జగన్‌.. కరోనా.. కోరస్‌!

ABN , First Publish Date - 2020-05-03T06:26:49+05:30 IST

‘‘ఎన్నిప్రయత్నాలు చేస్తున్నా కరోనా వైరస్‌ను అరికట్టలేకపోతున్నాం. ఆ వైరస్‌ మనతోనే ఉంటుంది. కలిసి జీవించాల్సిందే! మామూలు జ్వరంలాంటి కరోనా గురించి ఎక్కువగా భయపడవద్దు. మందులు వేసుకుంటే అదే తగ్గిపోతుంది’’...

జగన్‌.. కరోనా.. కోరస్‌!

కరోనాను ప్రారంభంలో తేలికగా తీసుకోవడం వల్లనే కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలను ఇప్పుడు ఈ వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారే కరోనా కూడా మామూలు జ్వరంలాంటిదేనని చెబితే, లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రజలు మాత్రం ఎందుకు పాటిస్తారు? కరోనా వైరస్‌ మన దేశంలోకి ప్రవేశించడానికి ముందు అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. కరోనా కట్టడి విషయంలో ఆయన తీసుకుంటున్న చర్యలను 80 శాతానికి పైగా ప్రజలు సమర్థిస్తున్నారని వివిధ సర్వేలలో స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో జగన్‌ అండ్‌ కో కూడా కరోనాను సీరియస్‌గా తీసుకుని వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి మరింతగా కృషి చేయడం అవసరం.


ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాను కట్టడి చేయడం ఎలా? అని తలలు పట్టుకుంటూ ఉంటే, జగన్‌ అండ్‌ కో మాత్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. తమపై విమర్శలు చేసినవారిపై పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. అరెస్టులు చేయిస్తున్నారు. కరోనా నేపథ్యంలో చైనాలో నెలకొల్పిన తమ కంపెనీలను అక్కడ నుంచి తరలించాలని పలు సంస్థలు ఆలోచిస్తున్న విషయం తెలుసుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. వారు హైదరాబాద్‌ వైపు చూసేలా వ్యూహరచన చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అటువంటి ఆలోచన చేసే ఆసక్తి గానీ, తీరిక గానీ ఎవరికీ ఉన్నట్టు కనిపించడం లేదు. సంక్షోభంలో నుంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో అలాంటి గొప్ప ఆలోచనలు చేయగలవారు కనిపించడం లేదు.


ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని లక్ష్మీ ప్రసాద్‌ తీవ్రంగా విమర్శించడమే కాకుండా విశాఖ బీచ్‌రోడ్డులో చొక్కా విప్పి మరీ నిరసన దీక్ష చేశారు. సిలబస్‌ ఏదైనా పదో తరగతి వరకు తెలుగు సబ్జెక్టును విధిగా బోధించాలని ఆయనతోపాటు నేను కూడా కోరినవాడినే! ఇప్పుడు నేను మారలేదు గానీ లక్ష్మీప్రసాద్‌ మారిపోయారు. నా పిల్లలు ఏ మీడియంలో చదువుకున్నారని ఆయన ప్రశ్నించారు. నా పిల్లలకు ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో చదవడం, రాయడం కూడా వచ్చు. మనవడికి కూడా తెలుగు భాషను నేర్పిస్తున్నాను. ఇంగ్లిష్‌ మీడియంతోపాటు తెలుగు కూడా ఉండాలన్నది అప్పుడు– ఇప్పుడు నాబోటి వారి వాదన! అధికారాన్ని బట్టి అభిప్రాయాలు మార్చుకునే లక్ష్మీప్రసాద్‌కు నిన్నటివరకు ఎటువంటి గౌరవం ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ఆయన మిత్రులను అడిగితే బాగా చెబుతారు.


పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టి వాటిని తానే ప్రారంభిస్తున్నానన్న భ్రమను ప్రజల్లో వ్యాపింపజేసే విద్యను జగన్మోహన్‌రెడ్డి బాగానే అలవర్చుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి జగనన్న విద్యా దీవెన అన్న పేరు పెట్టి.. దాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి పేరిట ప్రకటనలు జారీ చేశారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం ఎప్పటినుంచో అమలులో ఉంది. దాన్ని కూడా తానే ప్రారంభిస్తున్నట్టుగా హడావుడి చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా పత్రికా రంగం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినందున, తన సొంత పత్రికకు ప్రభుత్వ నిధులు సమకూర్చే పథకంలో భాగంగా పాత పథకాలకు కొత్తగా కలరింగ్‌ ఇచ్చే స్కీమ్‌కు రూపకల్పన చేసినట్టుగా కనిపిస్తోంది.


‘‘ఎన్నిప్రయత్నాలు చేస్తున్నా కరోనా వైరస్‌ను అరికట్టలేకపోతున్నాం. ఆ వైరస్‌ మనతోనే ఉంటుంది. కలిసి జీవించాల్సిందే! మామూలు జ్వరంలాంటి కరోనా గురించి ఎక్కువగా భయపడవద్దు. మందులు వేసుకుంటే అదే తగ్గిపోతుంది’’.. ఇది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన! 


‘‘కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ముఖ్యమంత్రి తీసుకునే చర్యలను కేంద్రం అభినందిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీస్తోంది’’.. ఇది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా చేసిన కామెంట్‌! 


ప్రభుత్వంలో వన్‌ అండ్‌ టూగా ఉన్న ఈ ఇద్దరు ప్రముఖుల ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఎవరైనా అనుకుంటే అందుకు వారిదే బాధ్యత! ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇమేజ్‌ని పెంచడానికి ప్రయత్నించవలసిన బాధ్యత ఉంది కనుక విజయసాయిరెడ్డి ప్రభుత్వ చర్యలను ప్రశంసించి ఉంటారు. నేరుగా విలేఖరుల సమావేశాలు పెట్టడానికి కూడా సాహసించలేక వీడియో సందేశాలు రిలీజ్‌ చేస్తున్న జగన్మోహన్‌రెడ్డి మాత్రం కరోనా ఇప్పట్లో పోదనీ, దాంతో కలిసి జీవించాల్సిందేనని తేల్చిపారేశారు. ఆ వెంటనే అధికార పార్టీ నాయకులందరూ ‘అంతేగా.. అంతేగా..’ అని కోరస్‌ ఇవ్వడం మొదలెట్టారు. జగన్మోహన్‌రెడ్డి ప్రకటనలు చూశాక అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టక్కున గుర్తుకురాకుండా ఎందుకు ఉంటారు? ఆయన కూడా ఇలాగే.. ‘‘కరోనా లేదు.. గిరోనా లేదు. ఉండేవాళ్లు ఉంటారు.. పోయేవాళ్లు పోతారు.. లాక్‌డౌన్‌లు, మూతికి మాస్క్‌లు, చేతికి గ్లౌజులు.. ఏమిటీ నాన్సెన్స్‌.. ఆర్థికాభివృద్ధే ముఖ్యం’’ అని తేల్చిపారేశారు. కరోనా వైరస్‌ మానవాళిని కమ్మేయడం మొదలెట్టిన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవడమే కాకుండా ప్రపంచ దేశాల ముందు అమెరికా నవ్వులపాలైంది.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా విమర్శల పాలయ్యాయి. పాదయాత్ర సందర్భంగా గానీ, అంతకుముందు గానీ అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా విలేఖరుల సమావేశం కూడా పెట్టలేకపోవడం ఏమిటి? అని జనం ఆశ్చర్యపోతున్నారు. ఒంటి గంట ప్రాంతం లో రికార్డు చేసిన వీడియో సందేశాన్ని సాయంత్రం 6 గంటలకు విలేఖరుల సమావేశం రూపంలో విడుదల చేయడంపై సోషల్‌ మీడియాలో ఆడుకున్నారు. కరోనా వైరస్‌ జ్వరంలాంటిదే అయితే ప్రభుత్వాధికారులు ఎందుకంతగా హైరానా పడుతున్నారో ముఖ్యమంత్రి చెబితే బాగుండును. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మరణించినవారి సంఖ్య కంటే కేన్సర్‌ వంటి వ్యాధుల వల్ల ఏటా చనిపోతున్నవారి సంఖ్య అధికంగా ఉంటోందని జగన్‌ను సమర్థిస్తున్నవారు వాదిస్తున్నారు. అది నిజమే కావొచ్చును గానీ.. రాజు– పేద అన్న తేడా లేకుండా మొత్తం ప్రపంచాన్నే కబళించిన ఈ వైరస్‌ను కట్టడి చేయకపోతే పరిస్థితి ఏమిటన్నది వారు ఆలోచించుకోవాలి.


