Jagan సర్కార్ ఇచ్చిన స్ట్రోక్‌ నుంచి ఇంకా తేరుకోని YSRCP నేతలు.. మున్ముందు ఎలా ఉంటుందో..!?

ABN , First Publish Date - 2021-07-29T19:11:44+05:30 IST

జగన్ సర్కారు ఇచ్చిన స్ట్రోక్‌ నుంచి వైసీపీ నేతలు తేరుకోలేకపోతున్నారట...

Jagan సర్కార్ ఇచ్చిన స్ట్రోక్‌ నుంచి ఇంకా తేరుకోని YSRCP నేతలు.. మున్ముందు ఎలా ఉంటుందో..!?

శ్రీశైలం ట్రస్టు బోర్డు ఛైర్మన్ ఎంపికలో జగన్ సర్కారు ఇచ్చిన స్ట్రోక్‌ నుంచి కర్నూలు జిల్లా వైసీపీ నేతలు తేరుకోలేకపోతున్నారట. చిత్తూరు జిల్లా వాసిని ప్రభుత్వం  శ్రీశైల దేవస్థాన ఛైర్మన్ చేయడంపై లోకల్‌ నేతలు గుర్రుగా ఉన్నారట. సభ్యుల ఎంపికలోనూ జగన్ ప్రభుత్వం ఎలాంటి జలక్ ఇస్తుందోనని ఆందోళన చెందుతున్నారట. కర్నూలు జిల్లా వాసులకు పదవి దక్కకపోవడానికి కారణాలు అన్వేషించే పనిలో పడ్డారట నేతలు.. ఇంతకీ కర్నూలు జిల్లాలో ఏం జరిగింది..? జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంపై గుర్రుగా ఉన్నదెవరు..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


రూల్స్ మారిపోయాయ్..!

గతంలో ధర్మకర్తల సభ్యులను ప్రభుత్వం జీవో ద్వారా అధికారికంగా ప్రకటించిన తర్వాత సంబంధిత దేవస్థానం కార్యనిర్వాహక అధికారి ఆధ్వర్యంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేవారు. ప్రమాణ  స్వీకారం తర్వాత సభ్యుల్లో ఒకరిని ఛైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తే మిగతా సభ్యులు చేతులు పైకెత్తి సుముఖత తెలపడం సంప్రదాయంగా వచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు ధర్మకర్తల మండళ్లను నియమించే విషయంలో దేవాదాయ చట్ట సవరణ చేసింది. దీని ప్రకారం ఛైర్మన్ అభ్యర్థిని ప్రకటించినంత ఈజీగా మండలి సభ్యుల నియామకం ఉండదని, సభ్యుల ఎంపిక ప్రభుత్వానికి పెద్ద సవాల్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


తీవ్రంగా ఖండిస్తున్న జంగమ వర్గం!

ఇక వీరశైవ జంగమ సామాజిక వర్గం వారు శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డిని ప్రభుత్వం ప్రకటించడంపై తీవ్రంగా ఖండిస్తున్నారట. తమ పునాదికి మూలమైన శ్రీశైలం ట్రస్టు బోర్డు ఛైర్మన్ పదవి తమకు కావాలని పలుమార్లు జిల్లా మంత్రులు, జిల్లా ఇంచార్జీ మంత్రులకు విన్నవించారట. వారు సుముఖత వ్యక్తం చేయడంతో పదవి దక్కుతుందని బావించారట. అయితే చివరకు పొరుగు జిల్లా వ్యక్తికి చైర్మన్‌ పదవి కేటాయించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. జగన్ ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డివారి చక్రపాణి రెడ్డిని ఛైర్మన్‌గా ప్రకటించి తమకు తీవ్ర అన్యాయం చేసిందని వాపోతున్నారట. దేవాదాయ శాఖ చట్ట ప్రకారం జరగాల్సిన ఛైర్మన్ ఎంపిక, రాజకీయంగా మార్చి రాజకీయ నిరుద్యోగికి ఇచ్చారని మండిపడుతున్నారట.మండలి సభ్యుల విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు లోకల్‌ నాయకులు. మరోవైపు కొత్త మండలిలో తమకు స్ధానం దక్కుతుందా లేదా అని జిల్లాకు చెందిన ఆశావహులు ఆందోళనపడుతున్నారట.


చక్రం తిప్పింది ఆ మంత్రేనా..!?

శ్రీశైలం ట్రస్టు బోర్డు ఛైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేసిన కర్నూలు జిల్లా ఆశావహులకు జగన్ ప్రభుత్వం పంగనామాలు పెట్టిందనే చర్చ వైసీపీలో నడుస్తోందట. శ్రీశైలం ట్రస్టు బోర్డు ఛైర్మన్ పీఠం కోసం కర్నూలు జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు చాలా మంది పోటీ పడ్డారు. అయితే జిల్లా ఆశావహులను పక్కన బెట్టిన ప్రభుత్వం.. పొరుగు జిల్లాలకు చెందిన వ్యక్తిని ఛైర్మన్‌గా ప్రకటించింది. దీంతో ఆశావహులందరూ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. శ్రీశైలం ట్రస్టు బోర్డు ఛైర్మన్ ఎంపికలో ఓ మంత్రి చాలా కాలం నుంచి చక్రం తిప్పి ఫైనల్‌గా రెడ్డి వారి చక్రపాణిరెడ్డిని ఛైర్మన్ చేశారనే చర్చ జరుగుతోంది. ఆ మంత్రి వల్లే తమకు ఛైర్మన్ పీఠం దక్కకుండా పోయిందని కర్నూలు జిల్లా ఆశావహులు లోలోపల మథన పడుతున్నారట.


దూకుడు తగ్గించి..!

స్థానికంగా వస్తున్న ఒత్తిళ్లపై జగన్‌ సర్కార్‌ ఏవిధంగా స్పందిస్తోందో చూడాలని నాయకులు అనుకుంటున్నారట. మొత్తం మీద శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్ ఎంపికపై చెలరేగిన వివాదంతో నైనా ప్రభుత్వం దూకుడు తగ్గించి, మండలిలో సభ్యులుగా జిల్లా ఆశావహులకు అవకాశం కల్పిస్తుందా లేదా అదే చర్చ మొదలైంది.



Updated Date - 2021-07-29T19:11:44+05:30 IST