అమరావతి: సంక్షేమ పథకాల అమలుపై జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. సంక్షేమ పథకాలు దక్కాలంటే పేద ప్రజలు ఆరు నెలలు ఆగాల్సి వస్తోంది. అధికారంలోకి వచ్చాక వారంలోనే లబ్దిదారులను ఎంపిక చేస్తామన్న సర్కార్.. ఇకపై ఏడాదిలో రెండుసార్లే మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం ప్రభుత్వ ప్రకటనలు, వాలంటీర్ల గ్రూపుల్లో జోరుగా సాగుతోంది.
ఏపీలో వైసీపీ పాలన మూన్నాళ్ల ముచ్చటగానే కనిపిస్తోంది. సంక్షేమ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ... ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తోంది. రేషన్ కార్డు, పెన్షన్, ఇంటి స్థలం, ఆరోగ్యశ్రీ పథకాలు పొందాలంటే.. కనీసం ఆరు నెలలు ఆగాల్సిందేనని ప్రభుత్వ ప్రకటనలు, వాలంటీర్ల గ్రూపులలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ప్రభుత్వ నిర్ణయం ఇదేనని తెలుస్తోంది. ఇదే నిజమైతే కొత్త లబ్దిదారులకు ప్రయోజనాలు ఆలస్యం చేయడమే కాకుండా ప్రస్తుత లబ్దాదారులను ఇబ్బంది పెట్టడం దీని వెనుక ఉద్దేశంగా కనిపిస్తోంది. అసలు విషయాన్ని గమనిస్తే కొత్త లబ్దాదారులకు ఆరు నెలల నుంచి ఏడాదిపాటు పథకాలకు కోతపెట్టడడమే దీని ఉద్దేశమని ఇట్టే అర్థమవుతోంది.