Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 18 Jan 2022 02:41:42 IST

ఉద్యోగులకు జగన్‌ షాక్‌

twitter-iconwatsapp-iconfb-icon
ఉద్యోగులకు జగన్‌  షాక్‌

  • నిజంగానే ‘రివర్స్‌’ పీఆర్సీ.. జీతాల్లో భారీ కోత
  • హెచ్‌ఆర్‌ఏకు కటింగ్‌.. సీసీఏ ఎత్తివేత.. 80 ఏళ్ల వరకు అదనపు పెన్షన్‌ రద్దు
  • ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కారు భారీ ఝలక్‌
  • ఒక్కో ఉద్యోగికి 20 శాతం వరకు కోత?.. అనుకున్నదే చేసిన జగన్‌ సర్కారు
  • సచివాలయం నుంచి గ్రామ స్థాయి ఉద్యోగి వరకూ అందరికీ వేతన నష్టమే
  • అందరికీ హెచ్‌ఆర్‌ఏలో కోత.. క్వాంటమ్‌ పెన్షన్‌  శ్లాబుల్లో మార్పు
  • పెండింగ్‌ డీఏలు ‘ఐఆర్‌’లో సర్దుబాటు.. ఇకపై రాష్ట్ర స్థాయిలో పీఆర్సీలు ఉండవు
  • పదేళ్లకోసారి కేంద్రం వేసే కమిషన్లే ఆధారం.. అర్ధరాత్రి విడుదలైన పీఆర్సీ జీవోలు


‘మీరు అడిగింది చెయ్యం. మేం చేయాలనుకున్నదే చేస్తాం’ అని సర్కారు తేల్చేసింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగి నుంచి గ్రామస్థాయిలో పని చేసే ఉద్యోగి వరకు అందరికీ షాక్‌లు ఇచ్చింది. ఆఖరికి పెన్షనర్లనూ వదల్లేదు. చట్టబద్ధంగా ఏర్పడిన అశుతోశ్‌మిశ్రా కమిషన్‌ను కాదని.. తాను సొంతంగా నియమించిన ‘సీఎస్‌ కమిటీ’ నివేదికకే జై కొట్టింది. ఫిట్‌మెంట్‌ విషయంలో దెబ్బ కొట్టిన జగనన్న ప్రభుత్వం ఇప్పుడు.. ఇంటి అద్దె భత్యం(హెచ్‌ఆర్‌ఏ)కు కూడా భారీగా కోత పెట్టింది. సీసీఏను పూర్తిగా ఎత్తేసింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టిన డీఏలను విడుదల చేసి.. ‘అదే మహాభాగ్యం, పండగ చేసుకోండి’ అని చెప్పేసింది. ఇప్పటికే ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ప్రకటించి.. ఇప్పుడు పాత ప్రయోజనాలనూ తగ్గించడంతో ఉద్యోగుల వేతనాలు 20 శాతం వరకు కోత పడనున్నట్లు అంచనా.