కేన్సర్‌ రోగుల కోసమో, మరో జబ్బు బారిన పడినవారి కోసమో ప్రత్యేకంగా తాత్కాలిక ఆసుపత్రులు నిర్మించిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవు కదా? కరోనా బారినపడి బతికి బయటపడ్డ వారికి మాత్రమే తెలుస్తుంది తాము ఎంత బాధ పడిందీ! గతంలో కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులు మానవ జాతిపై దండెత్తినప్పుడు జరిగిన ప్రాణ నష్టాన్ని మరిచిపోతే ఎలా? వైరస్‌ల మాదిరిగా ఇతర జబ్బులు మనుషులపై ఒక్కసారిగా విరుచుకుపడవు! గత వైరస్‌లతో పోల్చితే కరోనా వైరస్‌ వ్యాప్తి భిన్నంగా ఉంది. కలరా వంటి అంటువ్యాధులు కొన్ని దేశాలకే పరిమితం కాగా, కరోనా వైరస్‌ మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ కబళిస్తోంది. ఈ నేపథ్యంలో నియంత్రణలు విధించుకోకుండా, వైరస్‌ విస్తరణకు సహకరిస్తే దాని బారినపడిన వారికి చికిత్స చేసే వసతులు ఏ దేశంలో కూడా లేవు. ఈ కారణంగానే కరోనా వ్యాపించిన వూహాన్‌లో చైనా లాక్‌డౌన్‌ను అమలుచేసి వైరస్‌ను కట్టడి చేయగా.. మిగతా దేశాలు కూడా అదే బాటలో పయనించాయి. అయినా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల మంది మృత్యువాతపడ్డారు. ఈ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసి ఉండకపోతే ఇంకెన్ని లక్షల మంది చనిపోయి ఉండేవారో తెలియదు.


కరోనా మామూలు జ్వరంలాంటిదేనని జగన్‌ అండ్‌ కో ఇప్పటికీ వాదిస్తే మనం నోరు మూసుకోవడం మంచిది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రోజుకు 60 నుంచి 80 మంది ఈ వ్యాధిబారిన పడుతున్నారు. ఆంధ్రాలో కరోనా ఎక్కువ ఉన్నందున వ్యాపార అవసరాలు, వైద్య అవసరాలకు పక్కనే ఉన్న కర్నూలుకు ఎట్టి పరిస్థితులలోనూ వెళ్లవద్దని తెలంగాణలోని పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. సరిహద్దుల్లో గోడల నిర్మాణానికి తమిళనాడు అధికారులు పూనుకున్నారు. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్‌ గురించి పొరుగు రాష్ట్రాలవారు ఏమనుకుంటున్నారో అర్థంకావడం లేదా? ప్రపంచ దేశాధినేతలందరూ మూర్ఖులు.. తాము మాత్రమే తెలివైనవాళ్లమని జగన్‌ అండ్‌ కో భావిస్తే చేయగలిగింది ఏమీ లేదు. తాము పరీక్షలు అధికంగా జరుపుతున్నాం కనుక ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ప్రభుత్వం చెబుతున్న దాంట్లో వాస్తవం ఉండి ఉండవచ్చు. దేశ సగటు కంటే అధికంగా చేస్తున్నామని తెలంగాణలోనూ చెప్పుకుంటున్నారు కదా! నిజానికి ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలకు, వాస్తవానికి పొంతన ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన జనాభాతో పోలిస్తే జరుగుతున్న పరీక్షల శాతం బహు స్వల్పమనీ, ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహిస్తే కరోనా వ్యాధి సోకినవారి సంఖ్య ఎంతో స్పష్టంగా తెలుస్తుందనీ అంటున్నారు. అయితే ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించగల సాధన సంపత్తి మన దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల వద్ద కూడా లేదు.


