జగన్‌ మూర్ఖుడు!

ABN , First Publish Date - 2021-06-20T08:31:06+05:30 IST

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మూర్ఖత్వంలో జగన్‌ తన తండ్రి రాజశేఖర్‌రెడ్డిని మించి పోయారని మండిపడ్డారు

జగన్‌ మూర్ఖుడు!

తండ్రి రాజశేఖర్‌రెడ్డిని మించిపోయాడు

అక్రమ ప్రాజెక్టులతో నీళ్లు ఎత్తుకెళ్తున్నాడు

ఏపీ సర్కారు మొండిగా ముందుకెళ్తోంది

ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు

అవసరమైతే ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ధర్నా.. కేబినెట్‌ భేటీలో కేసీఆర్‌!


హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మూర్ఖత్వంలో జగన్‌ తన తండ్రి రాజశేఖర్‌రెడ్డిని మించి పోయారని మండిపడ్డారు. కృష్ణా బేసిన్‌లో ఏపీ సర్కారు అక్రమ ప్రాజెక్టులు చేపడుతున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన దాదాపు ఆరున్నర గంటలపాటు సుదీర్ఘంగా కేబినెట్‌ భేటీ జరిగింది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, వాటిని అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేబినెట్‌ భేటీలో ఏపీ సీఎం జగన్‌పై కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు అన్యాయం చేసే విషయంలో నాటి ఉమ్మడి ఏపీ సీఎం  రాజశేఖర్‌రెడ్డి కంటే మూర్ఖంగా జగన్‌ ముందుకెళ్తున్నారని అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌కు చట్టాలపై ఏమాత్రం గౌరవం లేదని, అక్రమ ప్రాజెక్టులే అందుకు నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీళ్లను ఎత్తుకుపోతున్నారని, దీనిపై తాము మౌనంగా ఉంటే తప్పు చేసినట్లవుతుందని అన్నారు. తమపై పూర్తి నమ్మకం పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్టేనని వ్యాఖ్యానించారు.


ఏపీ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేయాల్సిందేనని, ఇందుకోసం ఎక్కడివరకైనా పోరాటం చేద్దామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోవద్దని, అవసరమైతే టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలందరితో ఢిల్లీలో ధర్నా చేద్దామని అన్నారు. న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిద్దామని, వాస్తవాల ప్రాతిపదికన ముందుకెళ్దామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కృష్ణా బేసిన్‌లో ఏపీ సర్కారు కుట్రలను కట్టడి చేయటానికి మన దగ్గర కూడా ఏడెనిమిది ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుందామని అన్నారు. 



Updated Date - 2021-06-20T08:31:06+05:30 IST