అమరావతి: సీఎం జగన్కు ఉద్యోగులపై చిన్నచూపు ఎందుకు? అని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించమంటే జీతం ఇస్తున్నాం కదా అని మాట్లాడతారా అని నిలదీశారు. సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, డీఏ బకాయిల హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము దారిమళ్లింపు సిగ్గుచేటన్నారు. కరోనాతో చనిపోయిన ఉద్యోగులకు పరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ముఖం చాటేయడం సమస్యలకు పరిష్కారం కాదని సూచించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.