ఈ కారణంగానే లాక్‌డౌన్‌ వంటి చర్యలతోపాటు భౌతిక దూరం పాటించడం ద్వారా మాత్రమే ఈ వ్యాధిబారిన పడకుండా కాపాడుకోగలమని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు ఇతర ముఖ్యమంత్రులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వమే కాదు.. ప్రైవేట్‌ రంగం కూడా ఆర్థికంగా భారీగా నష్టపోతున్నది. అయినా ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యం కనుక లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘‘బతికి ఉంటే బలుసాకు తినవచ్చు’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సమస్య ఉత్పన్నమైనప్పుడు దాని తీవ్రతను గుర్తించకపోతే జరిగే నష్టం ఏమిటో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికైనా అర్థమై ఉండాలి. కరోనా వైరస్‌ను ప్రారంభంలో తేలికగా తీసుకోవడం వల్లనే కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలను ఈ వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. కేన్సర్‌ వంటి జబ్బులకు, కరోనా వంటి అంటువ్యాధులకు ఎంతో తేడా ఉంటుంది. గతంలో కుష్టు, క్షయ వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు కూడా ప్రజలకు దూరంగా చికిత్సాలయాలు ఏర్పాటు చేశారు. ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారా ఇతరులకు వ్యాప్తిచెందకుండా నియంత్రించగలిగారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారే కరోనా కూడా మామూలు జ్వరంలాంటిదేనని చెబితే, లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రజలు మాత్రం ఎందుకు పాటిస్తారు? కరోనా మనదేశంలోకి ప్రవేశించడానికి ముందు అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. కరోనా కట్టడి విషయంలో ఆయన తీసుకుంటున్న చర్యలను 80 శాతానికి పైగా ప్రజలు సమర్థిస్తున్నారని వివిధ సర్వేలలో స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో జగన్‌ అండ్‌ కో కూడా కరోనాను సీరియస్‌గా తీసుకుని వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి మరింతగా కృషి చేయడం అవసరం.


యథా రాజా.. తథా ప్రజ!

కమ్ముకొస్తున్న కరోనాతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలు పరస్పరం బురద చల్లుకుంటూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందడానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు కుట్ర పన్నారనీ, స్లీపర్‌ సెల్స్‌ను ప్రయోగించారనీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తీవ్ర ఆరోపణ చేశారు. మంత్రులుగా ఉన్నవారు ఇంత బాధ్యతారహితంగా ఎలా మాట్లాడతారో తెలియదు. ఈ విమర్శలకు ప్రతిగా వైసీపీ నాయకులే కరోనాను వ్యాపింపజేస్తున్నారని చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకులు తిట్టిపోశారు. ఐఎస్‌ వంటి ఉగ్రవాద సంస్థలు కూడా ఇంతవరకు వైరస్‌ ప్రయోగాలకు పూనుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అధికార, ప్రతిపక్షాలు ఇలా ఆరోపించుకోవడం విడ్డూరంగా ఉంది. ‘యథా రాజా–తథా ప్రజా’ అని అంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఏమి చేస్తే ప్రీతిపాత్రమో తెలుసుకున్న వైసీపీ నాయకులు అదే చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాను కట్టడి చేయడం ఎలా? అని తలలు పట్టుకుంటూ ఉంటే, జగన్‌ అండ్‌ కో మాత్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. తమపై విమర్శలు చేసినవారిపై పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. అరెస్టులు చేయిస్తున్నారు.


