దావోస్ సదస్సులో పాల్గొనాలని జగన్‌కు ఆహ్వానం

ABN , First Publish Date - 2021-11-13T02:33:47+05:30 IST

2022లో జనవరి 17-21 మధ్య దావోస్‌లో నిర్వహించే డబ్ల్యూఈఎఫ్

దావోస్ సదస్సులో పాల్గొనాలని జగన్‌కు ఆహ్వానం

న్యూఢిల్లీ: 2022లో జనవరి 17-21 మధ్య దావోస్‌లో నిర్వహించే డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం పలికినట్లు డబ్ల్యూఈఎఫ్  ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండె వెల్లడించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండెని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మంత్రితో ఆయన మాట్లాడారు. ఈ సారి "వర్కింగ్ టుగెదర్, రీస్టోరింగ్ ట్రస్ట్" నేపథ్యంగా డబ్ల్యూఈఎఫ్ జరగనున్నట్లు బోర్జ్ వెల్లడించారు. ఆర్థికవృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బ్రెండెకి మంత్రి వివరించారు. ఏపీ పారిశ్రామిక విధానం, ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ, కరోనా నియంత్రణలో  ఏపీ ముందంజలో ఉందన్నారు. ఎక్కువ శాతం రికవరీ,  85శాతం వాక్సినేషన్ పూర్తి వంటి రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను మంత్రి మేకపాటి ద్వారా తెలుసుకుని  బోర్జ్ బ్రెండె అభినందించారు. ముఖ్యంగా కరోనా విపత్తు సమయంలో పరిశ్రమలకు అండగా నిలబడుతూ వర్క్‌ఫోర్స్ రక్షణ కోసం ప్రభుత్వం అనుసరించిన మార్గాలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలోపరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్ పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-13T02:33:47+05:30 IST