అబద్ధాల జగన్

ABN , First Publish Date - 2022-03-11T07:23:04+05:30 IST

అబద్ధాల జగన్

అబద్ధాల జగన్

డీఎస్పీ పదోన్నతులపై ఎన్నికల ముందు రచ్చ

37 మందిలో 35 మంది చంద్రబాబు కులమే

ఢిల్లీకి వెళ్లి ఎన్నికల కమిషన్‌కు జగన్‌ ఫిర్యాదు

వాస్తవాల కోసం నేడు టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్న

ఆరోపణలు అవాస్తవమని తేల్చిన సుచరిత

ఎవరికీ అన్యాయం జరగలేదని వెల్లడి


బాబు హయాంలో రెండు విడతల్లో పదోన్నతులు

ఒకసారి 35 మందికి, మరోసారి 36 మందికి

జాబితాలో అన్ని వర్గాల వారికీ చోటు

ఓసీలకంటే ఇతర వర్గాల వారే ఎక్కువ

అసెంబ్లీ సాక్షిగా తేలిన నిజం


నాడు జగన్‌ చెప్పిన అబద్ధం..

ఇదిగో.. ఆ జాబితా. దాదాపుగా 37 మందికి ప్రమోషన్‌ ఇస్తే.. అందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. చంద్రబాబు కులానికి చెందిన సీఐలకు నిబంధనలను తోసిరాజని పదోన్నతి ఇచ్చారు. 

- జగన్‌ (2019 ఫిబ్రవరిలో ఢిల్లీలో)


 నేడు సుచరిత చెప్పిన నిజం

2019 ఎన్నికల ముందు ఒకే సామాజిక వర్గానికి చెందిన సీఐలకు పదోన్నతి ఇచ్చారనడంలో వాస్తవం లేదు. అప్పుడు ఎవరికీ నష్టం జరగలేదు. అభ్యంతరాలను డీపీసీ ప్రక్రియలో పరిష్కరించాం. పదోన్నతుల జాబితాను జత చేస్తున్నాం!

- మేకతోటి సుచరిత, హోంమంత్రి


ఇదీ అసలు లెక్క...

2016-17, 2017-18 ప్యానల్‌ సంవత్సరాలలో 36మందికి డీఎస్పీలుగా ప్రమోషన్‌ వచ్చింది. వారిలో 17 మంది ఓసీలు, 12 మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ ఉన్నారు. ఓసీ అధికారుల విషయానికి వస్తే... అందులో ఐదుగురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. కాపు, రెడ్డి, బ్రాహ్మణ కులాల నుంచి ముగ్గురేసి అధికారులకు పదోన్నతి లభించింది. మరో ఇద్దరు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇంకొకరిది కూడా చంద్రబాబు కులం కాదు.


అమరావతి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ‘విశ్వసనీయత’కు చిరునామాగా... మాట తప్పని నేతగా చెప్పుకొనే వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలుగా అబద్ధాలు చెప్పినట్లు స్పష్టమైపోయింది. స్వయంగా ఆయన ప్రభుత్వంలోని హోంమంత్రి సభకు ఇచ్చిన సమాధానం సాక్షిగా... జగన్‌ అబద్ధపు ప్రచారం బట్టబయలైంది. ‘టీడీపీ ప్రభుత్వం 37 మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్‌ ఇవ్వగా... అందులో 35 మంది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే’ అని విపక్షంలో ఉండగా జగన్‌ ఆరోపించారు. ‘‘ఇదిగో డీఎస్పీల పదోన్నతి జాబితా. మొత్తం 37మంది సీఐలకు ప్రమోషన్‌ ఇస్తే అందులో 35మంది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే. ఒకే కులానికి పెద్దపీట వేశారు’ అని 2019 ఫిబ్రవరిలో ఢిల్లీకి వెళ్లి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అదే వీడియో క్లిప్‌ను వైసీపీ సోషల్‌ మీడియా బాగా వాడుకుంది. ‘ఔనా... నిజమేనా’ అనుకునేలా జనాన్ని నమ్మించారు. ఆ తర్వాత ఆయన పార్టీకి చెందిన అగ్రనేతలూ అదే పాట అందుకున్నారు. ఇది నిజం కాదని అప్పటి పోలీసు శాఖ పూర్తి వివరాలు ప్రకటించినా పదేపదే అదే అబద్ధం చెప్పారు. ఇప్పటికైనా నిజాలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, అశోక్‌ బెందాళం, మంతెన రామరాజు తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రశ్న అడిగారు. ‘‘2019 ఎన్నికలకు ముందు ఒకే సామాజిక వర్గానికి చెందిన 35 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించడం వాస్తవమేనా? వారి వివరాలు ఏంటి? నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి?’’ అని ప్రశ్నించారు. దీనికి హోంమంత్రి మేకతోటి సుచరిత లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై అప్పుడు జగన్‌ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని తేల్చేశారు. చంద్రబాబు హయాంలో రెండుసార్లు డీఎస్పీ పదోన్నతులు ఇచ్చారు. ఒకసారి 35 మందికి, మరోసారి 36 మందికి పదోన్నతులు వచ్చాయి. ‘‘2016-17, 2017-18 ప్యానెల్‌లో మొత్తం 36మంది పోలీసు అధికారులు డీఎస్పీలుగా ప్రమోట్‌ అయ్యారు. వారిలో 17 మంది ఓసీలు, 12 మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ అధికారులు ఉన్నారు’’ అని హోంమంత్రి తెలిపారు.  వెరసి... పదోన్నతి పొందిన సీఐలలో ఇద్దరు మినహా అందరిదీ చంద్రబాబు సామాజిక వర్గమే అని జగన్‌ చేసిన ఆరోపణ తప్పని తేలిపోయింది. అంతకుముందు ఇచ్చిన పదోన్నతుల్లోనూ ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగలేదని సుచరిత తెలిపారు. ‘‘2014-15, 2015-16 ప్యానెల్‌లో 35 మందికి ప్రమోషన్లు ఇవ్వగా... వారిలో 15 మంది ఓసీలు, 12 మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలు ఉన్నారు’’ అని హోంమంత్రి తెలిపారు. పదోన్నతి పొందిన అధికారి పేరు, పుట్టిన తేదీ, పదోన్నతి పొందిన తేదీ కూడా వెల్లడించారు. ‘వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కాదు’ అని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్పీల పదోన్నతుల్లో ఎవ్వరికీ అన్యాయం జరగలేదని ధ్రువీకరించారు.  ఏవైనా ఉన్నా డీపీసీ ప్రక్రియలోనే పరిష్కరించినట్లు వివరించారు.



Updated Date - 2022-03-11T07:23:04+05:30 IST