అమరావతి: 24 గంటలు తిరగకుండానే జగన్ సర్కార్ మరో యూ టర్న్ తీసుకుంది. శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంలోని 168 అధికరణ కింద 1958లో శాసన మండలిని ఏర్పాటు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో శాసన మండలిని రద్దు చేశారన్నారు. తిరిగి 2006లో మండలిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునరుద్ధరించారని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధుల నుంచి ఎన్నుకోబడిన మండలి సుప్రీం అయినప్పటికీ దిగువ సభకు సూచనలు చేయాల్సి ఉందన్నారు.
రాష్ట్రానికి కౌన్సిల్ అవసరం లేదని 2020 జనవరి 27న తీర్మానించామన్నారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి కూడా పంపించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. దీంతో దీనిపై సభ్యుల్లో సందిగ్ధత ఏర్పడిందన్నారు. అన్ని వర్గాల నుంచి సభ్యులు వచ్చిన దృష్ట్యా సందిగ్ధతకు తెరదించుతూ శాసన మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కౌన్సిల్ రద్దు నిర్ణయాన్ని విరమించుకుంటూ తీర్మానం చేస్తున్నామని మంత్రి బుగ్గన తెలిపారు.