కరోనా నేపథ్యంలో చైనాలో నెలకొల్పిన తమ కంపెనీలను అక్కడ నుంచి తరలించాలని పలు సంస్థలు ఆలోచిస్తున్న విషయం తెలుసుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. వారు హైదరాబాద్‌ వైపు చూసేలా వ్యూహరచన చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అటువంటి ఆలోచన చేసే ఆసక్తి గానీ, తీరిక గానీ ఎవరికీ ఉన్నట్టు కనిపించడం లేదు. సంక్షోభంలో నుంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో అలాంటి గొప్ప ఆలోచనలు చేయగలవారు కనిపించడం లేదు. ‘‘పారిశ్రామిక రంగాన్ని ఆదుకోండి’’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒక లేఖ మాత్రం రాశారు. సమీక్షా సమావేశంలో అధికారులు ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే... అన్ని వేల కోట్లతో, ఇన్ని వేల కోట్లతో సదరు సమస్యను పరిష్కరించేయండి అని చెబుతున్న ముఖ్యమంత్రి.. ఆ వేల కోట్లను ఎలా సమకూర్చుకోవాలో చెప్పడంలేదని అధికారులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదలచేస్తున్న ప్రకటనలను గమనిస్తే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో ఇవన్నీ ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోక తప్పదు.


పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టి వాటిని తానే ప్రారంభిస్తున్నానన్న భ్రమను ప్రజల్లో వ్యాపింపజేసే విద్యను జగన్మోహన్‌రెడ్డి బాగానే అలవర్చుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి జగనన్న విద్యా దీవెన అన్న పేరు పెట్టి.. దాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి పేరిట ప్రకటనలు జారీ చేశారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం ఎప్పటినుంచో అమలులో ఉంది. దాన్ని కూడా తానే ప్రారంభిస్తున్నట్టుగా హడావుడి చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా పత్రికా రంగం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినందున తన సొంత పత్రికకు ప్రభుత్వ నిధులు సమకూర్చే పథకంలో భాగంగా పాత పథకాలకు కొత్తగా కలరింగ్‌ ఇచ్చే స్కీమ్‌కు రూపకల్పన చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రతి నెలా ఇచ్చే పింఛన్‌ను కూడా కొత్తగా మొదలుపెట్టినట్టుగా శుక్రవారంనాడు హడావుడి చేశారు. ‘‘మాకు పబ్లిసిటీపిచ్చి లేదు.. మా ముఖ్యమంత్రి అటువంటి వాటికి దూరం’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు గానీ, వాస్తవంలో జరుగుతున్నది వేరు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామనీ, యేటా పది వేల రూపాయలు ఇస్తామనీ ఎన్నికల సందర్భంగా నమ్మబలికిన జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు.


నిజానికి తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే అలవికాని రీతిలో సంక్షేమ పథకాలు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలవడంతో వాటిని కుదించడం ఎలా? అన్న దానిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. నిజానికి కరోనా వైరస్‌ ప్రవేశించడానికి ముందే కొన్ని పథకాలను కుదించి, పన్నులు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇప్పుడు లాక్‌డౌన్‌ పుణ్యమా అని ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా దిగజారడంతో పన్నులు, చార్జీల పెంపు విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసి సాగునీటి పథకాలను పూర్తిచేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం అప్పులు చేసి సంక్షేమం పేరిట పంచిపెడుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తికాకముందే అడ్డగోలుగా అప్పులు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పడిపోయినందున ఉద్యోగుల జీతాలకు కూడా అప్పులు చేస్తారేమో తెలియదు. అమ్మ ఒడి వంటి రెండు మూడు పథకాలు మినహా మిగతావన్నీ పాతవే! అయినా వాటి అమలుకు నిధులు వెతుక్కోవలసిన దుస్థితిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధిపథంలో నడిపించడానికి గట్టి చర్యలు తీసుకోని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతారు.


