మీకైతే ఓకేనా?

ABN , First Publish Date - 2020-09-18T08:15:42+05:30 IST

...వైసీపీ మొదటి నుంచీ అనుసరిస్తున్న విధానమే ఇదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వ్యక్తుల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు కోర్టులు

మీకైతే ఓకేనా?

నాడు స్వయంగా హైకోర్టుకు జగన్‌ 

నేడు ఇతరుల విషయంలో గగ్గోలు

వార్తలు ఆపాలంటూ జగన్‌ న్యాయపోరాటం

వివేకా హత్య వార్తలు ప్రచురించొద్దు..ఎన్నికల ప్రచారంలో వాడొద్దని పిటిషన్‌

సానుకూల ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు

అభ్యంతరం తెలుపని నాటి ఏజీ దమ్మాలపాటి

ఇప్పుడు దమ్మాలపాటి పిటిషన్‌పై కోర్టు ఆదేశాలను తప్పుపడుతున్న వైసీపీ  

మీడియాపై కోర్టుల ఆంక్షలు కొత్తకాదు 

ఎన్డీ తివారీ కేసులోనూ మీడియాపై ఆంక్షలు 

తాజాగా... రకుల్‌కూ కోర్టు రక్షణ

ఇలాంటి ఉదంతాలు ఎన్నెన్నో!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

న్యాయస్థానాల్లో అనుకూలమైన ఆదేశాలు వస్తే... అంతా ఓకే! లేదంటే... కోర్టులకు తప్పుడు ఉద్దేశాలు అంటగడుతూ బురద చల్లడమే! వారు మాత్రం కోర్టులను ఆశ్రయించి రక్షణ పొందవచ్చు. ఇంకెవరికైనా అలాంటి ఉపశమనం లభిస్తే... న్యాయ వ్యవస్థను, జడ్జిలను తిట్టిపోయడమే! 


...వైసీపీ మొదటి నుంచీ అనుసరిస్తున్న విధానమే ఇదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వ్యక్తుల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు కోర్టులు రక్షణ కల్పిస్తాయి. ఇది సహజం. ఈ రక్షణ తాము పొందవచ్చుకానీ, ఇతరులు మాత్రం పొందకూడదన్నదే వైసీపీ వైఖరి!  ‘అమరావతిలో భూముల కుంభకోణానికి పాల్పడ్డారు’ అంటూ మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివా్‌సతోపాటు 

13 మందిపై ఏసీబీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే... ఇది దురుద్దేశంతో కూడుకున్న కేసు అని, ఎఫ్‌ఐఆర్‌లో తప్పుడు ఆరోపణలు చేశారని, ఇవే అంశాలను చిలవలుపలవలుగా రాసి తమ గౌరవ ప్రతిష్ఠలకు భంగపరిచే ప్రమాదముందని దమ్మాలపాటి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలేవీ మీడియా, సోషల్‌ మీడియాలో రాకుండా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతే... ‘అమ్మో, మీడియా గొంతు నొక్కేస్తున్నారు’ అంటూ వైసీపీ పెద్దలతోపాటు, కొందరు పాత్రికేయ ప్రముఖులు వాపోతున్నారు. అసలు విషయమేమిటంటే... కేసులు, విచారణలకు సంబంధించిన వార్తలు ప్రచురించవద్దని, ప్రసారం చేయవద్దని కోర్టులు ఆదేశించడం కొత్తేమీ కాదు. ఎక్కడిదాకానో ఎందుకు... ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తనకు ‘నష్టం చేకూరుస్తాయని’ భావించిన అంశాలు మీడియాలో రాకుండా చూడాలని  స్వయంగాకోర్టును ఆశ్రయించారు. ఆయా సందర్భాల్లో జగన్‌కు అనుకూలమైన ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అప్పుడు కోర్టులు ఇచ్చిన ఆదేశాలతో ఎంచక్కా రక్షణ పొందారు. ఇదొక్కటే కాదు... పలుకేసులకు సంబంధించిన వివరాలు, విచారణాంశాలు మీడియాలో రాకుండా కోర్టులు ఆదేశాలు ఇచ్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఇవి వాటిలో కొన్ని మాత్రమే... 


 బాబాయి హత్య తర్వాత...

