జాక్‌ మా... కనిపించారు...

ABN , First Publish Date - 2021-01-21T22:06:20+05:30 IST

చైనా వ్యాపారవేత్త, అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా... మూడు నెలల తర్వాత మళ్లీ దర్శనమిచ్చారు. జిన్‌పింగ్‌ ప్రభుత్వాగ్రహానికి గురై అక్టోబరు నుంచి కనిపించకుండా పోయిన జాక్‌ మా... వంద మంది గ్రామీణోపాధ్యాయులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారంటూ చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌' వెల్లడించింది.

జాక్‌ మా... కనిపించారు...

షాంఘై : చైనా వ్యాపారవేత్త, అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా... మూడు నెలల తర్వాత మళ్లీ దర్శనమిచ్చారు. జిన్‌పింగ్‌ ప్రభుత్వాగ్రహానికి గురై అక్టోబరు నుంచి కనిపించకుండా పోయిన జాక్‌ మా... వంద మంది గ్రామీణోపాధ్యాయులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారంటూ చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌' వెల్లడించింది. అలీబాబా ప్రధాన కార్యాలయమున్న జెజియాంగ్‌ ప్రావిన్స్‌లోని ఓ న్యూస్ ఛానల్ ఈ వార్తను మొదట ప్రసారం చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ‘గ్లోబల్‌ టైమ్స్‌' పత్రిక ఛీఫ్‌ రిపోర్టర్‌ కింగ్‌ కింగ్‌ చెన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. 


జాక్‌ మా అదృశ్యం కాలేదని, బుధవారం ఉదయం 100 మంది గ్రామీణోపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారని, కొవిడ్‌-19 అంతమైన తర్వాత మళ్లీ కలుద్దామని జాక్‌ మా ఈ సందర్భంగా వారికి చెప్పారని చెన్‌ వెల్లడించారు. అయితే... ఇందుకు సంబంధించిన వీడియోను ఫోన్‌లో రికార్డు చేసినట్లు ఉండటంతో ఇప్పటికీ అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. 


గతేడాది అక్టోబరు24 న షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ... చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను జాక్‌ మా తారస్థాయిలో విమర్శించారు. దీంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన జిన్‌పింగ్‌ ప్రభుత్వం... జాక్‌ మాపై ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. ఆయన వ్యాపార సంస్థలపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది.


ఈ క్రమంలోనే... అలీబాబా యాంట్‌ ఫైనాన్షియల్‌ గ్రూపు ఐపీవోను అడ్డుకుంది. ఈ నేపధ్యంలో... జాక్‌ మా ఆస్తులు కరిగిపోయాయి. అప్పటి నుంచీ ఆయన కనిపించకుండా పోయారు. ఈ నేపధ్యంలోలో ఉపాధ్యాయులతో జాక్‌ మా  భేటీ అయినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఆ వీడియోలో నిజమెంతన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-01-21T22:06:20+05:30 IST