హెచ్‌ఆర్‌ఏలో కోత ఇలా అప్పుడు ఇప్పుడు కోత

రాష్ట్ర సచివాలయం, హెచ్‌వోడీ 30.0%  16.0% 14.0%

బెజవాడ, విశాఖ, గుంటూరు, నెల్లూరు 20.0% 16.0% 4.0%

రాష్ట్రంలోని ఇతర పట్టణాలు 14.5% 8.0% 6.5%

గ్రామీణ ప్రాంతాలు 12.0% 8.0% 4.0%


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఉద్యోగుల భయాందోళనలే నిజమయ్యాయి. జగన్‌ ప్రభుత్వ ‘రివర్స్‌ పీఆర్సీ’ ఖరారైపోయింది. ఇక... ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్‌ సిబ్బంది పెన్షన్లు భారీగా తగ్గనున్నాయి. వేతన సవరణకు సంబంధించిన జీవోలు సోమవారం రాత్రి పొద్దుపోయాక విడుదలయ్యాయి. ఇప్పటికే  ఐఆర్‌  27శాతం కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ (23.29 శాతం) ప్రకటించిన సర్కారు... ఇప్పుడు హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, డీఏల్లోనూ ఉద్యోగులకు ఝలక్‌ ఇచ్చింది. క్వాంటమ్‌ పెన్షన్లలోనూ ఒక శ్లాబు ఎత్తేసింది.  దీంతో పీఆర్సీతో పెరగాల్సిన ఉద్యోగుల వేతనాలు ‘రివర్స్‌’ గేరు వేశాయి. రిటైర్డ్‌ ఉద్యోగులకు గ్రాట్యుటీని రూ.12లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచడం ఒక్కటే ప్రభుత్వం తీసుకున్న సానుకూల చర్య!


హెచ్‌ఆర్‌ఏలో కోత ఇలా... 

గతంలో ఉద్యోగుల కార్యక్షేత్రం జనాభా ప్రాతిపదికన నాలుగు కేటగిరీల్లో హెచ్‌ఆర్‌ఏను నిర్ణయించారు. ఇప్పుడు ప్రభుత్వం వాటిని మూడుకు కుదించింది. ఒక శ్లాబును మాయం చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో ఏర్పాటైన రాష్ట్ర  సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో  సచివాలయం, హెచ్‌వోడీల ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ లభించేది. విభజనకు ముందు హైదరాబాద్‌లో అమలైన హెచ్‌ఆర్‌ఏనే వీరికి కొనసాగించారు. ఇప్పుడు దీనిని 16శాతానికి కుదించారు. అంటే... వీరందరికీ 14 శాతం కోత పడినట్లే. ఇక... గుంటూరు, విశాఖ, నెల్లూరు, విజయవాడ నగరాల్లోని ప్రభుత్వ సిబ్బందికి గతంలో 20 శాతం హెచ్‌ఆర్‌ఏ వచ్చేది. దీనిని 16శాతానికి కుదించారు.


రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 14.5 హెచ్‌ఆర్‌ఏ ఉండగా... దానిని 8 శాతానికి కుదించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగులకు 12 శాతం ఉన్న హెచ్‌ఆర్‌ఏ ఇప్పుడు 8 శాతానికి దిగిపోయింది. రాష్ట్రంలో నాలుగు పట్టణాలు మినహా... అన్ని గ్రామాలు, మున్సిపాల్టీలలో పని చేసే సిబ్బందికి ఇకపై 8 శాతం హెచ్‌ఆర్‌ఏ మాత్రమే లభిస్తుంది. 50 లక్షలపైగా ఉన్న జనాభా ఉన్న నగరాల్లో పని చేసే సిబ్బందికి 24 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందని జీవోల్లో తెలిపారు. కానీ... రాష్ట్రంలో అంత జనాభా ఉన్న నగరం ఒక్కటీ లేదు. అంటే... ఈ శ్లాబు ఉన్నా, లేనట్లే!


సీసీఏ ఎత్తేశారు...

సిటీ కాంపన్సేటరీ అలవెన్స్‌ (సీసీఏ)ను కూడా జగన్‌ ప్రభుత్వం ఎత్తేసింది. గతంలో విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో పని చేసే సిబ్బందికి రూ.500... సచివాలయం/హెచ్‌వోడీ సిబ్బందికి రూ.వెయ్యి సీసీఏ లభించేది. ఇప్పుడు ‘సీఎస్‌ కమిటీ’ సిఫారసుల పేరుతో... ఈ ప్రయోజనాన్ని కూడా ఎత్తివేసింది.


నికరంగా దక్కేది 14.29 శాతమే... 

