. అదే పరిస్థితి సచివాలయాల ఉద్యోగులకూ ఏర్పడుతుందని సర్వీసు రూల్స్‌ పరిశీలించిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2022-06-27T07:19:48+05:30 IST