Abn logo
Jun 20 2021 @ 03:14AM

జగన్‌ మామయ్యా...

అమ్మ డెత్‌ సర్టిఫికెట్‌ ఇప్పించరూ..!

లేఖలో సీఎంకి మొరపెట్టుకొన్న బాలిక


అల్లూరు, జూన్‌ 19: ‘‘జగన్‌ మామయ్యా..! చిన్నప్పుడే తండ్రికి దూరమయ్యాను. కళ్లల్లో పెట్టుకొని చూసుకున్న తల్లి ప్రాణాలు కోల్పోయింది. మైనర్‌ని అయిన నేను అమ్మమ్మ సంరక్షణలో ఉంటున్నా. అమ్మ డెత్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా. మంజూరు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వేధిస్తున్నారు. విసిగిపోయి మానసికంగా కుంగిపోయాను’’ అంటూ 15ఏళ్ల బాలిక సీఎం జగన్‌కు లేఖరాసింది. ఆ లేఖ సారాంశం... బిరుదవోలు నోషిత (15) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు నివాసి. తల్లి పొణకా అనుపమ న్యాయశాఖలో చిరు ఉద్యోగిగా పనిచేస్తూ గత నెల 2న గుండెపోటుతో మృతిచెందింది. కరోనా కబళించిందని వదంతులు రేగడంతో నిజమని భావించిన నగర పంచాయతీ అధికారులు డెత్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా నిలిపివేశారు. విచారణ నిమిత్తం కావలి మున్సిపల్‌ కార్యాలయానికి పంపించామని చెప్పారు. మున్సిపల్‌ ఆఫీసులో సంప్రదించగా... ‘డాక్టరు సర్టిఫికెట్‌  వచ్చేవరకు మంజూరు చేయవద్దు’ అని అల్లూరు నగర పంచాయతీ అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. నెల తిరిగినా తల్లి మరణ ధృవీకరణ పత్రం రాకపోవడంతో తీవ్ర నిస్పృహకు గురైన బాలిక... రిజిస్టరు పోస్టులో నేరుగా ముఖ్యమంత్రికి లేఖ పంపింది.