జగన్‌ రైతు ద్రోహి

ABN , First Publish Date - 2022-07-03T09:05:26+05:30 IST

జగన్‌ రైతు ద్రోహి

జగన్‌ రైతు ద్రోహి

ఇలాంటి సీఎం ఎక్కడా లేరు

టీడీపీ అధికారంలోకి వచ్చాక స్వామినాథన్‌ సిఫారసుల అమలు 

వ్యవసాయరంగంలో పది అంశాలపై మహాసభ తీర్మానాలు


కాకినాడ, జూలై 2(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ రైతు ద్రోహి అని, నిత్యం మోసాలు, అబద్ధాలే ఆయన నైజమని  తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ‘ఎవరైనా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు. ఈయన మాత్రం రివర్స్‌లో వెనక్కి నడిపిస్తున్నాడు. జగన్‌ అంత కంత్రీ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరు. రాజ్యాంగేతర శక్తిగా మారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో వ్యవసాయరంగం పూర్తిగా నాశనమైపోయింది. రైతులకు కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చి వారిని నిలువునా మోసం చేస్తున్నాడు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల పేరుతో వారి మెడకు ఉరితాడు బిగిస్తున్నాడు. అప్పుల కోసం, మీటర్లపై వచ్చే కమీషన్ల కోసం కేంద్రం ముందు మోకరిల్లిపోయాడు’ అని విమర్శించారు. ఐదు జిల్లాల రైతులతో కూడిన టీడీపీ రైతుపోరు మహాసభ కాకినాడ జిల్లా జగ్గంపేటలో శనివారం జరిగింది. మాజీ మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, రైతు నాయకులు భారీగా పాల్గొన్న ఈ సభకు వేలాదిగా రైతులు తరలివచ్చారు. సభలో టీడీపీ నేతలు వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ పతనం ఖాయమని హెచ్చరించారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు.


రైతులు తిరగబడాలి

జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ రంగం తిరోగమనంలో పయనిస్తోందని టీడీపీ రైతు పోరు సభలో నేతలంతా దుయ్యబట్టారు. తొలుత వ్యవసాయశాఖ మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు ప్రసంగిస్తూ ఏపీని ఇప్పటివరకు పాలించిన ముఖ్యమంత్రులు రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తే, జగన్‌ మాత్రం 18.40లక్షల వ్యవసాయ మోటార్లున్న అన్నదాతలకు మీటర్ల రూపంలో ఉరితాళ్లు బిగిస్తున్నాడని మండిపడ్డారు. దీనికిఢిల్లీలో రైతుల ఉద్యమం తరహాలో ఇక్కడా ఉద్యమం రావాలని పిలుపునిచ్చారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వ విధానాల వల్ల భవిష్యత్తులో ఆహారభద్రత ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మాజీ విప్‌ కూనరవికుమార్‌ మాట్లాడుతూ ఆర్‌బీకేలు రైతు భక్షక కేంద్రాలుగా మారాయన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ప్రసంగిస్తూ కొడవలితో వ్యవసాయం చేసే చంద్రబాబును కాదని, పీకలు కోసే జగన్‌కు జనం అధికారమిచ్చ్టి తప్పుచేశారన్నారు. మాజీ మంత్రి జవహర్‌ మాట్లాడుతూ జగన్‌ అస్తవ్యస్త నిర్ణయాల వల్ల వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయి, రైతులు హైదరాబాద్‌, బెంగళూరు వలసపోయే పరిస్థితి దాపురించిందన్నారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రసంగిస్తూ జగన్‌ది శాడిస్టు పాలన అని ధ్వజమెత్తారు. రైతులకు వ్యతిరేకంగా మీటర్లు ఎవరు బిగిస్తారో చూద్దామని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయ మోటార్లకు మీటర్ల బగింపు ఆలోచన విరమణ సహా పలు డిమాండ్లతో తీర్మానాలు చేశారు. 

Updated Date - 2022-07-03T09:05:26+05:30 IST