సిగ్గుంటే.. వెంటనే జగన్ రాజీనామా చేయాలి: తులసీరెడ్డి

ABN , First Publish Date - 2020-06-03T20:24:23+05:30 IST

వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని..

సిగ్గుంటే.. వెంటనే జగన్ రాజీనామా చేయాలి: తులసీరెడ్డి

అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులపై బుధవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఫోన్ ద్వారా మాట్లాడుతూ గతంలో నీలం సంజీవరెడ్డి, జనార్థన్ రెడ్డి ఒక సంఘటనలో కోర్టు మందలించిందని సీఎం పదవులకు వారు రాజీనామా చేశారన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం సిగ్గున్నా తక్షణం జగన్ రాజీనామా చేయాలన్నారు.


రంగులో తొలగించడానికి అధికారుల వద్ద నుంచి డబ్బు రాబట్టాలని తులసీ రెడ్డి డిమాండ్ చేశారు. కోర్టుల నుంచి అక్షింతలు వేసుకుంటే తప్ప ఈ ప్రభుత్వానికి నిద్రపట్టడంలేదని ఎద్దేవా చేశారు. పనికిమాలిన ప్రభుత్వమని దుయ్యబట్టారు. పదే పదే కోర్టు మొట్టికాయలు వేస్తున్నా ఈ ప్రభుత్వం ముర్కత్వంగా ముందుకువెలుతోందని విమర్శించారు.


రంగులపై సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు రంగులు తొలగించాలని జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. 4 వారాల్లోగా పంచాయతీ కార్యాలయాలకు రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. 

Updated Date - 2020-06-03T20:24:23+05:30 IST