వైసీపీది రద్దుల ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-02-20T09:17:18+05:30 IST

ఒక్క అవకాశం ఇస్తే చాలని అధికారంలోకి వచ్చిన వైసీపీ రద్దులు, వేధింపులు, కక్షసాధింపుల ప్రభుత్వంగా మారిందని కాంగ్రెస్‌ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు.

వైసీపీది రద్దుల ప్రభుత్వం

మండలి రద్దుతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి వెన్నుపోటు

జగన్‌ చేతికి అధికారం ఎకె-47 గన్‌ ఇచ్చినట్లే.. 

కాంగ్రెస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి 


హిందూపురం టౌన్‌, ఫిబ్రవరి 19 : ఒక్క అవకాశం ఇస్తే చాలని అధికారంలోకి వచ్చిన వైసీపీ రద్దులు, వేధింపులు, కక్షసాధింపుల ప్రభుత్వంగా మారిందని కాంగ్రెస్‌ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసనమండలిని రద్దుచేయడం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి వెన్నుపోటు పొడవడమేనన్నారు. నాడు వైఎ్‌సఆర్‌ జన్మదినం సందర్భంగా ఆ రోజు శాసనమండలిని పునరుద్ధరిస్తే నేడు ఆయన తనయుడు రద్దు చేయడం సిగ్గుచేటన్నారు. జగన్‌ పాలన పిచ్చితుగ్లక్‌ పాలనకు మించి పోయిందన్నారు. అధికారం ఇచ్చి చేతికి ఎకె-47 గన్ను ఇచ్చిన విధంగా ఉందన్నారు. ఎప్పుడు ఏది రద్దు చేస్తారో, ఏది ప్రజలపై వడ్డిస్తారో తెలియకుండా పోయిందన్నారు. కోతలు, వాతలు, రద్దులు వేధింపులు, వాయింపుల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు.


ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉందన్నారు. తొమ్మిది నెలల కాలంలో సామాన్యులకు అందకుండా ఇసుక,  సిమెంటు, ఆర్టీసీ చార్జీలు పెంచారన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌, ఏప్రిల్‌ నుంచి విద్యుత్‌ చార్జీలు పెంచుతున్నారన్నారు. నవరత్నాలలోని రైతు భరోసాకు రూ.12,500 ఇస్తానని 5వేలు కోత విధించారన్నారు. అమ్మఒడిలో కూడా న్యాయం జరగలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. 4.80 లక్షల పింఛన్లు రద్దుచేసి, 18.78 లక్షలు తెల్లకార్డులు కోతకోసి పేదల కడుపుకొడుతున్నారన్నారు. రాష్ట్రానికి ఒక రాజధాని లేకపోతే మూడు రాజధానులతో అభివృద్ధి అంటున్నారు. ఐదేళ్లలో బాబు పాలనతో విసుగు చెందిన ప్రజలు జగన్‌కు అధికారం ఇచ్చి బాధపడుతున్నారన్నారు. వీటికంటే కాంగ్రెస్‌ నయమనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కాంగ్రె్‌స పోటీచేస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం, స్థానిక నాయకులు బాలాజీ మనోహర్‌, నాగరాజు, శైవలి రాజశేఖర్‌, రవూఫ్‌, రహమత్‌, సంపత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T09:17:18+05:30 IST