కుర్చీ కోసమే మోదీకి జగన్‌ దాసోహం

ABN , First Publish Date - 2022-05-28T06:39:28+05:30 IST

తన కుర్చీని కాపాడుకోవడం కోసమే ప్రధానమంత్రి మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ దాసోహమైపోయారని మాజీ ఎంపీ, ఆదివాస్‌ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ ఉపాధ్యక్షురాలు, సీపీఎం నాయకురాలు బృందా కరత్‌ విమర్శించారు.

కుర్చీ కోసమే మోదీకి జగన్‌ దాసోహం
మాట్లాడుతున్న బృందా కరత్‌



మాజీ ఎంపీ బృందా కరత్‌ విమర్శ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు

ఏ విధంగా నష్టం చేస్తున్నాయో ప్రజలు గుర్తించాలి

పాడేరు, మే 27 (ఆంధ్రజ్యోతి): తన కుర్చీని కాపాడుకోవడం కోసమే ప్రధానమంత్రి మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ దాసోహమైపోయారని మాజీ ఎంపీ, ఆదివాస్‌ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ ఉపాధ్యక్షురాలు, సీపీఎం నాయకురాలు బృందా కరత్‌ విమర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నరేంద్రమోదీ ప్రజా సంక్షేమం కోసం కాకుండా బడా కార్పొరేట్‌ సంస్థల ఆస్తులను పెంచేందుకు మాత్రమే కృషిచేస్తున్నారన్నారు. ఆయన ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మిన్నకుంటున్నారన్నారు. జగన్‌ కుర్చీ కోసమే ఏ విషయంలోనూ మోదీని ప్రశ్నించడం లేదన్నారు. కేంద్రం సుప్రీంకోర్టు ద్వారా గిరిజనులకు సంబంధించిన జీవో-3ను రద్దు చేయిస్తే, దానిపై కేంద్రంతో పోరాటం చేయాల్సిన జగన్‌ మిన్నకున్నారన్నారు. అలాగే అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ చట్టాలకు మోదీ ప్రభుత్వం సవరణలు చేస్తుంటే...జగన్‌ ఏమీ మాట్లాడడం లేదన్నారు. ఆదివాసీ మాతృభాషా వలంటీర్లను తొలగించేశారని, రెన్యువల్‌ చేయాలని అనేక ఆందోళనలు చేసినా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చూస్తుంటే గిరిజనులపై వారికి ఏమాత్రం ప్రేమ ఉన్నదో తెలుస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఎలా నష్టం చేస్తున్నాయో ప్రజలే గుర్తించాలని బృందా కారత్‌ కోరారు.

2022లోనూ డోలీ మోతలా..?

ఇప్పటికీ రోడ్లు లేని గ్రామాలు, 2022లోనూ డోలీ మోతలు ఉండడం ఘోరమని బృందా కరత్‌ అన్నారు. ఆదివాసీ పల్లెలకు రహదారులు లేకపోవడంతో రోగులు, గర్భిణులను డోలీల్లో మోసుకుని ఆస్పత్రులకు తీసుకుని రావాల్సిన దుస్థితి చాలా బాధాకరమన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనే మోదీ, జగన్‌లకు లేదని ఆమె విమర్శించారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-05-28T06:39:28+05:30 IST