జగన్‌ పాలన వంద శాతం ఫెయిల్‌

ABN , First Publish Date - 2020-06-01T09:10:35+05:30 IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కడే నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏకపక్ష పాలనతో వంద శాతం ఫెయిల్‌ అయ్యారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర

జగన్‌ పాలన వంద శాతం ఫెయిల్‌

ఏడాదిలోనే అపఖ్యాతి మూటగట్టుకున్నాడు

కాంగ్రెస్‌ పథకాలు తప్ప ఆయన పథకాలెక్కడ? 

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాఽథ్‌ ధ్వజం


కడప (కలెక్టరేట్‌), మే 31 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కడే నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏకపక్ష పాలనతో వంద శాతం ఫెయిల్‌ అయ్యారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శైలజానాథ్‌ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడపలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.తులసిరెడ్డితో కలసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజానాథ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగానికి లోబడి, చట్టబద్ధంగా, రాష్ట్రం భౌతికంగా అభివృద్ధి చెందేలా, ప్రజల జీవన ప్రమాణం పెరిగేలా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేల బలం చూపి ఇతరులను భయపెట్టే విధంగా పాలన సాగడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అపఖ్యాతి మూటకట్టుకుంటే జగన్‌ మాత్రం ఏడాది పాలనలోనే ప్రజల నుంచి ఎక్కువ స్థాయిలో అపఖ్యాతిని మూటకట్టుకున్న ముఖ్యమంత్రిగా నిలిచారని తెలిపారు.


జగన్‌కు ఒక నిర్ధిష్ట విధానం లేదని, చెప్పేది ఒకటి చేసేది మరొకటంటూ  విమర్శనాస్త్రాలు సంధించారు.  రాష్ట్ర  బడ్జెట్‌ 2.20 లక్షల కోట్లల్లో ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అమలు చేసే పథకాలన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్టిన పథకాలేనని, జగన్‌ పాలనలో సొంత పథకం ఏదో చూపాలంటూ సవాల్‌ విసిరారు. ఇందిరమ్మ ఇళ్లు అందరికీ ఇచ్చామన్నారు. కరెంట్‌ బిల్లులు మాఫీ చేశామని, ఆరోగ్యశ్రీ బాగా అమలు చేశామన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీకి రాజీవ్‌ గాంధీ పేరు పెడితే ఆ పేరును తొలగించి జగన్‌ తప్పు చేశారన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్‌, ఆహార హక్కు చట్టం, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్‌ పార్టీ పథకాలేనని తెలిపారు. ఏడాది పాలనలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేసిందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. వాళ్లకు ఐదు వేలు, వీరికి పది వేలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.


ఎన్నికల మూడ్‌ తప్పితే నీకు పాలనపై ధ్యాస లేదనే విషయం ప్రజలకు తెలుసన్నారు. టీటీడీ నిర్ణయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆయన తప్పుపట్టారు. భూములు అమ్మాలనడం, పవిత్రమైన స్వామి వారి లడ్లు రోడ్లపై అమ్మడం సరికాదని ఈవో, చైర్మన్లు దీనిపై ఆలోచించాలన్నారు. ఎన్నికల కమిషన్‌ నిమ్మగడ్డ రమేశ్‌ విషయంలో అడ్వకేటు జనరల్‌ అసెంబ్లీలో కాకుండా మీడియా ముందు ప్రత్యక్షం కావడం జగన్‌ పాలనకే సాధ్యమన్నారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అపుడు ఎన్నికలు వాయిదా వేయకుండా ఉంటే ఈరోజు కరోనా రాష్ట్రంగా మిగిలేదన్నారు. జగన్‌ ఏకపక్ష నిర్ణయాలు మాని సమిష్టి నిర్ణయాలతో పాలన సాగించాలని  ఆయన హితవు పలికారు. సమావేశంలో రాష్ట్ర మాజీ నేతలు నజీర్‌ అహమ్మద్‌, ఎస్‌ఎ సత్తార్‌, నీలి శ్రీనివాసరావు, జకరయ్య, విష్ణుప్రీతంరెడ్డి, కోటపాటి లక్ష్మయ్య, సుజాతారెడ్డి, గోసాలదేవి, తిరుమలేశు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-01T09:10:35+05:30 IST