లాక్‌డౌన్‌ తదనంతర పరిస్థితి ఏమిటో తెలియదు. ఆర్థిక రంగం కోలుకుంటుందో.. మరింత క్షీణిస్తుందో అనేది ఆర్థిక నిపుణులే సూటిగా చెప్పలేకపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం వీటన్నింటికీ అతీతం! ప్రభుత్వ ఖజానాలో నాలుగు రూపాయలు జమ అయితే చాలు.. పథకాల పేరిట పంచిపెట్టడానికే ఆరాటపడుతున్నారు. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలను భారీగా సడలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినందున రాష్ట్రంలో రెడ్‌ జోన్లు లేకుండా చేయడంపై జగన్మోహన్‌రెడ్డి దృష్టిసారించడం మంచిది. రాష్ట్రంలో ప్రధాన పట్టణాలు లేదా నగరాలుగా ఉన్న తిరుపతి, గుంటూరు, కర్నూలు, విజయవాడలు కరోనా కారణంగా మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు జిల్లాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించినందున అక్కడ కరోనా వ్యాప్తిని జ్వరం అని వదిలేయకుండా అరికట్టగలిగితేనే ప్రభుత్వం ఆర్థికంగా అంతో ఇంతో కోలుకుంటుంది. అంతవరకు మా ముఖ్యమంత్రి అంత గొప్ప– ఇంత గొప్ప అని చెప్పుకున్నా ఫలితం ఉండదు. ముఖ్యమంత్రి ఎంతటి పనిమంతుడో సర్టిఫికెట్లు ఇవ్వాల్సింది ప్రజలే! ‘‘దేశంలోనే ఆదర్శం, ప్రపంచంలోనే గొప్ప..’’ అని కీర్తించుకోవడం ఆత్మవంచనే అవుతుంది!


మారింది ఆయనే!

ఈ విషయం అలా ఉంచితే ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలుగు భాష ప్రాధాన్యాన్ని కాపాడాలన్నందుకు నన్ను కూడా పేరు పెట్టి విమర్శించారు. బాగా చదువుకున్నవాడు మాత్రమే కాకుండా మంచి వాగ్ధాటి కలిగి ఉన్న లక్ష్మీప్రసాద్‌ అంటే నాకు గౌరవమే! చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తెలుగు భాషకు ప్రాధాన్యం పోతోందనీ, శిలాఫలకాలను కూడా తెలుగులో రాయడం లేదనీ ఆయన నా వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. మాతృభాషను బతికించుకోవాలన్న ఆయన తపనతో నేను కూడా ఏకీభవించేవాడిని. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించడమే కాకుండా విశాఖ బీచ్‌రోడ్డులో చొక్కా విప్పి మరీ నిరసన దీక్ష చేశారు. సిలబస్‌ ఏదైనా పదో తరగతి వరకు తెలుగు సబ్జెక్టును విధిగా బోధించాలని ఆయనతోపాటు నేను కూడా కోరినవాడినే! ఇప్పుడు నేను మారలేదు గానీ లక్ష్మీప్రసాద్‌ మారిపోయారు.


నా పిల్లలు ఏ మీడియంలో చదువుకున్నారని ఆయన ప్రశ్నించారు. నా పిల్లలకు ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో చదవడం, రాయడం కూడా వచ్చు. మనవడికి కూడా తెలుగు భాషను నేర్పిస్తున్నాను. మాతృ భాషను చంపేస్తున్నా మౌనంగా ఉంటూ, ప్రభుత్వ కార్యాలయాలలో అమలుకు నోచుకోని అధికార భాష ‘తెలుగు’ గురించి అధికార భాషా సంఘం అధ్యక్షుడైన లక్ష్మీప్రసాద్‌ మాట్లాడాలనుకోవడం ఇప్పుడు అత్యాశే అవుతుంది. ఇంగ్లిష్‌ మీడియంతోపాటు తెలుగు కూడా ఉండాలన్నది అప్పుడు– ఇప్పుడు నాబోటి వారి వాదన! అధికారాన్ని బట్టి అభిప్రాయాలు మార్చుకునే లక్ష్మీప్రసాద్‌కు నిన్నటివరకు ఎటువంటి గౌరవం ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ఆయన మిత్రులను అడిగితే బాగా చెబుతారు. మాకు సిగ్గూ, ఎగ్గూ లేదని కూడా ఆయన విమర్శించారు. నిజానికి లక్ష్మీప్రసాద్‌కే ఈ రెండూ లేకుండా పోయాయని ఆయన భాషాభిమాన మిత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. మాతృభాషకే ఆదరణ లేనప్పుడు అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీ వంటి సంస్థలు ఎందుకు? వాటికి చైర్మన్లుగా ఉండి ఏమి ఉద్ధరిస్తారో లక్ష్మీప్రసాద్‌ చెబితే వినాలని ఉంది!

ఆర్కే



యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-05-03T06:26:49+05:30 IST