నిరసన.. తిరుమలలో జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ టీడీపీ, బీజేపీ శ్రేణుల డిమాండ్‌

ABN , First Publish Date - 2020-09-24T14:13:15+05:30 IST

శ్రీ వెంకటేశ్వరస్వామిపైన భక్తి విశ్వాసాలు వున్నాయని డిక్లరేషన్‌ ఇచ్చాకే..

నిరసన.. తిరుమలలో జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ టీడీపీ, బీజేపీ శ్రేణుల డిమాండ్‌

ముఖ్యనేతల హౌస్‌ అరెస్టులతో అడ్డుకున్న పోలీసు అధికారులు


తిరుపతి(ఆంధ్రజ్యోతి): శ్రీ వెంకటేశ్వరస్వామిపైన భక్తి విశ్వాసాలు వున్నాయని డిక్లరేషన్‌ ఇచ్చాకే తిరుమల ఆలయంలో సీఎం జగన్‌ అడుగుపెట్టాలన్న డిమాండును జిల్లా టీడీపీ, బీజేపీ శ్రేణులు బుధవారం బలంగా వినిపించాయి. తిరుమలలో డిక్లరేషన్‌ విషయమై సీఎంకు నిరసన తెలపాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు స్పందించాయి. ఎక్కడికక్కడ స్థానిక నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించగా ముఖ్యనేతలు తిరుపతిలో సీఎం జగన్‌కు తమ నిరసన తెలిపేందుకు సమాయత్తమయ్యారు.


అయితే ముందుజాగ్రత్తగా రంగంలోకి దిగిన పోలీసు బలగాలు ఎక్కడికక్కడ ముఖ్యనేతలను నివాసాలు దాటకుండా అడ్డుకుని గృహ నిర్బంధంలో వుంచాయి. పలుచోట్ల నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలు సైతం పాల్గొనగా బీజేపీ ముఖ్యనేతలను కూడా కొన్నిచోట్ల పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.దీంతో ముఖ్యమంత్రి పర్యటన సాఫీగానే సాగింది.


తిరుపతి నగరంలో బుధవారం ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకూ టెన్షన్‌తో కూడిన వాతావరణం ఏర్పడింది. సీఎం కాన్వాయ్‌కు అడ్డుపడి నిరసన తెలిపేందుకు టీడీపీ ముఖ్యనేతలైన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్‌ నరసింహయాదవ్‌  ఏర్పాట్లు చేసుకుంటూండగా వారిని పోలీసులు గృహ నిర్బంధంలో వుంచారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వరదరాజస్వామి ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి వారిని అక్కడ నుంచీ బలవంతంగా పంపివేశారు. వరదరాజస్వామి ఆలయం నుంచీ వెనుదిరిగిన పార్టీ శ్రేణులు నేరుగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసానికి చేరుకుని ఆమెను గృహ నిర్బంధం నుంచీ విడుదల చేయాలని గొడవకు దిగడంతో పోలీసులు మధ్యాహ్నం తర్వాత ఎట్టకేలకు ఆమెను గృహనిర్బంధం నుంచీ విడుదల చేశారు.


అనంతరం ఆమె కార్యకర్తలతో కలసి శ్రీవారి దారుశిల్పాన్ని చేతబట్టుకుని సీఎం జగన్‌ టీటీడీ డిక్లరేషన్‌పై సంతకం పెట్టాకే ఆలయంలోకి వెళ్ళాలంటూ డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి, పార్టీ జాతీయ నాయకురాలు శాంతారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.చిత్తూరులో జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానీ తిరుపతికి బయల్దేరుతుండగా పోలీసులు ఉదయాన్నే ఇంటిని చుట్టుముట్టారు. ఆయన్ను హౌస్‌ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే నానీ అభ్యర్థనపై ఆయన్ను పార్టీ కార్యాలయానికి వెళ్ళనిచ్చారు.


అయితే పోలీసు కాపలా ఏర్పాటు చేశారు. అక్కడ ఎమ్మెల్సీ దొరబాబుతో కలసి నానీ జిల్లావ్యాప్తంగా పార్టీ నేతలతో మాట్లాడి స్థానికంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించేలా నాయకులకు సూచనలు చేస్తూ గడిపారు. చిత్తూరులో వీరితో పాటు టౌన్‌ బ్యాంకు మాజీ ఛైర్మన్‌ షణ్ముగం, ముఖ్యనేత కటారి ప్రవీణ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ కాజూరు బాలాజీలను కూడా పోలీసులు గృహ నిర్బంధంలో వుంచారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ సైతం తిరుపతికి బయల్దేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను హౌస్‌ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. అక్కడే బీజేపీ కీలక నేత చల్లపల్లె నరసింహారెడ్డి నివాసాన్ని కూడా పోలీసులు చుట్టుముట్టి ఆయన్ను గృహ నిర్బంధానికి గురి చేశారు.


అదే విధంగా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి అనీషారెడ్డి, ఆమె భర్త శ్రీనాధరెడ్డి కూడా తమ స్వగ్రామమైన పెద్దపంజాణి మండలం కెళవాతిలో తిరుపతి వెళ్ళేందుకు సన్నద్ధమవుతుండగా పోలీసులు ఇంటిని చుట్టుముట్టి వారిని నిర్బంధంలో వుంచారు. బి.కొత్తకోటలో రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ సభ్యురాలు పర్వీన్‌ తాజ్‌ ఇంటి వద్దకు కూడా పోలీసులు వెళ్ళి ఆమె ఇల్లు దాటకుండా కాపలా కూర్చున్నారు.వెదురుకుప్పం మహాభారతం మిట్ట కూడలిలో టీడీపీ నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేయగా పెనుమూరు ఎన్టీఆర్‌ కూడలిలో టీడీపీ నాయకులు సీఎం జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందేనంటూ నినాదాలు చేశారు.


నాగలాపురం ధర్మరాజుల గుడి వద్ద టీడీపీ నేతలు డిక్లరేషన్‌ ఇవ్వకుండా జగన్‌ శ్రీవారి ఆలయంలోకి వెళుతుండడం పట్ల నిరసన ప్రదర్శన నిర్వహించారు.పలమనేరులో మారెమ్మ గుడి వద్ద టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందేనంటూ సీఎం జగన్‌కు ఉత్తరాలు రాసి పోస్టు చేశారు. పుత్తూరు, వడమాలపేట మండలాల్లో టీడీపీ, బీజేపీ నేతలను ఆందోళనల్లో పాల్గనకుండా పోలీసులు బైండోవర్‌ చేసుకున్నారు. కేవీపల్లె మండలంలో బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిచ్చాటూరు మండలం రామగిరి వాలీశ్వరస్వామి ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.చిత్తూరులో బీజేపీ నాయకులు సీఎం జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వకుండా శ్రీవారి ఆలయంలోకి వెళ్లరాదంటూ ఆర్డీవో రేణుకకు వినతిపత్రం అందజేశారు.




Updated Date - 2020-09-24T14:13:15+05:30 IST