Jagan Sarkar నిర్ణయంతో ఆదోనిలో వేడి రాజుకున్న పాలిటిక్స్..

ABN , First Publish Date - 2022-02-04T16:33:20+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడి అధికార పార్టీ నేతలు ఇరకాటంలో పడ్డారు. సెకండ్ ముంబయిగా పేరుగాంచిన తమ ప్రాంతాన్ని జిల్లాగా చేయకపోతే ...

Jagan Sarkar నిర్ణయంతో ఆదోనిలో వేడి రాజుకున్న పాలిటిక్స్..

కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడి అధికార పార్టీ నేతలు ఇరకాటంలో పడ్డారు. సెకండ్ ముంబయిగా పేరుగాంచిన తమ ప్రాంతాన్ని జిల్లాగా చేయకపోతే కర్ణాటకలో కలిపేయండన్న ప్రజా సంఘాల కొత్త వాదనతో వైసీపీ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాణిజ్య పట్టణాన్ని జగన్ ప్రభుత్వం జిల్లా చేయక పోవడంపై జనం కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇంతకీ ఈ పరిణామం ఎక్కడ? వివరాలు  ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


సీఎం జగన్ సర్కార్ ప్రకటనతో ఆదోనిలో వేడి రాజుకున్న పాలిటిక్స్‌

పార్లమెంట్ స్థానాలను జిల్లాలు చేయడంపై జగన్ ప్రభుత్వం నిర్ణయం ఆదోని పాలిటిక్స్‌లో వేడి రాజుకుంది. కర్నూలు జిల్లాలోనే ఆదోని పట్టణం వాణిజ్య, వ్యాపార రంగాల్లో ప్రసిద్ధిగాంచింది. ఆదోనిని సెకండ్ బాంబే అని కూడా పిలుస్తారు. వ్యాపార, వాణిజ్యపరంగా బాగున్నప్పటికీ ఆదోని ప్రాంతంలో సరైన నీటి వనరులు లేవు. దీంతో ఆదోని రెవిన్యూ డివిజన్‌లోని పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని చాలా గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. నీటి లభ్యత లేనందు వల్ల, సరైన పంటలు పండకపోవడం వల్ల ఆదోని ప్రాంతంలో చాలా ఏళ్ల నుంచి కరువు కాటకాలు తాండవిస్తున్నాయి. దీంతో ఆదోని డివిజన్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. సాగు, తాగునీటి సమస్య ప్రతి ఏడాది తలెత్తడం వలన ఇక్కడి ప్రజలు సుదూర ప్రాంతాలకు వలస వెళతారు. ఆదోని ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాలపై తుది నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల జాబితాలో నంద్యాల పార్లమెంట్ ఉంది. నూతన జిల్లాల ఏర్పాటులో ఆదోనికి స్థానం కల్పించకపోవడంపై ఈ ప్రాంత వాసులు మండిపడుతున్నారు.


కర్ణాటక సరిహద్దులో ఆదోని డివిజన్‌ గ్రామాలు

చాలా కాలంగా ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతం వారు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదోని జిల్లా సాధన సమితి, పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక లాంటి జేఏసీలు అనేక కార్యక్రమాలు నిర్వహించాయి. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల వద్ద కూడా ఈ విషయంపై ఆ జేఏసీల నేతలు చర్చించారు. ఆదోని జిల్లా ఏర్పాటు అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇక మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి తిక్కారెడ్డి సైతం ఆదోనిని జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. ఆదోని డివిజన్‌లో చాలా గ్రామాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. అక్కడ నుంచి ఏదైనా పని కోసం కర్నూలుకు రావడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆదోనిని జిల్లా చేస్తే సమస్యల నుంచి బయటపడతామనీ, అలాగే వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనీ సూచించారు. 


ఆదోనిని జిల్లా చేయాలని టీడీపీ ఇన్‌ఛార్జి తిక్కారెడ్డి డిమాండ్

అయితే ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల జాబితాలో ఆదోని లేకపోవడంతో ఈ ప్రాంత వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆదోని జిల్లా సాధన పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి తిక్కారెడ్డి... ఆదోనిని జిల్లా చేయాలి, లేకపోతే తమ ప్రాంతాన్ని కర్ణాటకలో కానీ, లేదా తెలంగాణలో కానీ కలపాలని డిమాండ్ చేశారు. ఇందుకు పలు ప్రజా సంఘాలు సైతం మద్దతు తెలిపాయి.


అధికార వైసీపీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట

ఆదోనిని జిల్లాగా చేయాలన్న పట్టుదలను అధికార పార్టీ నేతలు ఏ మాత్రం కనబర్చలేదనీ, అసలు పట్టించుకోలేదనీ నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. అందుకే ఆదోని జిల్లా ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని చర్చించుకుంటున్నారు. ఇలాగే ఉంటే కుదరదనీ, ఉద్యమాన్ని ఉధృతం చేయాలనీ వివిధ జేఏసీల నాయకులు సిద్ధం అవుతున్నారు. రానున్న రోజుల్లో ఉద్యమం తారస్థాయికి చేరితే జేఏసీ నాయకులకు, ప్రజలకు తాము ఏం చెప్పాలో అర్థం కావడం లేదని అధికార వైసీపీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. 


మొత్తం మీద కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయంతో వైసీపీ ఎమ్మెల్యేలకు నోట్లో వెలక్కాయ పడినంత పనైంది. మరి ఉద్యమం తీవ్రరూపం దాల్చాకముందే ఎమ్మెల్యేలు ప్రభుత్వం వద్ద కొత్త జిల్లా ఏర్పాటుపై మొర పెట్టుకుంటారా? లేక మునుపటి లాగే లైట్ తీసుకుంటారా? అనేది చూడాలి.

Updated Date - 2022-02-04T16:33:20+05:30 IST