Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

బీసీలపై బుల్డోజర్ల వికృత క్రీడ!

twitter-iconwatsapp-iconfb-icon
బీసీలపై బుల్డోజర్ల వికృత క్రీడ!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా సరే, వారు బుల్డోజర్లకు ఎదురెళ్ళక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు బుల్డోజర్ అంటే యంత్రం మాత్రమే కాదు. జగన్మోహన్ రెడ్డి విద్వేషానికి, విధ్వంసానికి అది చిహ్నంగా మారింది. ఏ నియంత పాలనలో కూడా కనపడని పగ, ప్రతీకారం, దౌర్జన్యకాండ జగన్ పాలనలో కనపడుతున్నాయి. కేవలం తనను విమర్శిస్తున్నారన్న అక్కసుతో అర్ధరాత్రి వందలమంది పోలీసులతో వచ్చి అయ్యన్న పాత్రుడి ఇంటి ప్రహరీ గోడను కూల్చివెయ్యడం ఎంత దారుణం? గతంలో ఏ ప్రభుత్వం అన్నా బీసీలపై ఇంత కక్షపూరితంగా వ్యవహరించిందా? మూర్తీభవించిన విద్వేషం ఉన్నవారే గిట్టనివారి ఆస్తులపై ఇంతటి విధ్వంసానికి ఒడిగట్టగలరు. అన్యాయంగా, అకారణంగా బీసీల ఇళ్ళను కూలుస్తున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఇదంతా చూస్తే బీసీల అణచివేతే ప్రభుత్వ లక్ష్యమేమో అనిపిస్తుంది.


జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన మరుక్షణం వారి ఇంటి నిర్మాణాలు స్థానిక మున్సిపలు అధికారికో, జిల్లా యంత్రాంగానికో చట్టవిరుద్ధమైనవిగా కనపడతాయి. నోటీసులేమీ లేకుండానే, సంజాయిషీకి వ్యవధి ఇవ్వకుండానే, ఎప్పుడో నిర్మించిన ఇళ్లను సైతం బుల్డోజర్లతో కూల్చి పారేస్తారు. జగన్ సొంత మీడియాలో జూన్ 15, 2022న ‘ఇదేం వైపరీత్యం’ పేరిట ఒక సంపాదకీయం వచ్చింది. ప్రజలపైకి బుల్డోజర్లు పంపుతున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‍ వైఖరిని ఆ సంపాదకీయం తీవ్రంగా నిరసించింది. ఉత్తరప్రదేశ్‌లో రాజ్యం తానే ఆరోపణలు చేసి, తానే నేర నిర్ధారణకు పూనుకొని, తనను తానే న్యాయమూర్తిగా భావించి శిక్షను కూడా ప్రకటించటం ఏం రాజ్యాంగం ప్రకారం సబబో యోగి ఆదిత్యనాథ్ ఆత్మావలోకనం చేసుకోవాలని ఆ సంపాదకీయం హితవు చెప్పింది. మరి జగన్ నేడు ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నది ఏ విధంగా దీనికి భిన్నం? జగన్మోహర్ రెడ్డికి ఒక నీతి, యోగి ఆదిత్యనాథ్‌కి మరో నీతా? జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్పడమే కానీ ఆచరించరా? మూడేళ్ళ క్రితం మీ పరిపాలన ప్రారంభమే బుల్డోజర్ల చప్పుడుతో మొదలైంది. చంద్రబాబు కట్టారన్న అక్కసుతో అర్ధరాత్రి ప్రజావేదికను కూల్చివేశారు. అదే బుల్డోజర్లతో మూడేళ్ళుగా బీసీ నాయకుల ఇళ్లను ధ్వసం చేస్తున్నారు. రెండు సెంట్లు ఆక్రమించుకున్నారన్న  ఆరోపణతో అర్ధరాత్రి ఆర్డీఓ, ఎస్పీతో సహా 300 మంది పోలీసులను ఉపయోగించి అయ్యన్న పాత్రుడి ఇంటి ప్రహరీ గోడను కూల్చారే, మరి తండ్రి అధికార పునాదులపై అచిరకాలంలోనే అవినీతి మహాసామ్రాజ్యాలు నిర్మించుకున్న జగత్ కంత్రీలకు ఎలాంటి శిక్షలు విధించాలి? ఇడుపుల పాయలో ఆక్రమించుకొన్న 600 ఎకరాల అసైన్డు భూమి విషయంలో ఏం జవాబు చెబుతారు? అయ్యన్నది నిజంగా అక్రమ కట్టడం అయితే అర్ధరాత్రి వందల మంది పోలీసులతో రావాల్సిన అవరం ఏమిటి?


ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంపై విమర్శలు చెయ్యడం, ప్రశ్నించడం సహజం. అంతమాత్రాన బరితెగించి ప్రతిపక్ష బీసీ నాయకుల ఇళ్లను కూల్చడం, ప్రహరీ గోడలు కూల్చడం, ఇతర ఆస్తులను ధ్వంసం చెయ్యడం, అక్రమ కేసులు బనాయించడం వంటి చర్యలకు తెగపడతారా? ప్రతిపక్షం ప్రజలపక్షాన నిలుస్తుంది. ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీస్తుంది. అలాగాక ప్రతిపక్షం కూడా ప్రభుత్వానికి భజన చెయ్యాలి అనుకోవడం అహంకారం అవుతుంది. మూడేళ్ళుగా హత్యలు, హత్యాయత్నాలు, అక్రమ కేసులు, గృహనిర్బంధాలు, కక్షసాధింపులు, ఆస్తుల ధ్వంసం, ఉద్యోగాల రద్దు, ఆత్మహత్యలకు ప్రేరేపించడం వంటి దారుణమైన పరిస్థితులు సృష్టించి రాష్ట్రంలో ఇక బీసీలు బతకాలా వద్దా అనేంతటి దుర్బరమైన పరిస్థితి కల్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భయభ్రాంతులకు గురిచేస్తూ వందలాది మంది బీసీలపై దాడులు చేసి బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు.


తెలుగుదేశం పార్టీ చోడవరంలో నిర్వహించిన మినీ మహానాడు విజయవంతం కావడం, ఆ సభలో సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులను అయ్యన్నపాత్రుడు విమర్శించడంతో ఆయనపై కక్ష గట్టారు. రెండుసెంట్ల స్థలం ఆక్రమించారంటూ చాలా ఏళ్ల క్రితం నర్సీపట్నం మున్సిపాలిటీలోని శివపురంలో నిర్మించుకున్న ఇంటి ప్రహరీని ఆదివారం తెల్లవారుజామున కూలగొట్టారు. విమర్శించిన వారిని మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యవహరిస్తుంది జగన్ ప్రభుత్వం. మొదట సీనియర్‌ నాయకుడైన సబ్బం హరి అధికార పార్టీ నిర్ణయాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారని ఆయనపై కక్ష గట్టింది. సీతమ్మధారలో ఆయన నిర్మించుకున్న భవనంలో జీవీఎంసీ పార్కుకు చెందిన ఆరు అడుగుల వెడల్పు మేర స్థలం కలిసిపోయిందంటూ, అందులో ఉన్న వాచ్‌మెన్‌ బాత్‌రూమును కూలగొట్టించింది. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసిన బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌కు చెందిన గీతం విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ భూమి ఉందని, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ప్రధాన ప్రవేశ ద్వారాన్ని కూలగొట్టించింది. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును వైసీపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆశ చూపించారు. తాను పార్టీ మారబోనని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దీంతో కక్షగట్టి గాజువాకలో ఆయన నిర్మిస్తున్న వాణిజ్య సముదాయాన్ని జీవీఎంసీ సిబ్బందితో కూలగొట్టించారు. అదేవిధంగా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద డాబా గార్డెన్స్‌లో వాణిజ్య సముదాయం నిర్మిస్తుండగా, ప్లాన్‌ ప్రకారం లేదని ఆరోపిస్తూ దానిని కూడా ఆదివారం రోజునే కూలగొట్టారు. ఇలాంటి పనులకే రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసు శాఖలను విస్తృతంగా వాడుకుంటున్నది జగన్ ప్రభుత్వం.


ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షాన్ని వేధించడం జగన్ ప్రభుత్వానికి ఒక వికృత క్రీడగా మారింది. ఈ తరహా దమన కాండ గత మూడేళ్ళుగా కొనసాగుతూనే ఉంది. చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారన్న కక్షతో మాజీ మంత్రి, శాసన సభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడిని అక్రమంగా గోడలు దూకి ఒక దొంగని అరెస్టు చేసినట్లు అరెస్టు చేశారు పోలీసులు. శస్త్రచికిత్స చేయించుకొని ఉన్నా, మందులు వేసుకోవాలన్నా అనుమతించకుండా 600కి.మీ. రోడ్డు మార్గంలో తీసుకు వెళ్లి ఆసుపత్రి పాల్జేశారు. ఉన్న గాయానికి ఇన్ఫెక్షన్ సోకటంతో మరోసారి శస్త్ర చికిత్స చేయాల్సిన దుస్థితిని కల్పించారు. అచ్చెన్నాయుడిని మొత్తం 80 రోజులకు పైగా కస్టడీలో ఉంచి వేధించారు. తహశీల్దారు కార్యాలయంలో ఫోటో తొలగించడాన్ని ప్రశ్నించినందుకు మాజీమంత్రి అయ్యన్న పాత్రుడిపై ఏకంగా అట్రాసిటీ కేసులు, నిర్భయ చట్టం కింద కేసులు పెట్టి వేధించారు. ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘనలను చట్టసభల వేదికగా అడ్డుకుంటున్నానన్న కారణంతో పెళ్ళిలో అక్షింతలు వేశానని నాపై అట్రాసిటీ కేసులు పెట్టారు. శాసన మండలి వేధికగా నాపై దాడి చేయడానికి ప్రయత్నించారు. శాసన మండలి సాక్షిగా బీదా రవిచంద్ర యాదవ్‌పై మంత్రులు దాడికి దిగారు. సౌమ్యుడైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కుటుంబ కక్షలతో జరిగిన రౌడీ షీటర్ హత్య కేసులో ఇరికించి వేధించారు. మాజీ విప్ కూన రవికుమార్‌పై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తిపై తప్పుడు కేసులు పెట్టారు. టీడీపీ అధికార ప్రతినిధి, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతూ తీవ్ర వేధింపులకు పాల్పడ్డారు. మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్ గంజి చిరంజీవిపై తప్పుడు కేసులు పెట్టారు. పెందుర్తిలో ఆళ్ల శ్రీనివాస రావు; కోడుమూరులో చరణ్ కుమార్, ఉరవకొండ సురేంద్ర, తంబళ్లపల్లి చౌడప్ప రామరాజు, కురబకోట సాంబశివ, పుంగనూరు గురుస్వామి, వినుకొండ నాసరయ్య యాదవ్‌లపై అక్రమ కేసులు బనాయించారు. ఈ మధ్య తన ఫోనుకి వచ్చిన మెసేజీని ఫార్వార్డ్ చేసినందుకు గౌతు శిరీషను సీఐడీ వారు విచారణకు పిలిచి వేధించారు. అనైతిక, అప్రజాస్వామిక విధానాల ద్వారా బీసీలను అణగదొక్కుతున్నది జగన్ ప్రభుత్వం. బీసీ సామాజిక వర్గానికి చెందిన వందలాదిమందిపై తప్పుడు కేసులు పెట్టింది. నిలువెల్లా ఇంత విషం నిండిన రాజకీయ నాయకుడిని ప్రపంచంలో ఎక్కడా ప్రజలు చూసి ఉండరు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది జగన్ ప్రభుత్వం. ఆత్మగౌరవానికై బీసీలు ఏకమై నినదించాల్సిన తరుణమిది.


యనమల రామకృష్ణుడు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.