ఆంధ్రప్రదేశ్‌లో అతి త్వరలో ఎన్నికలు జరగనున్న సమయంలోనే... పులివెందులలో జగన్‌ బాబాయి వైఎస్‌ వివేకా దారుణ హత్యకు గురయ్యారు.  ఇది అప్పట్లో పెను సంచలనం! దీంతో.. ప్రభుత్వం ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించింది. అయితే... సిట్‌ అధికారులు ఈ కేసు దర్యాప్తులో కనుగొన్న కొన్ని వివరాలను మీడియాకు చెబుతున్నారని, ఇది తమ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందని ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి విపక్ష నేత జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు. అందువల్ల, దర్యాప్తు వివరాలేవీ మీడియాలో రాకుండా చూడాలని కోరారు. అంతేకాదు... వివేకా హత్యపై నేతలు ఆరోపణలు చేస్తే తమకు ఎన్నికల్లో నష్టం కలుగుతుందని, ఎవ్వరూ దీనిపై మాట్లాడకుండా చూడాలని కూడా విన్నవించుకున్నారు. దీనిపై హైకోర్టు అప్పటి అడ్వొకేట్‌ జనరల్‌ అభిప్రాయం అడిగింది. జగన్‌ అభ్యర్థనలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏజీ తెలిపారు. అంతేకాదు... వైఎస్‌ వివేకా హత్య అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించవద్దని నాటి సీఎం చంద్రబాబుకు సూచిస్తామని కూడా చెప్పారు. వెరసి... అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో, అతి సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకా హత్య కేసుపై అటు మీడియా, ఇటు టీడీపీ నాయకులు మాట్లాడకుండా హైకోర్టు ద్వారానే జగన్‌ రక్షణ పొందారు. అసలు విశేషమేమిటంటే... ఇప్పుడు జగన్‌ ప్రభుత్వ హయాంలో కేసు ఎదుర్కొంటున్న దమ్మాలపాటి శ్రీనివాసే అప్పుడు అడ్వొకేట్‌ జనరల్‌గా ఉన్నారు. నాడు జగన్‌ అభ్యర్థనపై ఆయన ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు... ఇదే దమ్మాలపాటి కోర్టును ఆశ్రయించి ఆదేశాలు పొందడం వైసీపీ నేతలకు రుచించకపోవడం గమనార్హం.


 జగన్‌ కేసుల్లో ‘సంయమనం’

అక్రమాస్తుల కేసుల విచారణ సందర్భంగా తమ కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావిస్తున్నారని, జడ్జి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు కూడా మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయని జగన్‌ అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. దీనిని అడ్డుకోవాలని కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించింది. సంయమనం పాటించాల్సిందిగా మీడియాను ఆదేశించింది. ఆ విధంగా కోర్టు ద్వారానే జగన్‌ రక్షణ పొందారు. ఆ తర్వాత...  వారం వారం తాను కోర్టుకు వస్తున్నప్పుడు మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తూ, వార్తలు రాస్తున్నారని... దీనినీ అడ్డుకోవాలని జగన్‌ కోర్టును కోరారు. ‘‘అనేక కేసుల్లో అనేక మంది కోర్టుకు వస్తుంటారు. జగన్‌ కేసును మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నారు?’’ అని మీడియాను కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో సంయమనం పాటించాలని ఆదేశించింది.


తివారీ విషయంలో జరిగిందేమిటీ?

2009లో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఎన్డీ తివారీ రాజ్‌భవన్‌ వేదికగా అనైకతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయాన్ని ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ స్టింగ్‌ ఆపరేషన్‌లో బయటపెట్టింది. అయితే... ఆ దృశ్యాలు ప్రసారం చేయవద్దంటూ రాజ్‌భవన్‌ అప్పటికప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించింది. సదరు దృశ్యాలు ప్రసారం చేయకూడదంటూ హైకోర్టు అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసింది.


సునందా పుష్కర్ కేసులోనూ..

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ సతీమణి సునందా పుష్కర్‌ ఆత్మహత్య సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆమె మరణం, కారణాలపై అప్పట్లో పలురకాల అనుమానాలు కూడా తలెత్తాయి. దీనిపై టీవీ చానళ్లలో వరుస చర్చలు జరిగాయి. దీంతో... ‘ఫలానా వారిపై అనుమానాలు వచ్చేలా ఎలాంటి చర్చలు జరపవద్దు, వార్తలు ప్రసారం చేయవద్దు’ అని ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్‌ గోస్వామిని సుప్రీంకోర్టు ఆదేశించింది. 


సుశాంత్‌ ఆత్మహత్య కేసులోనూ...

ఎప్పటిదాకానో ఎందుకు... ఇటీవల జరిగిన బాలీవుడ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ఏం జరిగిందో చూద్దాం! ఆయన మరణంపై టీవీ చానళ్లలో, సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వస్తుండటంతో... ‘సంయమనం పాటించండి’ అని న్యాయస్థానం మీడియాను ఆదేశించింది. 

ఇలాంటివి మరిన్ని... 
బిహార్‌ ముజఫర్‌పూర్‌ సామూహిక అత్యాచారాల కేసు వివరాలు ప్రసారం చేయవద్దని పట్నా హైకోర్టు మీడియాకు ఆదేశాలు జారీ చేసింది.
జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు ప్రొసీడింగ్స్‌ బయటపెట్టవద్దని బాంబే హైకోర్టు మీడియాను ఆదేశించింది.
సహారా కేసులో విచారణాంశాలేవీ రాయకుండా ‘సంపూర్ణ నిషేధం’ విధించాలని ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. అది కుదరదని... కేసును బట్టి ఆదేశాలు ఇస్తామని కోర్టు తెలిపింది.  
కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల అంశంపైనా సుప్రీంకోర్టు మీడియాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెప్పిన వివరాలు మాత్రమే ప్రచురించాలని తెలిపింది.
ఇక... ప్రస్తుతం బాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్‌ అంశానికి వద్దాం! ఇందులో రకూల్‌ ప్రీత్‌సింగ్‌ పేరు కూడా బయటికి వచ్చింది. దీంతో ఒక్కసారిగా మీడియాలో హల్‌చల్‌ మొదలైంది.  ఆమెపై ఆధారాలు లేకుండా ఎలాంటి వార్తలు ప్రసారం చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-09-18T08:15:42+05:30 IST