మినిమం బేసిక్‌ స్కేలుకు 23 శాతం ఫిట్‌మెంట్‌తో... 2018 జూలై ఒకటో తేదీ నాటికి పెండింగ్‌లో ఉన్న 30.392 శాతం డీఏలను కలిపి పే స్కేల్స్‌ను సవరించారు. పేరుకు 23 శాతం ఫిట్‌మెంట్‌ అయినప్పటికీ... పే స్కేల్స్‌లో దక్కేది 19 శాతం ఫిట్‌మెంట్‌ మాత్రమే. వీటిలో హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, ఇతర ప్రయోజనాల్లో కోతను తీసేస్తే... ప్రభుత్వం తాను అనుకున్నట్లుగా 14.29 శాతం  ఫిట్‌మెంట్‌నే ఇచ్చినట్లయ్యిందని ఉద్యోగులు చెబుతున్నారు.ఉద్యోగులకు జగన్‌  షాక్‌

పింఛనుదారులకూ కోతలే!

అదనపు క్వాంటమ్‌ కటింగ్‌.. 70 ఏళ్లు దాటితే 10 శాతం 

75-80 మధ్య 15 శాతం కట్‌.. గ్రాట్యుటీ 16 లక్షలకు పెంపు

అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు భారీ షాక్‌ ఇచ్చింది. జీవిత చరమాంకంలో అక్కర కొస్తుందని భావించిన అదనపు క్వాంటమ్‌కు కోత పెట్టింది. ముఖ్యంగా 70-80 ఏళ్ల మధ్య వయసున్న ఎక్కువ మంది పింఛన్‌దారులు లబ్ధి పొందే అదనపు క్వాంటమ్‌ను పూర్తిగా ఎత్తేసింది. దీంతో వీరిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఉద్యోగులు అంటున్నారు. పదవీ విరమణ తర్వాత  సాధారణ పింఛను ఇస్తూనే.. పింఛనుదారులకు 70 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వరకు అదనపు క్వాంటమ్‌ పింఛన్‌ను ఇస్తున్నారు.


దీనిలో భాగంగా 70-75 ఏళ్ల మధ్య ఉన్నవారికి 10 శాతం, 75-80 ఏళ్లు ఉన్నవారికి 15 శాతం, ఇలా వందేళ్ల వరకు పెంచేవారు. అయితే, ఇప్పుడు ఈ అదనపు క్వాంటమ్‌ను తొలగించారు. 80 ఏళ్లు పైబడితేనే అదనపు క్వాంటమ్‌ పింఛను లభిస్తుంది. వాస్తవానికి 70-80 ఏళ్ల మధ్య ఉన్న పింఛనుదారులు ఆరోగ్య సమస్యలతో సతమతమవడం సహజం.


ఈ నేపథ్యంలో వీరికి అదనపు క్వాంటమ్‌ ఎంతో ఉపయుక్తంగా ఉండేది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఆ పదేళ్లపాటు అదనపు క్వాంటమ్‌ను లేకుండా చేసింది. ఫలితంగా 80 ఏళ్లు వచ్చే వరకు పింఛనుదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 80-85 ఏళ్ల మధ్య వయసున్న రిటైర్డ్‌ ఉద్యోగులకు 20ు, 85-89 మధ్య 30ు, 90-94మధ్య 40ు, 95-99 మధ్య 50శాతం, వందేళ్లు వస్తే 100 శాతం అదనపు క్వాంటమ్‌ పింఛన్‌ అందనుంది. ఈ మేరకు సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  


గ్రాట్యుటీ పెంపు

ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ తర్వాత ఇచ్చే గ్రాట్యుటీని ప్రభుత్వం రూ.16 లక్షలకు పెంచింది. కనీస కుటుంబ పింఛను ఇక నుంచి రూ.10 వేలుగా పేర్కొంది. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీలను ఏర్పాటు చేయడం, వాటిప్రకారం పింఛను పెంచడం ఉండదు. కేంద్ర ప్రభుత్వ పీఆర్‌సీ ప్రకారమే రాష్ట్రంలోని పింఛనుదారులకు కూడా ప్రయోజనాలను నిర్ణయిస్తారు. అదేవిధంగా డీఏపై కేంద్రం నిషేధం విధించిన కాలానికి సంబంధించి రాష్ట్రంలో ఇవ్వాల్సిన మూడు డీఏలను.. 18 నెలల ఆలస్యంగా పింఛనుదారులకు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.  


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.