వైసీపీ విలీనమాయ

ABN , First Publish Date - 2021-09-14T03:11:32+05:30 IST

వైసీపీ విలీనమాయ

వైసీపీ విలీనమాయ

వైసీపీ ప్రభుత్వం మహామాయోపాయాన్ని రచించింది. ఉద్యోగాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు చూపించే అబ్రకదబ్ర వ్యూహాన్ని సిద్ధం చేసింది. జాబ్‌ క్యాలెండర్‌లో భారీగా ఉద్యోగాల కోతకు ప్లాన్‌ వేసింది. జగన్‌ సర్కారు సిద్ధం చేసిన ఆ కొత్త ప్రతిపాదన ఏంటి?దీనిపై ఉద్యోగ సంఘాల నేతల రియాక్షన్‌ ఏంటి?


ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విలీనం పేరుతో జాబ్ క్యాలెండర్‌లో ఇస్తామన్న ఉద్యోగాల సంఖ్యను కుదించేందుకు రంగం సిద్ధం చేసింది వైసీపీ ప్రభుత్వం. విలీనం మంత్రంతో వేలాది మంది నిరుద్యోగుల ఉపాధికి గండి కొడుతోంది. ఇదే సమయంలో యేళ్ల తరబడి పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల ఆశలపైనా నీళ్ళు చల్లుతోంది. ఎయిడెడ్‌ లెక్చరర్లు ప్రభుత్వంలో విలీనం కావాల్సిందేనంటూ ఆగమేఘాల మీద అర్ధరాత్రి ఆదేశాలిచ్చింది. సెలవు రోజుల్లోనూ రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే వారందరినీ దాదాపుగా విలీనం చేసేసుకున్నామని ప్రకటించేసుకుంది. మరో వారంలోగా ఎయిడెడ్‌ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను కూడా విలీనం చేసుకునేందుకు రగం సిధ్దం చేస్తోంది.


గతంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకొని 50వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పుకుంది సర్కారు. ఇప్పడు ఎయిడెడ్ వంతు వచ్చింది. ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో పనిచేసే జూనియర్ లెక్చరర్లను ప్రభుత్వంలోకి తీసుకోవడం ద్వారా వారికి ఒక్కపైసా కూడా అదనపు లబ్ది ఉండదు. ఇదే సమయంలో ప్రభుత్వ కళాశాలల్లో రిక్రూట్ మెంట్లకు మరో పదేళ్ళ పాటు మంగళం పాడేయొచ్చు అనేది ప్రభుత్వం యోచన. ఇదిలా ఉంటే దశాబ్దాల తరబడి పర్మినెంట్ అవుతుందని ఆశతో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల ఆశలపైనా జగన్ సర్కార్ ఈ తాజా నిర్ణయంతో నీళ్ళు చల్లింది. ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఒప్పంద లెక్చరర్‌లు.


ఎయిడెడ్‌ కళాశాలల విలీనం నిర్ణయంతో.. ప్రభుత్వం జాబితాలోకి కొత్తగా వచ్చే ఉద్యోగాల సంఖ్య 8వేలకు పైగా ఉంటుంది అనేది ఓ అంచనా. దీంతో ఈ పోస్టులు ఇప్పట్లో భర్తీ చేసే అవకాశం ఉండదు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ డిగ్రీ కళాశాలల్లో ఉన్న 720 మంది ఒప్పంద అధ్యాపకులు తమ పరిస్ధితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా తమను క్రమబద్దీకరిస్తామని హమీ ఇచ్చారని.. ఇప్పడు ఎయిడెడ్ వీలీనం పేరుతో క్రమబద్దీకరణ అంశం అటుంచితే తమ ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నారని వారు వాపోతున్నారు. నిజానికి డిగ్రీ కళాశాలల్లో ఒక వెయ్యి 20 మంది ఒప్పంద అధ్యాపకులు పనిచేశారని, కొందరు పదవీ విరమణ చేయడం, మరికొందరు కరోనా మూలంగా చనిపోవడం వంటి కారణాలతో చివరకు 720 మంది మిగిలారని కాంట్రాక్ట్‌ అధ్యాపకులు చెబుతున్నారు. మిగిలిన ఈ 720 మంది ఉపాధిని కూడా దెబ్బకొట్టేందుకు ప్రభుత్వం రంగం సిధ్దం చేస్తోందంటున్నారు. పైగా.. తమకు ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా చేసేందుకు సెలవు రోజుల్లో జీవో ఇచ్చి మరీ రిపోర్టు చేయాలని సూచించడంపై వారు మండిపడుతున్నారు. 


ఇప్పటివరకూ ఎయిడెడ్‌ కళాశాలల్లోని లెక్చరర్లకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. గతంలో దాతల సహకారంతో ఎయిడెడ్‌ విద్యాసంస్థలు స్థాపించారు. వాటికోసం భూమి, భవనాలు, ఆస్తులను పలువురు దానంగా ఇచ్చారు. అయితే, వాటి నిర్వహణ భారంగా మారడంతో ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని యాజమాన్యాలు కోరగా నాటి ప్రభుత్వాలు అంగీకరించాయి. ఆయా కళాశాలలు, పాఠశాలల్లోని ఎయిడెడ్‌ సెక్షన్లలో పనిచేసే వారికి మాత్రం ప్రభుత్వం జీతం చెల్లిస్తుంది. అన్‌ఎయిడెడ్‌ సెక్షన్లలోని ఉపాధ్యాయులు, లెక్చరర్లను ఆయా యాజమాన్యాలే నియమించుకుని.. జీతాలిస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్న వారందరినీ విలీనం చేసుకోవడం ద్వారా సర్కారుపై కొత్తగా పడే భారం ఏమీ ఉండదు. పైసా ఖర్చు పెరగకుండానే ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ జాబితాలోకి వేల మంది టీచర్లు వచ్చేస్తున్నారు. 


ఈ పరిణామాలతో, ఇకపై డీఎస్సీలు, లెక్చరర్ల భర్తీ అనే మాట వినిపించడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ నిర్ణయం ప్రభావం మాత్రం ముందుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇరవై సంవత్సరాలకు పైబడి పనిచేస్తున్న అధ్యాపకులపై పడనుంది. వీరితో పాటు.. ఇంటర్‌ కాలేజీల్లో పనిచేసే 200 మంది జూనియర్ లెక్చరర్లు, 350మంది పాలిటెక్నిక్ అధ్యాపకులు కూడా నష్టపోనున్నారు. అటు.. త్వరలో ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్‌లోని 240 పోస్టులపైనా ప్రభావం పడనుంది. అటు ఎయిడెడ్ కళాశాలల్లో రిజర్వ్‌డ్ కేటగిరీ పోస్టుల భర్తీ కూడా నిలిచిపోనుంది. 




ఇదిలా ఉంటే..  ప్రభుత్వం ఎయిడెడ్ అధ్యాపకులను విలీనం చేయడం వల్ల వారికి ఎలాంటి లాభం కలుగకపోయినా.. ఇప్పటికే దశాబ్దాల తరబడి ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులపై నేరుగా ప్రభావం పడుతుంది. దీనికి తోడు.. దాదాపు పదేళ్ల పాటు నియామకాలు కూడా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. తక్షణం ముఖ్యమంత్రి ఈ అంశంపై పునరాలోచించి ముందుగా కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్దీకరించాలని కోరుతున్నారు.


- సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2021-09-14T03:11:32+05:30 IST