England vs India: బుమ్రా మెరుపులతో ముగిసిన భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్

ABN , First Publish Date - 2022-07-02T21:48:14+05:30 IST

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ (Rescheduled match)లో భారత్ తొలి ఇన్నింగ్స్ 416 పరుగుల వద్ద ముగిసింది

England vs India: బుమ్రా మెరుపులతో ముగిసిన భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌ (England)తో జరుగుతున్న తొలి టెస్ట్ (Rescheduled match)లో భారత్ (India) తొలి ఇన్నింగ్స్ 416 పరుగుల వద్ద ముగిసింది. తొమ్మిదో వికెట్‌గా రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ బుమ్రా (Jasprit Bumrah) మెరుపులు మెరిపించాడు. బ్రాడ్ బౌలింగులో శివాలెత్తి ఫోర్లు,  సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో భారత్ స్కోరు పరుగులు పెట్టింది. బ్రాడ్ వేసిన తొలి బంతిని బౌండరీకి తరలించి ఉద్దేశాన్ని చాటిన బుమ్రా.. ఆ తర్వాత 6, 4, 4, 4, 6 కొట్టి అభిమానులను ఉర్రూతలూగించాడు.


ఆ ఓవర్లో భారత్‌కు ఏకంగా 35 పరుగులు వచ్చాయి. ఇందులో ఐదు వైడ్లు ఉండడం గమనార్హం. మొత్తంగా 16 బంతులు ఎదుర్కొన్న బుమ్రా 4 ఫోర్లు, 2  సిక్సర్లతో 31 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి దెబ్బకు భారత్ స్కోరు 400 మైలురాయిని దాటి 416 పరుగులు వద్ద ఆగింది. 2 పరుగులు చేసిన సిరాజ్ (Mohammed Siraj).. అండర్సన్ బౌలింగులో అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. 


అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 338/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ అదే నిలకడ కొనసాగిస్తూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 83 పరుగులతో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా మరో 17 పరుగులు జోడించి టెస్టుల్లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 183 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లతో శతకం సాధించాడు.  అయితే, ఆ తర్వాత కాసేపటికే  అతడికి అండగా నిలిచిన షమీ (Mohammed Shami) అవుటయ్యాడు.


16 పరుగులు మాత్రమే చేసిన షమీ.. బ్రాడ్ బౌలింగులో జాక్ లీచ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి రోజు  వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. 111 బంతుల్లో 20 ఫోర్లు, 4  సిక్సర్లతో 146 పరుగులు చేసి భారత్ పటిష్ఠ స్థితికి చేరుకోవడానికి పునాదులు వేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు తీసుకోగా, మ్యాటీ పాట్స్ 2, స్టోక్స్, రూట్ చెరో వికెట్ పడగొట్టారు. 

Updated Date - 2022-07-02T21:48:14+05:30 IST