జగన్‌ పాలనపై ధ్వజమెత్తిన దళిత మహిళపై వైసీపీ దాడి

ABN , First Publish Date - 2022-05-18T09:38:24+05:30 IST

ఆక్రమణలో ఉన్న తన భూమి సమస్యపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడమే ఆమె నేరమైంది.

జగన్‌ పాలనపై ధ్వజమెత్తిన  దళిత మహిళపై వైసీపీ దాడి

కాళ్లతో తన్ని, గొంతు నులిమి, చీర చింపేసి తీవ్ర అవమానం


అమరావతి (ఆంధ్రజ్యోతి), తాడికొండ, మే 17: ఆక్రమణలో ఉన్న తన భూమి సమస్యపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడమే ఆమె నేరమైంది. జగన్‌ పాలనపై నిజం మాట్లాడటమే ప్రాణాలపైకి తెచ్చింది. ఇంటికి వెళ్లి మరీ ఆ దళిత మహిళపై వైసీపీ కార్యకర్తలు దాడిచేసి కొట్టారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. కంతేరు గ్రామానికి చెందిన కె. వెంకాయమ్మకు నాలుగున్నర సెంట్ల స్థలం ఉంది. అందులో మూడున్నర సెంటు ఆక్రమణకు గురికాగా న్యాయం కోసం చాలాకాలంగా తహసిల్దార్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్‌ పరిపాలనపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ‘‘జగన్‌ పాలన ఏడ్చినట్టు ఉంది. ఈ ప్రభుత్వంలో ఏ సమస్యా పరిష్కారం కావడం లేదు. ఈసారి చంద్రబాబే సీఎంగా గెలుస్తారు. కావాలంటే నాకున్న ఎకరన్నర పొలం పందెం పెడతాను’’ అంటూ ఆమె సవాలు చేశారు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన తనకు జగన్‌ పింఛను కూడా కట్‌ చేశారని, కరెంటు బిల్లు రూ.18 వేలు వచ్చినట్టు చూపి పథకాలన్నీ రద్దు చేశారని ఆక్రోశించారు. వెంకాయమ్మకు డయాలసిస్‌, టీబీ సమస్యలు ఉన్నాయి. ఇంజక్షన్‌ తీసుకోవడానికి సోమవారం సాయంత్రం తన అన్న ఇంటికి వెళ్లింది. దీంతో వెంకాయమ్మ భయపడి ఇంటికి తాళం వేసి ఊరు వదలి ఎటో వెళ్లిపోయిందని ఆ గ్రామంలోని వైసీపీ కార్యకర్తలు దుష్ప్రచారం చేశారు. ఆ విషయం తెలుసుకుని ఆమె రాత్రి పదిగంటల సమయంలో ఇంటికి వచ్చారు. ఇంతలోనే ఒక పథకం ప్రకారం అక్కడకు పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఆమెతో పెద్దపెద్దగా వాగ్వాదానికి దిగారు. ఇంట్లోకి చొరబడి వస్తువులు పగలగొట్టారు. దాడి చేసి గాయపరిచారు. దుర్భాషలాడుతూ..కాళ్లతో తంతూ..చీర కొంగుతో గొంతు నులుముతూ.. మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ‘‘నిన్ను చంపితేగాని జగన్‌ దగ్గర మాకు విలువ ఉండదు. నిన్ను చంపకుండా వదలం’’ అంటూ బెదిరించారు. తనకు ఆరోగ్యం సరిగా లేదన్నా వదిలిపెట్టలేదు. జగన్‌ను తిడతావా అంటూ చీరను చించేశారు. ‘‘ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయో... గ్రామంలో ఏ విధంగా నువ్వు ఉంటావో చూస్తాం’’ అని బెదిరించారు. తాడికొండ పోలీ్‌సస్టేషన్‌లో మంగళవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలన్నీ బాధితురాలు పేర్కొన్నారు. కాగా, దాడిచేసిన వైసీపీ కార్యకర్తలు వెంకాయమ్మపై తాడికొండ పోలీ్‌సస్టేషన్‌లో పోటీ ఫిర్యాదు చేశారు.


నాకు రక్షణ కావాలి: బాధితురాలు

‘‘రాష్ట్రంలో పాలన ఎలా ఉందో నిజం చెప్పినందుకు వైసీపీ నేతలు నాపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. నా జాకెట్టు చించారు. నేను డయాలసిస్‌ రోగిని. అయినా దయ చూపించకుండా కొట్టారు. నన్ను చంపేస్తామని, తిరగనివ్వబోమని హెచ్చరించారు. వారి నుంచి నాకు, నా కుమారుడికి రక్షణ కావాలి’’ అంటూ వెంకాయమ్మ విజ్ఞప్తి చేసింది. మంగళవారం ఆమె ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్‌ కుమార్‌, పిల్లి మాణిక్యాలరావును కలిసి తనపై జరిగిన దాడిని వివరించారు. ప్రశ్నించిన వారిని ఎవరినీ వైసీపీ నేతలు బతకనీయడం లేదని, దుర్మార్గంగా దాడి చేసి కొడుతున్నారని శ్రావణ్‌ ఆరోపించారు. ఆమెపై దాడి చేసిన వారిని తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఒంటరి దళిత మహిళపై దాడిచేసి కొట్టడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. వెంకాయమ్మపై జరిగిన దాడిని మహిళా కమిషన్‌ పరిగణనలోకి తీసుకొని, చర్యలు తీసుకోవాలని పిల్లి మాణిక్యాలరావు డిమాండ్‌ చేశారు. 


గుంటూరు ఎస్పీకి అచ్చెన్న లేఖ

దళిత మహిళ వెంకాయమ్మకు వైసీపీ మూకల నుంచి రక్షణ కల్పించాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గుంటూరు ఎస్పీకి లేఖ రాశారు. తన అసమ్మతిని తెలిపిందనే అక్కసుతో ఆమె ఇంటిని వైసీపీ వారు ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-05-18T09:38:24+05:30 IST