రాజధాని తరలింపు కుదరదన్న హైకోర్టు.. జగన్ సర్కారు ఏం చేస్తుందో..?

ABN , First Publish Date - 2020-03-20T21:02:16+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలుకు కార్యాలయాలు తరలింపుపై ప్రభుత్వానికి కోర్టు షాకిచ్చింది. కర్నూలుకు కార్యాలయాలు తరలింపు జీవోను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.

రాజధాని తరలింపు కుదరదన్న హైకోర్టు.. జగన్ సర్కారు ఏం చేస్తుందో..?

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలుకు కార్యాలయాలు తరలింపుపై ప్రభుత్వానికి కోర్టు షాకిచ్చింది. కర్నూలుకు కార్యాలయాలు తరలింపు జీవోను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ జీవోను ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. దానికి అనుగుణంగా విశాఖలో ఎగ్జిక్వూటివ్ కేపిటల్, కర్నూలులో జుడీషియల్ కేపిటల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా జీవో 13ను ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యంగా కోర్టు సంబంధిత, న్యాయపరమైన అన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ విభాగాలు జీఐడీలో భాగంగా ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ఈ రెండు శాఖలు కూడా సెక్రెటేరియట్‌లో భాగంగా ఉన్నాయి. అయినప్పటికీ వీటిని న్యాయపరమైన విభాగాలుగా ప్రభుత్వం ముడిపెట్టి తరలించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ శాఖలను కర్నూలుకు తరలించి అక్కడ ఆఫీస్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కొద్ది రోజుల క్రిందట అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 


ఇందుకోసం జీవో 13ను సీఎస్ నీలం సాహ్నీ విడుదల చేసినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.. అయితే ఈ జీవోలో సీఎస్ సంతకం లేకపోవడం... అదేవిధంగా ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ రాజధాని పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక్కడి నుంచి ఏ విధంగా కార్యాలయాలు తరలిస్తున్నారు? జీఐడీలో భాగంగా ఉన్న విజిలెన్స్ కమిషరేట్‌ను తరలించడానికి వీలులేదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. అయితే అప్పట్లో ధర్మాసనం ఈ తీర్పును రిజర్వులో పెట్టింది.  శుక్రవారం ఈ కేసుపై కోర్టు తీర్పును వెలువరించింది. జీవో 13ను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే స్థలాభావం కారణంగా అమరావతి నుంచి తరలిస్తున్నామని ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. ప్రభుత్వ వాదనలను హైకోర్టు తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ స్థలాభావం ఉంటే అమరావతికి పక్కనే కార్యాలయాలు ఏర్పాటు చేయాలి కానీ.. కర్నూలు తరలించడం వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం కోర్టు వ్యక్తం చేసినట్లు సమాచారం.


రాజధాని మార్పులో కీలక ప్రక్రియగా హైకోర్టు కార్యాలయాల తరలింపును ఏపీ సర్కారు భావిస్తోంది. హైకోర్టు తరలింపు సజావుగా జరిగితే.. ఆ తర్వాత ఇతర ప్రభుత్వ కార్యాయాలను కూడా విశాఖకు తరలించి.. రాజధాని మార్పు ప్రక్రియను సంపూర్ణం చేయాలని సర్కారు తలంపుగా ఉంది. అయితే ఆదిలోనే ఈ ప్రక్రియకు ఏపీ హైకోర్టు చెక్ పెట్టినట్లయింది. హైకోర్టు తరలింపు కుదరదని తేల్చిచెప్పడంతో.. ఇతర శాఖల తరలింపు గురించి ఏం చేయాలా..? అని సర్కారు పునరాలోచనలో పడింది. హైకోర్టు సూచన మేరకు తరలింపు ప్రక్రియకు పులుస్టాప్ పెడుతుందా..? లేదా.. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఏపీ సర్కారు మరేదైనా వివాదాస్పద నిర్ణయం తీసుకుంటుందా..?.. అనేది తేలాలంటే.. కొద్ది కాలం వేచిచూడాల్సిందే.. 

Updated Date - 2020-03-20T21:02:16+05:30 IST